పెరియ నంబి

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

గత సంచికలో మనము ఆళవందార్ల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల  గురించి తెలుసుకొందాం.

పెరియ నంబి
పెరియ నంబి – శ్రీ రంగం

తిరు నక్షత్రం  : మార్గశిర మాసము, మఘ నక్షత్రము
అవతారస్థలం : శ్రీరంగం
ఆచార్యులు : ఆళవందార్
శిష్యులు : ఎమ్పెరుమానార్, మలై కునియ నిన్ఱార్, ఆరియూరిల్ శ్రీ శఠగోప దాసర్, అణియరంగత్త ముదనార్ పిళ్ళై, తిరువాయ్ క్కులముడైయార్ భట్టర్, ఇత్యాదులు.
వీరు పరమపదించిన ప్రదేశము : పశియతు (పశుపతి?) కోయిల్ చోల దేశము.

పెరియ నంబి వారు శ్రీరంగములో జన్మించిరి. వీరికి మహా పూర్ణులు, పరాంకుశ దాసులు, పూర్ణాచార్యులు అను నామధేయములు కూడ కలవు.

ఆళవందార్ల శిష్య బృందములో పెరియ నంబి ప్రముఖులు. వీరు రామానుజలను శ్రీరంగానికి తెచ్చుటలో ముఖ్య పాత్ర వహించారు. ఆళవందార్లు తరువాత, శ్రీరంగములో శ్రీవైష్ణవులందరూ రామానుజులను తీసుకురావలసిందిగా పెరియ నంబిని కోరెను. కావున వారు శ్రీరంగమును వీడి కాంచిపురమునకు బయలుదేరెను. అదే సమయమున రామానుజులు కూడ పెరియ నంబిని కలుసుకొనుటకు శ్రీరంగమునకు బయలుదేరెను.  వారిరువురు మధురాంతకం నందు కలుసుకొనెను. పెరియ నంబి అక్కడే రామానుజులకు పంచ సంస్కారములను గావించెను. వారు ఆ పిమ్మట సాంప్రదాయ రహస్యములను రామానుజులకు నేర్పించుటకు కాంచిపురమునకు వెళ్ళెను. కాని రామానుజుల వారి ధర్మ పత్ని వలన కొన్ని ఇబ్బందులు కలుగడం చేత వారు కాంచిపురమును వీడి శ్రీరంగమునకు వెళ్ళవలసి వచ్చెను.

మనకు పూర్వాచార్యుల శ్రీసూక్తులలో పెరియ నంబి వారి జీవితము గురించి అనేక చోట్ల ప్రస్ధావించబడి ఉన్నది.

