పెరియాళ్వార్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

periazhvar

తిరునక్షత్రము: ఆషాడ మాసము (ఆని), స్వాతి నక్షత్రం
అవతార స్థలము: శ్రీవిల్లిపుత్తూర్
ఆచార్యులు: విష్వక్సేనులు
శ్రీ సూక్తులు: తిరుప్పల్లాండు, పెరియాళ్వార్ తిరుమొళి
పరమపదము చేరిన ప్రదేశము: తిరుమాలిరుంశోలై

పెరియ వాచ్చాన్ పిళ్ళై  తిరుపల్లాండు అవతారికలో పెరియాళ్వార్ వైభవాన్ని కీర్తించారు. ఈ సంసార దుఃఖములను అనుభవిస్తున్న జీవాత్మలను ఉజ్జీవింపచేయడమే వీరి అవతార ఉద్దేశ్యము. పెరుమాళ్ళ కృపతో, పెరియాళ్వార్లు సహజముగానే భగవత్ కైంకర్యంతో అలంకృతులై ఉండిరి. కైంకర్యం చేస్తూ తమ జీవితాన్ని గడపాలని ఆశించి, ఉత్తమ కైంకర్యం కోసం శాస్త్రాన్ని అభ్యసించారు. మథురలో శ్రీకృష్ణుడు కంసుడి సభకు వెళ్ళే ముందు మాలాకారుని గృహానికి వెళ్ళి ఉత్తమ పూమాలను కోరగా, మాలాకారుడు ప్రేమతో  మాలను సమర్పించగా శ్రీకృష్ణుడు చాలా ఆనందముతో దానిని ధరించాడు. దీనిని గుర్తించిన పెరియాళ్వార్, పెరుమాళ్ళకు   మాలా కైంకర్యం చేయడమే ఉత్తమ కైంకర్యముగా భావించి ఒక నందనవనమును పెంచి దాని నుండి వచ్చు పూలచే శ్రీవిల్లిపుత్తూర్ పెరుమాళ్ళకు ప్రతిరోజు అత్యంత ప్రీతిచే మాలా కైంకర్యము చేయ సాగిరి.

పెరియాళ్వార్లకు ఇతర ఆళ్వార్లకు చాలా వ్యత్యాసమున్నది. ఇతర ఆళ్వార్లు తమ కైంకర్యమును (ఎంపెరుమాన్ యందు నిత్య కైంకర్యము) తమ ఆనందమునకై చేయగా, పెరియాళ్వార్ మాత్రం తమ గురించి కాక కేవలం ఎంపెరుమాన్ ఆనందమునకై  (జీవాత్మలు పరమపదము నందు ఎంపెరుమాన్ కు నిత్య కైంకర్యము చేయాలని) మాత్రమే తమ కైంకర్యమును చేసిరి. ఇతర ఆళ్వార్లు, ఈశ్వరుడే రక్షకుడని మరియు వాని రక్షణచే తమ భయములు పోగొట్ట బడతాయని భావించారు. కాని పెరియాళ్వార్, ఆ ఈశ్వరుడు రక్షకుడు మరియు రక్షింపబడే వాడుకూడా అని భావించారు. పిళ్ళై లోకాచార్యులు మరియు మాముణులు అన్నీ ప్రబంధముల కన్నా తిరుపల్లాండు  విధిగా కీర్తించబడాలని  తెలిపారు.

మిగితా ప్రబంధములన్నీ క్లిష్ఠమైన వేదాంత సంబంధ విషయములతో కూడుకొన్నవి, కాని  తిరుపల్లాండు సులువుగా ఉండి నేరుగా ఎంపెరుమాన్ కు మంగళాశాసనము చేస్తుంది. మిగితా ప్రబంధములన్నీ ఆకారమున పెద్దవిగా ఉన్నవి, కాని తిరుపల్లాండు చిన్నది మరియు సారవంతమైనది – కేవలం 12 పాశురములలో సారవంతమైన  విషయాలు వర్ణించబడి ఉన్నవి.

