నమ్మాళ్వార్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వవరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

గత సంచికలో మనం విష్వక్సేనుల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు నమ్మాళ్వార్ల గురించి చూద్దాం.

 నమ్మాళ్వార్

తిరునక్షత్రం: వైశాఖ మాసము, విశాఖా నక్షత్రం.
అవతారస్థలం: ఆళ్వార్తిరునగరి
ఆచార్యులు: విష్వక్సేనులు
శిష్యులు: మధురకవి ఆళ్వార్, నాథమునులు తదితరులు

నమ్మాళ్వార్లకి మాఱన్, శఠగోపులు, పరాంకుశులు, వకుళాభరణులు, వకుళాభిరాములు, మఘిళ్ మాఱన్, శఠజిత్, క్కురుగూర్ నంబి అను నామధేయములు ఉన్నవి.

కారి, ఉడయనంగై అను పుణ్య దంపతులకు తిరుక్కురుగూర్ (ఆళ్వార్తిరునగరి) అను గ్రామమున నమ్మాళ్వార్లు జన్మించిరి. కలియుగం ప్రవేశించిన కొద్ది రోజులకు నమ్మాళ్వార్లు అవతరించిరి. భగవద్గీతలో గీతాచార్యుడు ఈ విధముగా చెప్పెను, “అనేక జన్మల ఎత్తిన తరువాత, ప్రతీదీ వాసుదేవుడికి చెందినదన్న అభిప్రాయమునకు వచ్చుదురు. అలాంటి జ్ఞానులు అరుదుగా కనపడతారు”. పెరుమాళ్ళకు ఆప్తుడైన నమ్మాళ్వార్ల చరిత్రను, వారి శ్రీసూక్తి గ్రంథములను గమనిస్తే, వీరు అటువంటి జ్ఞానియే అని నిర్ధారణ చేయవచ్చును. వీరు తమ జీవిత కాలము (32 సంవత్సరములు) అంతా చింత చెట్టు (తిరుపుళియాళ్వార్) క్రిందనే గడిపారు. నిత్యము యోగము నందు ఉండి భగవత్ స్మరణ చేస్తుండేవారు. తిరుక్కురుగూర్ అనే శబ్దము వినగానే (తిరువాయ్మొళి సేవించు సమయమున ప్రతి పదిగము ఫలశృతి పాశురములో నమ్మాళ్వార్ల పేరు, వారి పేరుకు ముందు వీరు అవతరించిన స్థలము క్కురుగూర్ అని వచ్చును. ఆళ్వార్ తిరునామం, అవతారస్థలం ఉచ్చరించగానే, దక్షిణ దిశగా (ఆళ్వార్తిరునగరి – ఆ దిశలో ఉన్నందున) అంజలి సమర్పించాలని మన పూర్వాచార్యులు నియమనం.

నమ్మాళ్వార్లు ప్రపన్న జనకూటస్థులుగా పరిగణింపబడతారు. అనగా ప్రపన్న గోష్ఠికి  ప్రప్రథములు, అలాగే వైష్ణవ కులపతిగా కీర్తింపబడ్డారు. ఆళవందార్లు తమ స్తోత్ర రత్నమున 5వ శ్లోకమున – తనకు, తనవారికి, తన తరువాతి తరాల వారందరికి సర్వస్వమైన (అనగా తండ్రి, తల్లి, తనయులు, సంపద మొ॥) వకుళాభిరాముల పాద పద్మములకు  ప్రణమిల్లుతున్నానని స్తుతించారు.

శయన తిరుక్కోలంలో ఆళ్వార్లు, వీరి పాదాల వద్ద రామానుజులు – ఆళ్వార్తిరునగరి

ఎంబెరుమానార్లు ఆదిశేషుల అవతారమయినప్పటికీ, “మాఱన్ అడి పణిందు ఉయ్ త్తవన్ అనగా నమ్మాళ్వార్లకు శరణాగతి చేసి తరించెనని ప్రసిద్ధి పొందెను.

