మణక్కాల్ నంబి

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

గత సంచికలో మనము ఉయ్యక్కొండార్ల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల  గురించి తెలుసుకుందాము.

మణక్కాల్ నంబి
మణక్కాల్ నంబి – మణక్కాల్

తిరునక్షత్రం: మాఘ మాసము, మఖా నక్షత్రము
అవతారస్థలం: మణక్కాల్ (శ్రీరంగం దగ్గరలో కావేరి ఒడ్డున ఉన్న ఒక గ్రామము)
ఆచార్యులు: ఉయ్యకొండార్
శిష్యులు: ఆళవందార్, తిరువరంగ పెరుమాళ్ అరయర్ (ఆళవందార్ల పుత్రుడు),
దైవతుక్కరసు నంబి, పిళ్ళై అరసునంబి, శిరుపుళ్ళూరుడైయార్ పిళ్ళై, తిరుమాలిరుంశోలై దాసర్, వంగిపురత్తు ఆయ్చి.

శ్రీరామమిశ్రులు మణక్కాల్ అనే గ్రామంలో జన్మించిరి. తరువాతి కాలములో మణక్కాల్ నంబిగా ప్రసిద్ధి పొందిరి.

ఉయ్యక్కొండార్ మణక్కాల్ నంబి వారి ఆచార్యులు. నంబి 12 సంవత్సరములు ఆచార్యుల కైంకర్యం చేస్తున్న సమయంలో గురుపత్ని పరమపదించెను. ఆ కారణం చేత మణక్కాల్ నంబి తమ ఆచార్యుల తిరుమాళిగను (గృహమును), పిల్లలను, కుటుంబ బాధ్యతలన్నీ చూసుకునేవారు. ఒక రోజు, ఆచార్యుని కుమార్తెలు కావేరి నది దాటి వస్తుండగా ఒక బురద గుంట అడ్డువచ్చేసరికి దాట లేక ఆగిపోయింది. వెంటనే ఆమె దాటుటకు అనుకూలముగా నంబి ఆ గుంటకు అడ్డుగా పడుకొనెను. ఆమె నంబి మీద కాలుమోపి ఆ గుంటను దాటెను. అది విన్న ఉయ్యక్కొండార్లు మిక్కిలి సంతోషించి నంబిని ప్రేమతో నిమిరెను. వారు నంబిని ఏమి కావాలో అడుగగా, ఆచార్యుడి సేవయే కావాలని, అదే తనకు ఉద్ధారకమని చెప్పెను. శిష్యుని నడువడిక / కోరికను చూసి సంతోషించి నంబికి మరల ఒకసారి ద్వయ మంత్రోపదేశమును చేసెను. (ఆచార్యులకు శిష్యుల కైంకర్యం నచ్చినప్పుడు ద్వయ మంత్రోపదేశము చేయుట సాంప్రదాయం).

ఉయ్యక్కొండార్లు పరమపదించు సమయమున మణక్కాల్ నంబిని తన తరువాతి సిద్ధాంత ప్రవర్తకుడిగా నియమించి; ఈశ్వరముని తనయుడిని (ఆళవందార్) సాంప్రదాయ ప్రవర్తకుడిగా తీర్చిదిద్దమని ఆదేశించెను. ఈశ్వరమునులు కాలాంతరమున యమునైతురైవర్లను సంతానముగా పొందెను. వారికి నంబి పంచ సంస్కారములను గావించెను. (జన్మించిన 11వ రోజున శంఖ చక్ర లాంఛనము (పాలల్లో అద్ది) నామకరణ సమయములో చేయుట సాంప్రదాయం. తిరుమంత్రార్థ ఉపదేశము, తిరువారాధనము యుక్త వయస్సు వచ్చిన పిమ్మట నేర్చుకొనే ఆణావాయితీ ఉండేది).

యమునైతురైవర్ ఎంతో తెలివిమంతులు, ఆళవందార్లగా ప్రసిద్ధులై, అర్ధరాజ్యమును పొంది, రాజ్య పరిపాలనలో మునిగి తన స్వరూపమును మరిచిపోయిరి. ఒకనాడు నంబి ఆళవందార్లను కలుసుకోవాలని వెళ్ళగా అక్కడి సిబ్బంది వారిని అడ్డుకొనిరి.