 పిళ్ళై లోకాచార్యులు తమ దివ్య శాస్త్రమైన శ్రీవచన భూషణములో, మంగళాశాసనమును కీర్తిస్తు ఇది సిద్దోపాయ నిష్ఠులకు (ఎవరైతే భగవంతున్నిఉపాయం (పొందించే కారకం), ఉపేయం (పొందబడేది), దినచర్యలో భాగమని తెలిపారు. ఇది క్రితమే శ్రీవైష్ణవ దిన చర్య http://ponnadi.blogspot.in/2012/08/srivaishnava-lakshanam-10.html మరియు  http://ponnadi.blogspot.in/2012/08/srivaishnava-lakshanam-11.html , శ్రీవైష్ణవ  లక్షణంలో భాగంగా ఉన్నటువంటి  http://ponnadi.blogspot.in/p/srivaishnava-lakshanam.html యందు వివరించబడింది.

మంగళాశాసనము అనగా ఒకరి శ్రేయస్సు కోసం ప్రార్థించడం. ఆళ్వార్లందరు, ఎంపెరుమాన్ శ్రేయస్సు గురించి ప్రార్థించారు. కాని  పిళ్ళై లోకాచార్యులు,పెరియాళ్వార్లకు  ఎంపెరుమాన్తో ఉన్న విశేష సంబంధము మిగితా ఆళ్వార్లందరితో ఉన్న సంబంధము కన్నా విశేషమైనదని నిరూపించారు. ఇదంతా వివరముగా క్రితము పెరియాళ్వారుల అర్చావతార వైభవము నందు వివరింపబడింది. http://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-periyazhwar.html.

ప్రస్తుతం మనం పెరియాళ్వార్ల అర్చావతార వైభవములోని 255 వ సూత్రములో తెలుప బడ్ద  పెరియాళ్వార్ మరియు శ్రీభాష్యకారుల (రామానుజుల) వైభవమును పరిశీలిద్దాము.

అల్లాతవర్గలైప్ పోలే  కేట్కిఱావర్గళుడైయవుం, శొల్లుకిరావర్గళుతైయవుం తనిమైయైత్  తవిక్కైయన్నిక్కే ఆళుమాళార్  ఎంగిన్ఱవనుడైయ తనిమైయైత్ తవిర్కైక్కాగవాయిర్రు  భాష్యకారరుం ఇవరుం ఉపతేచిప్పత్తు. 

ఇతర ఆళ్వార్ల, ఆచార్యుల కన్నపెరియాళ్వారులు మరియు శ్రీభాష్యకారులు – శాస్త్ర అర్థ నిర్థేశకత్వమును అనుసరించి జీవాత్మలను సంస్కరించుట మరియు ఆ జీవాత్మలను ఎంపెరుమాన్ కు మంగళాశాసనములు చేయడానికి తయారు చేసి సర్వేశ్వరుని చింతను పోగొట్టారు. (సాధారణంగా సర్వేశ్వరుడు సర్వులు తనకు కైంకర్యం చేయాలని భావిస్తాడు,  ఎందుకనగా జీవులందరు తన ఆధీనులు) తల్లి తండ్రులు తమ సంతానం తమ దగ్గర లేనప్పుడు ఎలాగైతే సంతోషంగా ఉండరో అలాగే సర్వేశ్వరుడు జీవాత్మలు తన దగ్గరకు రానప్పుడు అలా బాధ చెందుతాడు. నిజానికి తమ దృష్ఠి సర్వేశ్వరుని ఒంటరి తన్నాన్ని (చింతను) పోగొట్టుట కాదు జీవాత్మ చింతను పోగొట్టి ఉజ్జీవింప చేయడమే – అయినను ఇది ఎంపెరుమాన్ సహజమైన కోరిక ను తీర్చి జీవాత్మకు వాస్తవిక స్వరూపమును కల్గించును.

మాముణులు ఈ సూత్రమునకు తమ వ్యాఖ్యానములో ఇలా వివరించారు – ఆళ్వార్లు  సర్వేశ్వరుని సున్నిత స్వభావం ఎరిగి అలాంటి స్వభావము కలవారు జీవాత్మలను వేరు పరుచుటను భరించలేక వారి దూరత్వము పైననే తమ దృష్ఠిని  ప్రసరింప చేస్తారని భావించారు.  పిళ్ళై లోకాచార్యుల వివరణలో – భాష్యకారులు (ఎంపెరుమానార్ మరియు శ్రీరామానుజులు అనే నామాలకు వ్యతిరిక్తముగా) అనే నామం శ్రీభాష్యం ద్వారా వేద సారాన్ని స్థాపించుటను బహిర్గతం చేస్తుంది –  ఆ నామ కార్యం వేదాంతమున చెప్పినటుల సర్వేశ్వరుని ఆనందముపైననే దృష్ఠి నిల్పుట.