నంపిళ్ళై మన పూర్వాచార్యుల గ్రంథాల ఆధారంగా తమ ‘ఈడు’ వ్యాఖ్యాన అవతారికలో, ‘తిరువిరుత్తం’ వ్యాఖ్యాన అవతారికలో భగవానుడు తన లీలా విభూతిలో బద్ధజీవులను శ్రీవైష్ణవులుగా తీర్చిదిద్దుటకు నమ్మాళ్వార్లను ఎంచుకున్నారని ధృవీకరించిరి. నమ్మాళ్వార్ల పలుకులను ఆధారముగా చేసుకొని ఈ విషయం ప్రతిపాదించెను. భగవానుడు తమ నిర్హేతుక కృపాకటాక్షముచే నమ్మాళ్వార్లకు జ్ఞానం అనుగ్రహించెను. ఈ జ్ఞానముతో ఆళ్వార్లు భూత, భవిష్యత్తు, వర్తమానములను చూడగలిగిరి. తమ శ్రీసూక్తములలో పలుమార్లు ఈ సంసార మందు అనాదిగా చిక్కుకొని ఉన్నారని ఇక ఒక్క క్షణం కూడా ఉండలేనని భగవంతునికి విన్నవించెను. వీరికి ఈ సంసారమున ఉండుట, సూర్యుని తాపమునకు వేడి అయిన ఎర్రని నేలపై పాదరక్షలు లేకుండ నిలబడి ఉనట్లుగా ఉన్నదని భావించేవారు. తిరువాయ్మొళి మొదటి పాశురమున తమకు భగవానుడు జ్ఞానమును అనుగ్రహించి తరింపచేసెనని వెల్లడించిరి. ఈ ప్రకారముగా వీరు కూడ సంసారి (బద్ధ జీవాత్మ) అని భగవత్  కృప చేత మాత్రమే జ్ఞానము లభించినదని మనం అర్ధం చేసుకోవాలి. ఇదే ప్రకారము (తర్కము) ఇతర ఆళ్వార్లకు కూడ వర్తించును. ఎందుకనగా

  •  నమ్మాళ్వార్ల అవయవి అని, మిగితా (ఆండాళ్ కాక) ఆళ్వార్లు అవయవాలుగా స్థితమై ఉన్నారని ప్రసిద్ధి.
  • మిగతా ఆళ్వార్లు  కూడా తాము సంసారులమని, కేవలం భగవత్ కృప చేతనే  తమకు జ్ఞానమును కలిగినదని తమ తమ శ్రీసూక్తముల యందు వెల్లడించిరి.

నమ్మాళ్వార్ అనుగ్రహించిన  4 దివ్య ప్రబంధములు.

  • తిరువిరుత్తం (ఋగ్వేద సారం)
  • తిరువాశిరియమ్ (యజుర్వేద సారం)
  • పెరియ తిరువందాది (అథర్వణ వేద సారం)
  • తిరువాయ్మొళి (సామవేద సారం)

నమ్మాళ్వార్ల  4 ప్రబంధములు 4 వేదములకు సమానము. వీరికి “వేదమ్ తమిళ్ శెయ్ద మాఱన్” అనగా తమ తమిళ ప్రబంధాల ద్వారా సంస్కృత వేద సారమును మనకందించినవారు అని బిరుదు. మిగితా ఆళ్వార్ల ప్రబంధాలు వేద సంపూరక భాగములుగా (అనగా శిక్ష, వ్యాకరణము మొ॥) పరిగణింపబడతాయి. కనీ, అందరు ఆళ్వార్లు పాడిన 4 వేల పాశురములకు తిరువాయ్మొళి సారముగా పెద్దలు కీర్తిస్తారు. మన పూర్వాచార్యుల గ్రంథములు (వ్యాఖ్యానాలు, రహస్య గ్రంథములు) తిరువాయ్మొళిలోని జ్ఞానమును ఆధారముగ చేసుకొని రచించబడ్డాయి. తిరువాయ్మొళికి ఐదు వ్యాఖ్యానములు, విస్తృత వ్యాఖ్యానములు, అరుంబదములున్నవి.

మన పూర్వాచార్యులు నమ్మాళ్వార్లకు  శ్రీదేవి, భూదేవి, నీళా దేవి, గోపికలు, లక్ష్మ ణ, భరత, శతృఘ్న, దశరథ, కౌసల్య, ప్రహ్లాద, విభీషణ, హనుమ, అర్జున మొదలగు భక్తుల గుణములు ఉన్నవని నిర్ణయించిరి. కాని వీరందరు నమ్మాళ్వార్ల గుణములలో ఏదో ఒక గుణము మాత్రమే కలిగి ఉన్నారని పూర్వాచార్యుల ఉవాచ. ఇదే నమ్మాళ్వార్ల వైశిష్ఠ్యము.