  • వీరు పూర్తి ఆత్మ గుణములను కలవారు. వీరికి రామానుజులు అంటే మహాప్రీతి. వారి కుమార్తె లౌకిక విషయముల యందు సహాయము కొరకు వచ్చినను; వారు రామానుజుల వద్దకు వెళ్ళమని వారి సలహా తీసుకోమని చెప్పేవారు.
  • ఒకనాడు రామానుజులు వారి శిష్య బృందముతో పోవుచుండగా; పెరియ నంబి వారికి సాష్టాంగ ప్రణామమును చేసెను. అప్పుడు రామానుజులు వారి నమస్కారమును స్వీకరించ లేదు. పెరియ నంబిని ఎందుకు అల చేసారు అని అడుగగా, తాను రామానుజులలో ఆళవందార్లను చూసినట్లు చెప్పెను. ‘వార్తా మాలై’ అను గ్రంథములో ఆచార్యులకు వారి శిష్యుల పట్ల చాల గౌరవము ఉండవలెను అని చెప్పబడి ఉంది. పెరియ నంబి దానిని అనుష్టానములో పెట్టిన మహనీయులు.
  • ఒకనాడు ఆళవందార్ల శిష్యులలో ఇకరైన మాఱనేరి నంబి (చతుర్ద వర్ణము నందు జన్మించిన భాగతోత్తముడు) పరమపదించెను. పెరియ నంబి వారికి చరమ కైంకర్యమును కావించెను. కొంత మంది శ్రీ వైష్ణవులకు అది నచ్చక; రామానుజులకు ఫిర్యాదు చేసెను. రామానుజుల వారు ఈ విషయమును అడుగగ; పెరియ నంబి ఈ విధముగ సమాధానమునిచ్చెను. వారు ఆళ్వార్ల తిరువాయ్మొళి, ‘పయిలుమ్ చుడరొళి’ (3.7), ‘నెడుమార్కడిమై’ (8.10) పదిగము ప్రకారము ఆళ్వార్లు తమ తిరువుళ్ళం (కోరిక) ప్రకారము నడుచుకొనెనని సమాధానము ఇచ్చెను. ఈ వృత్తాంతము అళగియ మనవాళ పెరుమాళ్ నాయనార్ల ‘ఆచార్య హృదయము’ నందు, ‘గురుపరంపరా ప్రభవము’ నందు చెప్పబడెను.
  • ఒకనాడు కొందరి వలన పెరియ పెరుమాళ్ళకు ఆపద రాబోతున్నదని తెలుసుకొని; పెరియ నంబి ఉత్తముడని వారిని ఆలయానికి ప్రదక్షణలు చేయమని అక్కడ ఉన్నవారు కోరారు. వీరు కూరత్తాళ్వాన్లను పిలిచి తనతో  ప్రదక్షణలు చేయమన్నారు. ఎందుకనగ; కూరత్తాళ్వాన్లు పారతంత్రియమును పూర్తిగ అర్ధము చేసుకున్నవారు. ఈ వృత్తాంతమును తిరువాయ్మొళి (7.10.5), ఈడు వ్యాఖ్యానమున నంపిళ్ళై వారు వివరించారు.
  • వీటి అన్నింటికి మకుటముగా; ఒకనాడు శైవ రాజు రామానుజులను తన ఆస్ధానమునకు రమ్మని కబురు చేయగ; కూరత్తాళ్వాన్లు మారు వేషములో వెళ్ళెను. వారితో తోడుగా వయోవృద్ధులైనా లెక్కచేయకుండా పెరియ నంబి వారు వెళ్లెను. ఆ రాజు వీరిరివురి నేత్రాలను పెకిలించమని ఆదేశించెను. వృద్దులైనందు వలన ఆ నొప్పి భరించలేక పరమపదించెను. పరమపదించు సమయమున వారు మనకు ఒక ముఖ్యమైన సందేశము నిచ్చెను. శ్రీరంగము కొద్ది క్రోసుల దూరములో ఉందని, ఒపిక పట్టి ఉండ గలిగితె శ్రీ రంగము నందు దేహమును వీడవచ్చని ఆళ్వాను, అత్తుళాయ్ (పెరియ నంబి కుమార్తె) చెప్పెను. పెరియ నంబి వద్దఅని చెప్పి; ఎవరైనా ఈ ఘట్టం గురించి వినిన, శ్రీరంగముననే లేక ఏ ఇతర దివ్యదేశములలోనే తమ దేహాన్ని చాలించాలి అన్న నిర్ధారణకు వస్తే; శ్రీవైష్ణవుల కీర్తి అక్కడే ఆగిపోతుంది అని వారు వెంటనే అక్కడే పరమపదించెను. ఆళ్వార్లు ఈ విధముగ చెప్పెను “వైకుంఠమ్ ఆగుమ్ తమ్ ఊరెల్లామ్” అనగా ఎక్కడయితే శ్రీవైష్ణవులు ఉంటారో ఆ ప్రదేశము వైకుంఠమగును. అందువలన మనము సర్వ కాలములలో, సర్వ అవస్ధలలో భగవానుడిపైన ఆధారపడి ఉండాలని తెలుసుకోవాలి. ఎంతో మంది శ్రీవైష్ణవులు ఈ అనుగ్రహము గురించి తెలియక దివ్య దేశములలో ఉంటున్నారు. అదే విధముగ ఎంతో మంది (చాండిలి – గరుడ వృత్తాంతము) సుదూర ప్రాంతములలో  ఉండి కూడా భగవత్ స్మరణ చేస్తూ తరిస్తున్నారు.

పెరియ నంబి వారు ఎంతటి ఉత్తములో ఈ పైన వృత్తాంతములను చూసి తెలుసుకోవచ్చును. వీరు పూర్ణంగా పెరుమాళ్ళపై ఆధారపడి ఉండెడివారు. నమ్మాళ్వార్ల పట్ల, వారి తిరువాయ్మొళి యందు ఉన్న అపారమైన ప్రీతి కారణంగా వీరిని ‘పరాంకుశ దాసర్’ అని కూడ ప్రసిద్ధి పొందారు. వీరు శ్రియః పతి గుణానుభవంలో మునిగి పోయి నిరంతర ఆనందమును పొందేవారని వీరి తనియన్ తో తెలుసుకోవచ్చును. మనము కూడ వారి శ్రీపాదపద్మములను ఆశ్రయించి అలాంటి యోగ్యతను ప్రసాదించమని వేడుకుందాము.

 పెరియ నంబి తనియన్

కమలాపతి కల్యాణ గుణామృత నిషేవయా ।
పూర్ణ కామాయ సతతం పూర్ణయ మహతే నమః ॥

సీతా రామాంజనేయ దినేష్ రామానుజ దాస

మూలము: https://acharyas.koyil.org/index.php/2012/09/01/periya-nambi-english/

పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org