మాముణులు తమ ఉపదేశ రత్నమాలలో పెరియాళ్వార్ వైభవాన్ని వరుసగా ఐదు పాశురములలో వర్ణించారు.

  • 16వ పాశురమున తిరుపల్లాండు ద్వారా లోకాన్ని ఉజ్జీవింప చేసిన పట్టర్ పిరాన్ (పెరియాళ్వార్) అవతరించిన ఆని (ఆషాడ – జ్యేష్ఠ) స్వాతి నక్షత్ర అతిశయాన్ని ఉపదేశంగా తమ మస్సును ఉద్దేశించి అనుగ్రహించారు.
  • 17వ పాశురాన తమ మస్సును ఉద్దేశించి ఇలా అనుగ్రహించుకున్నారు – పెరియాళ్వార్  అవతరించిన ఆని (ఆషాడ – జ్యేష్ఠ) స్వాతి నక్షత్రమును ఆదరించే ఙ్ఞానులు దీనికి సమానమైనది ఈ పృథ్వీలో ఏదీ లేదు అని తెలుపుట ద్వారా దీని వైభవాన్ని ప్రకటిస్తున్నారు.
  • 18వ పాశురమున ఇలా అనుగ్రహించారు – సర్వేశ్వరుని యందున్న అతి అభినివేశముచే మంగళాశాసనం చేయడంలో మిగిలిన ఆళ్వార్ల కన్నా వీరికి ఉన్న గొప్ప భేధముచే వీరికి పెరియాళ్వార్ అనే తిరునామం కలిగినదని తెలిపారు.
  • 19వ పాశురమున ఇలా అనుగ్రహించారు – ఇతర ఆళ్వారుల (లోపభూయిష్ఠులు, కాని ఇక్కడ లోపమన్న- ఇతర ఉపాయములైన కర్మ/ఙ్ఞాన/భక్తి లతో సంభంధము కల్గి ఉండుట మరియు వాటితో సర్వేశ్వరుణ్ణి చేరాలని కోరిక లేకపోవుట) పాశురాల (లోపములు లేని – లోపమనగా భగద్విషయేతరములుండుట) కన్న వీరి మంగళాశాసన తిరుపల్లాండు ఎలాగైతే సంస్కృత వేదమునకు ఓం (ప్రణవం) కారము సారమో మరియు ఆదిగా ఉండునో అలాగే ద్రావిడ దివ్య ప్రబంధమునకు సారము మరియు ఆదిగా కలదిగా ఏర్పడినది.
  • 20వ పాశురమున తమ మనస్సును ఇలా అడుగుతున్నారు – అన్నీ ప్రమాణాలను దృష్ఠిలో ఉంచుకొని మిగితా ప్రబంధములను పరిశీలించిన, వీరి ప్రబంధమైన తిరుపల్లాండు వైభవమును, ఇతర ఆళ్వారుల జీవన వైభముతో పోల్చిన వీరి వైభవమునకు అవి సాటి వచ్చునా?

వీరికి మరో విలక్షణ విశేషమేమనగా తమ కూతురైన ఆండాళ్ ను పెరియ పెరుమాళ్ కి ఇచ్చి వివాహం చేసి వారికి మామగారైనారు.

ఇక వీరి చరితమును తెలుసుకుందాము

వేదపండితులు నివసించు శ్రీవిల్లిపుత్తూర్ అనే దివ్యదేశమున పెరియాళ్వార్ అవతరించిరి. ఆని (ఆషాడ – జ్యేష్ఠమాసం) స్వాతి నక్షత్రాన అవతరించారు. వీరికి తల్లిదండ్రులు పెట్టిన నామధేయం విష్ణుచిత్తులు. ఎప్పుడైతే వీరు పరతత్త్వ నిరూపణ (శ్రీమన్నారాయణుడే  పరతత్త్వం అని) చేశారో ఆనాటి నుండి వీరు, వేదాత్మ (వేదమునే శరీరంగా కలవాడు) గా కీర్తింపబడు మరియు సదా శ్రీమన్నారాయణుని పాదారవిందములను (శ్రీమన్నారాయణుని పరత్వమును స్థాపించునవి) మోయునో ఆ గరుడాళ్వార్ (ఆళ్వారులు ఈ సంసారము నుండి భగవానునిచే గైకొనబడి ఆశీర్వదింప బడినవారు)  అంశగా భావింపబడ్డారు.