తిరువాయ్మొళి (7.10.5) – ‘పలరడియార్ మున్బరుళియ’ – నంపిళ్ళై వారు చాలా అందముగా నమ్మాళ్వార్ల మనోభావాన్ని వెలికి తీసిరి. ఈ పాశురములో – తమిళ భాషలో నిష్ణాతులైన ముదలాళ్వార్ల కంటే, మహాఋషులైన శ్రీవేదవ్యాసులు, శ్రీవాల్మీకి, శ్రీపరాశరుల కంటే అతిరిక్తముగా తమకు మాత్రమే  తిరువాయ్మొళిని పాడుటకు భగవానుడు కృపచూపి అనుగ్రహించారని నమ్మాళ్వార్లు విన్నవించారు.

నమ్మాళ్వార్లు గంగ, యమున, సరస్వతి కన్నా ఉత్తమ్మోత్తమ పవిత్రతను కలిగిన త్రామ్రపర్ణి నదీ తీరమున ఉన్న తిరుక్కురుగూర్ అను గ్రామమున అవతరించిరి. ప్రపన్నకులంలో ఉన్న ‘కారి’ అను వారికి కుమారుడిగా జన్మించెను. తిరుమళిశై ఆళ్వార్లు అనుగ్రహించినట్లు “మఱణ్తుమ్ పుఱం తొళ మాణ్తర్” – ప్రపన్నులు కేవలం శ్రీమన్నారాయణుడిని తప్ప అన్యులను ఆరాధించని వ్యక్తిత్వము కలవారని, నమ్మాళ్వార్ల  7 తరముల పూర్వులు – తిరువళుత్తి వళనాడర్, వారి కుమారులు అఱంతాంగియార్, వారి కుమారులు చక్రపాణి, వారి కుమారులు అచ్యుత, వారి కుమారులు శెందామరై కణ్ణార్, వారి కుమారులు పొఱ్కారియార్ వారి కుమారులు కారియర్, వారి కుమారులు మన నమ్మాళ్వార్లు.

పొఱ్కారియార్ తన కుమారుడైన కారికి ఉత్తమ వైష్ణవ కుటుంబ కన్యతో వివాహము చేయదలచి రాబోవు తరములలో వైష్ణవులు జన్మించి లోకానికి ఉద్దరించాలనే సదుద్దేశ్యముతో  వైష్ణవుల ఇంటి అమ్మాయిని వెతుకుచుండిరి. పొఱ్కారియర్ ఒకనాడు తిరువణ్ పరిశారం అను దివ్య దేశమునకు వెళ్ళెను. అక్కడ తిరువాళ్ మార్భర్ అను ఒక వైష్ణవుడిని కలిసెను. వారు కూడా తన కుమార్తెకు ఉత్తమ వైష్ణవ వరుడిని చూస్తున్నట్లుగా తెలుసుకొని వారి కుమార్తె అయిన ఉడైయ నన్గైను కారియార్ కు ఇచ్చి వివాహము చేయుటకు నిశ్చయించుకొనిరి. కారియర్, ఉడయనంగై ఇరువురు తిరువణ్ పరిశారం నందున్న తిరువాళ్ మార్భన్ పెరుమాళ్ళను దర్శనం చేసుకొని తిరుక్కురుగూర్ వెళ్ళిరి. శ్రీ రాముడు ఆనాడు సీతా పిరాట్టిని వివాహము చేసుకొని అయోధ్యకు వేంచేసినప్పుడు ఆ పురజనులు సంబరాలు జరపుకుని ఎంతటి ఆనందమును పొందినారో అదే విధముగ తిరుక్కురుగూర్ ప్రజలు కూడ నూతన దంపతులను చూసి ఎంతో ఆనందంతో ఉత్సాహములు చేసుకున్నారు.