మణక్కాల్ నంబి ఆళవందార్లను మార్చుటకు పూనుకొని, ఉపాయములో భాగముగా అంతఃపుర వంట వానికి ప్రతిరోజు తూతువళై కీరై (అలర్కపత్రం/ముండ్లముస్తెకూర. దీని విశేషమేమనగా ఆరుమాసములు క్రముముగా తిన్నచో వైరాగ్యగుణము వృద్ధి చెందునట) ని ఇవ్వసాగిరి. ఆళవందార్లకు ఆ కూర బాగా నచ్చెను. ఒకనాడు నంబి ఆ కూరనివ్వలేదు. ఆ కూర భోజనమున లేకపోవడంతో వంట వారిని అడుగగా వారు ఈ విధముగా విన్నవించిరి. ప్రతిరోజు ఒక వృద్ధ శ్రీవైష్ణవుడు తెచ్చి ఇచ్చేవారని, ఈ వేళ తీసుకురాలేదని చెప్పిరి. చివరకు అతను ఎవరా అని కనుక్కొనగా, వారు మణక్కాల్ నంబి అని తెలుసుకొని అంతఃపురమునకు ఆహ్వానించిరి. వారికి ఉచితాసనము వేసి ధనము కావలనేమొ అని అడుగగా; నంబి ఈ విధముగ చెప్పెను – మీ తాతగారైన నాథమునులచే సంపాదించబడిన అపారధనరాశి (శ్రీవైష్ణవ శ్రీ) నావద్దనే ఉన్నదని, అది మీకు అప్ప చెప్పుదామనుకుంటున్నాను అని చెప్పిరి. అది విన్న ఆళవందార్లు తన సిబ్బందికి నంబి ఎప్పుడు వచ్చినా అడ్డుకోవద్దని ఆజ్ఞాపించెను.

మణక్కాల్ నంబి భగవద్గీతార్థమును ఆళవందార్లకు బోధించెను. అలా ఆళవందార్లు క్రమంగా వారి పూర్వ స్వరూపమును పొందిరి. పూర్తిగా మారిన ఆళవందార్లు భగవత్ సాక్షాత్కారమును పొందుటకు సాధనముగా సారతమమును తెలుపమని ప్రార్థించెను. అప్పుడు నంబి చరమ శ్లోకార్థమును వివరించెను. తరువాత ఆళవందార్లను తిరువరంగమునకు కొని పోయి పెరియ పెరుమాళ్ళను దర్శింప చేసెను. పెరియ పెరుమాళ్ళ సౌందర్యమును చూసి ఆళవందార్లు  బాహ్య ప్రపంచమును, సంసారమును త్యజించెను.

ఆచార్యుని కోరిక తీర్చిన పిమ్మట మణక్కాల్ నంబి ఎంతో ఆనందముగా పరమపదమునకు చేరుకొనెను. నాథమునులను ధ్యానిస్తు సంప్రదాయమును కాపాడుతు ప్రచారము చేయమని నంబి ఆళవందార్లను ఆదేశించెను. అదే విధముగా తదుపరి సాంప్రదాయ ప్రవర్తకున్ని ఒకరిని నియమించమని ఆదేశించెను. ఆ తరువాత ఆళవందార్లు ఎంబెరుమానార్లను (రామానుజులను) సంప్రదాయ ప్రవర్తకుడిగా నిమమించడం మనకు విదితమే.

మణక్కాల్ నంబి తనియన్ :

అయత్నతో యామున మాత్మదాసం అలర్క పత్రార్పణ నిష్క్రయేణ|
యఃక్రీతవా నాస్ధితయౌవరాజ్యం నమామి తమ్ రామమేయసత్త్వమ్||

సీతా రామాంజనేయ దినేష్ రామానుజ దాస

మూలము: https://acharyas.koyil.org/index.php/2012/08/25/manakkal-nambi-english/

పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org