ప్రహల్లాదుడు ఎలాగైతే జన్మతః భగవద్భక్తితోనే జన్మించారో అలాగే వీరు కూడ వటపత్రశాయి యొక్క నిర్హేతుక కృపచే కరుణించబడి, భగవద్భక్తితోనే జన్మించారు. దీనినే శాస్త్రమున ఇలా తెలిపారు ‘నా అకించిత్ కుర్వత చ శేషత్వం’ ఎవైరైతే ఎంపెరుమాన్ కు కనీస కైంకర్యం కూడ చేయరో, వారికి శేషత్వం లేదు. దీనిననుసరించి పెరియాళ్వార్, ఎంపెరుమాన్ కృపచే ఏదైన కైంకర్యములో నిమగ్నమవ్వాలని తలిచారు. అదే తడవుగా అన్నీ పురాణాలను పరీశిలించారు. సర్వేశ్వరుడు  శ్రీకృష్ణునిగా మథురలో ఉన్నప్పుడు పేర్కొన్న వచనం.

ఏషః నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవ నికేతనః |
నాగపర్యంకం ఉత్సృ జ్యః  ఆగతో మథురాపురిమ్||

‘క్షీరాబ్దిలో శయనించి ఉన్న శ్రీమన్నారాయణుడు తన శయ్య అయిన ఆదిశేషుణ్ణి తీసుకొని మథురలో శ్రీకృష్ణునిగా అవతరించాడు’.

అలాగే నమాళ్వార్ కూడా “మన్ననిన్ భారం నికుత్తర్కే వడమథురై పిరందన్”. దీనర్థం  – భూదేవి యొక్క భారమును తగ్గించుటకు కణ్ణన్ ఎంపెరుమాన్ మథురలో కనబడ్డాడు. మహాభారతంలో కూడ – నిత్యం భగవానుడు శ్రీ కృష్ణుడి అవతారంలో ధర్మస్థాపనకై ద్వారకలో  నివసిస్తున్నాడు. సాధువులను దుర్మార్గుల నుండి రక్షిస్తున్నాడు. భగవానుడు అందమైన దేవకికి జన్మించి యశోద దగ్గర పెరిగినాడు. సదా నిత్యసూరులచే దివ్య పూమాలలచే అలంకరింపడిన ముగ్దమనోహర శ్రీకృష్ణుడు కంసుని వద్ద పనిచేయు మాలాకారుని వద్దకు వెళ్ళి పూమాలలను అడిగాడు. స్వయంగా శ్రీకృష్ణుడు వచ్చి మాలలను అభ్యర్థించడం వల్ల ఆనంద భరితుడైన ఆ మాలకారుడు శ్రీకృష్ణుడు ఆనందించేలా అందమైన పరిమళ భరిత మాలలను ఇచ్చాడు.  దీనిని అవగ్రహణం చేసుకొనిన పెరియాళ్వార్ ప్రేమతో కట్టిన మాలలను సమర్పించుట ఉత్తమ కైంకర్యముగా భావించి ఆ రోజు నుండి శ్రీవిల్లిపుత్తూర్లోని వటపత్రశాయి పెరుమాళ్ కు పూమాలలను సమర్పించ సాగారు.

ఆ సమయాన పాండ్య వంశములో (మత్స్య పతకాన్ని మేరు పర్వతంపై స్థాపించిన రాజు) ఉన్న రాజైన వల్లభ దేవుడు పాండ్యనాడును మథురైను రాజధానిగా చేస్కొని ధర్మానుసారంగా పరిపాలించసాగాడు. ఓ నాటి రాత్రి తన రాజ్య సుపరిపాలనా కార్యాచరణకై తన రాజ్యమున మారు వేషములో తిరగసాగాడు, ఆ సమయాన ఒక బ్రాహ్మణుడు వేరొకరి గృహం వెలుపల కూర్చుండడం చూశాడు. అతనిని  పరిచయం చేస్కొని చిరునామా కోసం అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు నేను గంగా స్నానము చేసి వస్తానన్నాడు. ఆ రాజు వాడిని బ్రాహ్మణుడిగా నిర్ణయంచేసుకొనుటకు ఓ శ్లోకాన్ని పఠించమన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఈ శ్లోకాన్ని పఠించాడు.