కొన్ని రోజుల తరువాత కారియార్, ఉడయనంగై దంపతులిద్దరు తిరువణ్ పరిశారం పెరుమాళ్ళ దర్శనము చేసుకొని తిరుగు ప్రయాణములో తిరుక్కురుంగుడి నంబి పెరుమాళ్ళ దర్శనము చేసుకొని తమకు కుమారుడిని ప్రసాదించమని నంబి పెరుమాళ్ళను ప్రార్థించిరి. నంబి పెరుమాళ్ళు వారి ప్రార్థనను అనుగ్రహించి తానే స్వయంగా పుత్రునిగా జన్మిస్తానని వరము నిచ్చెను. తిరుక్కురుగూర్ వచ్చిన పిమ్మట కొద్ది రోజులకు ఉడయనంగై గర్భమును ధరించెను. సరిగ్గా కలియుగం ప్రారంభమైన 43 వ రోజున పెరుమాళ్ళ ఆదేశము ప్రకారము నమ్మాళ్వార్లు శ్రీమన్నారాయణుని దివ్య ఆశీస్సులతో బహుధాన్య సంవత్సరము (ప్రమాది సంవత్సరము), వసంత ఋతువు, వైశాఖ మాసము, శుక్ల పక్ష పౌర్ణమి తిధి, విశాఖా నక్షత్రములో (విష్వక్సేనుల అంశగా) అవతరించిరి. ఈ రహస్యము నమ్మాళ్వార్లే  “తిరుమాలాల్ అరుళ్ పెఱ్ఱ శఠగోపన్ అనగా, శ్రీమన్నారాయణుని దివ్య అనుగ్రహంతో విష్వక్సేనుల అంశగా అవతరించారని తెలియచేసెను. అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు తమ ‘ఆచార్య హృదయము’ లో ఇలా అనుగ్రహించారు –  ఆదిత్య రామదివాకర అచ్యుత బాణుక్కళుక్కు నీన్గాధ ఉళ్ళిరుళ్ నీంగి చోశియాథ పిఱవిక్కడల్ చోశిత్తు వికసియాత పోతిల్ కమలం మలరుమ్పడి వకుళబూషణ్ భాస్కరోదయమ్ ఉన్డాయత్తు ఉడైయణన్గైయాగిఱ పూర్వసణ్ద్యైయిలే” – అనగా ఈ  సంసారము నందున్న జీవుల అజ్ఞానమును, మాయను, సూర్యుడు ప్రకాశించినను, ప్రజ్వల సూర్యుడిగా  కీర్తింపబడు శ్రీరాముడు అవతరించినను, ప్రకాశించు సూర్యుడిగా  కీర్తింపబడిన  కృష్ణుడిగా అవతరించినను ఆ మాయను తొలగించలేకపోయిరి. నమ్మాళ్వార్లు (వకుళభూషణ భాస్కర) అవతరించి ఈ బద్ధ జీవులకు జ్ఞానమును ప్రసాదించి మాయను తొలగించిరి. ఇలాంటి సులక్షణ సంపన్న వైభవం కలిగిన నమ్మాళ్వార్లను ఉడయనంగై ప్రసవించెను.

నమ్మాళ్వార్లు తిరుక్కురుగూర్లోని ఆదినాథ పెరుమాళ్ళ కోవెలలో ఒక చింతచెట్టు క్రింద ఆశ్రయము పొందుతారని ముందుగా తెలిసిన ఆదిశేషులు తామే చింతచెట్టుగా అవతరించి ఆళ్వార్లకు నీడగా ఉంటూ వారిని రక్షించిరి.

నమ్మాళ్వార్ల తనియన్:

మాతా పితా యువతయః తనయా విభూతిః
సర్వం యదేవ నియమేన మదన్వయానాం |
ఆద్యస్య నః కులపతేః వకుళాభిరామం
శ్రీమత్ తదంఘ్రి యుగళం ప్రణమామి మూర్ధ్నా ||

వారి అవతార వైభవమును ఇక్కడ చదవవచ్చును.

సీతా రామాంజనేయ దినేష్ రామానుజ దాసు

మూలము: https://acharyas.koyil.org/index.php/2012/08/18/nammazhwar-english/

పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Source

43 thoughts on “నమ్మాళ్వార్”

  1. Bhagavath ramanuja charyula Gotra pravara .. chinna jyer swamy vari gotra pravara .. 12 alwarla gotra pravara telpagalaru pl pl pl

Comments are closed.