వర్షర్థమస్తౌ ప్రయతేత మాసాన్ని చర్థతమర్థతం దివ్యసంయతేత |
వార్థక్య హేతోః వయసా నవేన పరార్థ హోతేరిహ జన్మనా చ||

దీనర్థం – మానవులు వర్ష ఋతువులో విశ్రాంతి కోసం మిగితా 8 నెలలు శ్రమించాలి. రాత్రి సుఖ నిద్రకు పొద్దున శ్రమ చేయాలి. వృద్ధ్యాపములో విశ్రాంతి కోసం యవ్వనంలో శ్రమించాలి. శరీర అవసాన అనంతర ఉజ్జీవనమునకై శరీరము ఉండగానే శ్రమించాలి.

ఆ మాటలు విన్న ఆ రాజు ఈ భౌతిక సంపదలు మరియు సుఖములతో హాయిగా ఉన్నాను కదా మరి అవసాన అనంతరం ఏమిటని ఆలోచనలో పడ్డాడు. శరీర అవసాన అనంతరం దేనిని పొందాలి, దానిని ఎలా చేరాలి అనే విషయం తెలియలేదు. వెంటనే తమ రాజ పురోహితుని దగ్గరకు వెళ్ళి పరతత్త్వ దైవము ఎవరు మరియు శరీర అవసానంతరం అతన్ని చేరుట ఎలా అని ప్రశ్నించాడు. శ్రీమన్నారాయణుని పరమ భక్తుడైన శెల్వనంబి, వేదాంతాన్ని అనుసరించి పరతత్త్వ నిరూపణకై విద్వాంసులందరిని సమావేశపరచాలని రాజుతో విన్నవించాడు. ఆ రాజు  విద్వాంసులందరిని ఆపస్తంబున్ని ప్రమాణ సూత్రమైన.”ధర్మఙ్ఞ యసమయః ప్రమాణం వేదాశ్చ” అను దాని మీద నిజమైన పరతత్త్వ నిరూపణకై ఆహ్వానించాడు.

పరతత్వ నిరూపనకు వేద కార్యం తెలిసిన వేదఙ్ఞులు ప్రథమ ఆధారం మరియు వేదం ద్వితీయాధారం. ఆ రాజు చాలా ధనమును వస్త్రపు మూటలో పెట్టి ఎవరైతే వేద ప్రతిపాద్యున్ని నిరూపణగా తెలుపుతారో వారికి అందడానికి  ఆధారంపై వ్రేలాడ దీశాడు. వివిధ ప్రదేశముల నుంచి వివిధ విద్వాంసులను వాదనకై సమావేశ పరిచాడు.

వటపత్రశాయి పెరుమాళ్ (శ్రీవిల్లిపుత్తూర్), పెరియాళ్వార్ ద్వారా తన సిద్ధాంత (వేదం ప్రతిపాందిచినటుల) స్థాపన చేసి ఈ సంసారులను ఉజ్జీవింప చేయడానికి వారి స్వప్నమున సాక్షాత్కరించి వల్లభ దేవుని సభకెళ్ళి శుల్కమును పొందుమని ఆఙ్ఞాపించారు. పెరియాళ్వార్  వినయంగా ఇలా సమాధాన మిచ్చారు ‘ఆ శుల్కం వేదాంతం ద్వారా సిద్ధాంత స్థాపన చేసిన వారికి కదా, కాని నేను తోట పని చేయడం వల్ల కఠినంగా తయారైన నాచేతుల ద్వారా దానిని  ఎలా  స్థాపించగలను?’ భగవానుడు, ఆళ్వార్ కు ఇలా సమాధానమిచ్చారు ‘ వేద ప్రతిపాదనలో దానర్థ ప్రతిపాదనలోను నేను మీకు సహాయపడగలను’.  ‘బ్రహ్మముహూర్తే చ ఉత్థాయ’ అని  శాస్త్రంలో చెప్పిన విధంగా ఆళ్వార్, తెల్లవారు జాముననే మేల్కొన్నారు. దీనర్థం  తెల్లవారుజామున బ్రహ్మముహూర్తాన (సుమారు 4 గంటలకు) విధిగా మేల్కొనాలి. ఆ స్వప్నము నుండి తేరుకొని తన నిత్యానుష్ఠానములను ముగించుకొని ఆ వల్లభరాజు ఉన్న మథురైకి బయలుదేరారు పెరియాళ్వార్. బ్రాహ్మణోత్తముడైన ఆ పెరియాళ్వార్ మథురకు చేరుకోగానే శెల్వనంబి మరియు ఆ రాజు ఆళ్వార్కు వినమ్రతతో ఆహ్వానపరిచారు. స్థానిక పండితులు  రాజుకు ఈ పెరియాళ్వార్ చదువురాని వాడని తెలిపారు. ఈ  విషయము ముందే తెలిసిన వారు  వటపత్రశాయికి అంకితభావముతో కైంకర్యము చేయు ఆ పెరియాళ్వార్ని గౌరవమర్యాదలతో  సత్కరించి, వేదాంతమాధారంగా తత్వ ప్రతిపాదనను చేయమన్నారు. ఎంపెరుమాన్ దివ్యా శీస్సులతో వేదం, వేదార్థం, ఇతిహాసం, పురాణముల సారాన్ని గ్రహించారు పెరియాళ్వార్. ఎలాగైతే శ్రీవాళ్మీకి బ్రహ్మ అనుగ్రహంవల్ల , శ్రీ ప్రహల్లాదుడు భగవానుని శ్రీపాంచజన్య స్పర్శ వల్ల ఙ్ఞానాన్ని పొందినారో అలా వీరుకూడ పొందినారు. భగవానుని నిర్హేతుక కృప వల్ల పెరియాళ్వార్ వేదసారమగు  శ్రీమన్నారాయణుడే  పరతత్వమని గ్రహించారు.

తర్క విధానంలో దీని ప్రమాణాలు.

సమస్త శబ్దమూల త్వాద్ అకారస్య స్వభావతః 
సమస్త వాచ్య మూలత్వాత్ బ్రహ్మణోపి స్వభావతః
వాచ్య వాచక సంబంధస్తయోః  అర్థాత్ ప్రదీయతే.

అన్నీ శబ్దములు సహజంగా ‘అ’ అక్షరం నుండి జనించును. ఆ శబ్దం సమస్త అర్థములు సహజముగా బ్రహ్మం నుండి జనించును. కావున అక్షరం మరియు బ్రహ్మం మధ్య సంబంధము కూడా సహజ సిద్ధమని తెలియును.

భగవద్గీతలో గీతాచార్యుడు  తనను తాను ఇలా నిర్ణయించుకున్నాడు ”అక్షరాణామకారోస్మి” – నేను అన్నీ అక్షరములలో అకార వాచ్యుడను.

అకారో విష్ణువాచకః” అను ప్రమాణమును అనుసరించి అకారం పరతత్వమగు శ్రీమన్నారయణుని  తెలుపు విష్ణు వాచక శబ్దం.

తైత్తరీయోపనిషద్ శ్రీమన్నారాయణుని విశేష గుణములను ఇలా తెలిపినది

యతో వా ఇమాని భూతాని జాయంతే యేన జాతాని జీవంతి యత్ప్రయంతి అభిసంవిశంతి తత్ విఙ్ఞానస్య తత్ బ్రహ్మేతి.  

సమస్త విశ్వం మరియు ప్రాణులు దేనినుండి ఉద్భవిస్తాయో, ఏ విశ్వం దేని ఆధారంగా కొనసాగుతుందో, లయ మందు దేనిలో విలీనమవుతుందో, ప్రాణులు చేరవలసిన మోక్షమును చేరునో అదే బ్రహ్మముగా తెలుపబడుతుంది. కావున జగత్తు కారణత్వం (విశ్వం సృజనకాధారం)  ముముక్షు ఉపాస్యత్వ (మోక్షమును పొందుటకు ఆరాధించవలసిన వస్తువు) మరియు మోక్షప్రదత్వ (జీవాత్మకు మోక్షమును అనుగ్రహించు సామర్థ్యం గల) ములు పరతత్వమునకు ఉన్న ముఖ్యమైన గుణములని తెలుపబడింది.

ఆ గుణములన్నీ శ్రీమన్నారాయణుని యందు చూడవచ్చని ప్రమాణం

విష్ణోః సకాచాత్ ఉద్భుతం జగత్ తత్రైవ చ స్థితం|
స్థితి సమ్యకర్తాసౌ జగతోస్య జగత్ చ సః ||

 విష్ణు పురాణమున తెలిపినటుల, ఈ విశ్వం విష్ణువు నుండి సృజించబడును, ప్రళయమున (సృష్ఠి లేనప్పుడు) విష్ణువు నందు చేరును; ఇతనే నిర్వహించును మరియు అంత మొందించును; విశ్వమునంతయు తన శరీరముగా కలవాడే శ్రీమహావిష్ణువు.

నారాయణాత్ పరో దేవో న భూతో నభవిష్యతి|
ఏతత్ రహస్యం వేదానామ్  పురాణానామ్ చ సమ్మతమ్||

వరాహపురాణములో చెప్పినటుల నారాయణునికి సమమైన లేదా అధికమైన  దైవం భూతకాలమున లేదు భవిష్యత్ కాలమున ఉండబోదు. ఇది అతి గుహ్యమైన రహస్యంగా వేదంలో చెప్పబడింది అలాగే పురాణాల్లో కూడ.

సత్యం సత్యం పునస్సత్యం ఉద్ధృత్వ బుధముచ్యతే |
వేదాశాస్త్రం పరం నాస్తి న దైవం కేశవాత్పరం ||

నారద పురాణములో వ్యాస భగవానుడు వివరించినటుల, “నేను ముమ్మారులు చేతులెత్తి నిర్ణయిస్తున్నాను (ఉద్ఘోషిస్తున్నాను) కేశవుని కన్న పరమైన (అధికమైన) దైవం లేదు వేదం కన్న పరమైన శాస్త్రం లేదు”.

ఇలా పెరియాళ్వార్ శ్రీమన్నారాయణుని పరత్వముపైన చెప్పిన ప్రమాణాలను మరియు శ్రుతుల నుండి ఇతిహాసముల నుండి, పురాణముల నుండి ఉట్టంకిస్తు నిర్ణయించారు. పిదప ఆ సంపద ఉన్న మూట (గెలిచిన వారి బహుమతి) దైవ సంకల్పముగా పై నుండి కింద పడగా పెరియాళ్వార్ దానిని గ్రహించారు.

ఇదంతా గమనించిన ఆ పండితులు, ఎవరైతే ఆళ్వార్ను తిరస్కరించారో వారు మరియు ఆ మహారాజు చాలా ఆనందముతో వారి నమస్సులను అందించారు పెరియాళ్వార్లకు. వారందరు పెరియాళ్వార్, వేదాంత సారాన్ని విస్పష్ఠంగా విశేష ప్రభావముగా వెల్లడించారని ఆనందించారు. వారికి ఉత్సవ గజంపై  గొప్ప ఊరేగింపును ఏర్పాటు చేశారు. మిగితా పండితులందరు ఛత్ర చామరలు చేతిలో ధరించిరి. వారు ఇలా ప్రకటించసాగిరి “అత్యంత ప్రమాణముగా వేద సారమును తెలిపి కీర్తిని పొందినవారు వేంచేస్తున్నారు” అని.  వల్లభ దేవుడు ఙ్ఞాన విశేషములను అనుగ్రహించిన పెరియాళ్వార్లను భట్టర్ (గొప్ప పండితులు) లకు విశేష ఉపకారకులు అనే అర్థం వచ్చే “పట్టర్ పిరాన్” అను బిరుదనామంతో సత్కరించారు. అంతటా విశేష ఉత్సముగా జరుగు ఆ  ఊరేగింపులో ఆ రాజు కూడ పాల్గొన్నారు.

pallandu

తమ సంతానానికి జరుగు విశేష కీర్తి మర్యాదలో బహు ఆనందముతో తల్లి తండ్రులు పాల్గొని నటుల పరమపదనాథుడు కూడ ఆ విశేష ఉత్సవములో పాల్గొనదలిచారు. తమ పట్టపు రాణి అగు మహాలక్ష్మి(శ్రియః పతిత్వం – పిరాట్టికి భర్త అగుటయే అతనికి ప్రథాన గుర్తింపు)  తన అభిమానమగు గరుడవాహనంపై తమ తిరువాభరణములగు పాంచజన్యం మరియు శ్రీసుదర్శనాళ్వార్ తో ఆకాశాన వేంచేసిరి. ఆళ్వార్లను దర్శించుటకు ఎంపెరుమాన్ మరియు ఈ లౌకిక జగత్తుకు దేవతలైన బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు వారి వారి కుటుంబము మరియు సహచరులతో విచ్చేసిరి. ఎంపెరుమాన్ ద్వారా కృప చేయబడ్డ పెరియాళ్వార్, వేం చేసిన శ్రీమన్నారాయణుని మరియు ఇతరులను సేవించ సాగిరి. వారు ఆ విశేష ఉత్సవమును ఆనందగర్వముతో  అనుభవించక భగవానుని చూడగానే  ఈ లౌకిక జగత్తునందు ప్రత్యక్షమైన  భగవానుని గురించి చింతించ సాగిరి. భగవంతుని అనుగ్రహము వల్ల పెరియాళ్వార్, శ్రీమన్నారాయణుడు సర్వఙ్ఞుడు, సర్వరక్షకుడు అని తెలుసుకున్నారు. ఎవరి ప్రోద్భలం లేకుండానే తమంతగ తామే ఎంపెరుమాన్ మీద అనురాగంతో భగవానుని వాత్సల్యం, కోమల స్వభావంపై చింతించ సాగిరి. శాస్త్రంలో చెప్పినటుల భగవానుని  దివ్య మంగళ విగ్రహం పంచోపనిషద్తో తయారైనదని, అతను సదా దివ్య ఋషులు, దేవతలు మరియు బ్రహ్మరుద్రాదులు కూడ చేరుకోలేని పరమపదంలో నిత్యసూరులచే నిరంతరం అనుభవింపబడతాడని తెలుసుకున్నాడు.

ఎంపెరుమాన్ తన దివ్య లోకాన్ని వదలి అఙ్ఞానము మరియు రాక్షసత్వం కలిగిన లోకులున్న,  కలి పరిపాలిస్తున్న ఈ యుగపు భౌతిక లోకమునకు వచ్చాడు కాన వారి దివ్య మంగళ విగ్రహానికి ఏదైన దృష్ఠి దోషం కలుగునో అని కలతచెంది వారి రక్షణ కోసం మంగళం పాడుదామని తాను కూర్చున్న గజానికి ఉన్న గంటలను తీసుకొని భవవానునికి మంగళాశాసన రూపాన ‘తిరుపల్లాండు’ ను పాడారు. ఎంపెరుమాన్ సర్వస్వతంత్రుడు, సర్వసమర్థుడు అనే విషయాన్ని మరియు తన స్వరూపమగు పారతంత్ర్యమును కూడ మరచిపోయాడు పెరియాళ్వార్. ప్రేమ పరాకాష్ఠచే అందరిని (ఐశ్వార్యార్థి – సంపదపై కోరిక ఉన్నవారు, కైవల్యార్థి – ఆత్మానుభవంపై కోరిక ఉన్నవారు, భాగవత శరణార్థి – ఎంపెరుమాన్ ఆంతరంగిక కైంకర్యంపై కోరిక ఉన్న వారు) తనతో సహా ‘తిరుపల్లాండు’ ను పాడుటకు ఆహ్వానిస్తున్నారు పెరియాళ్వార్లు. శ్రీమన్నారాయణుడు ఉత్సవానంతరం తన దివ్యధామమునకు ఆనందముతో తిరిగి వెళ్ళాడు.

అనంతరం పెరుయాళ్వార్ రాజును ఆశీర్వదించి అతనిచే గౌర్వమర్యాదలు స్వీకరించారు. తిరిగి మళ్ళీ శ్రీవటపత్రశాయికి కైంకర్యము చేయిటకు శ్రీవిల్లిపుత్తూర్ నకు వచ్చి భగవంతుని  ద్వారా వల్లభదేవునిచే ఇవ్వబడ్డ ఆ సంపదనంతటిని భగవదర్పితం చేశారు.

మనుస్మృతిననుసరిచి:

త్రయేవాదన రాజన్ భార్య దాస తధా సుతః|
యత్తే సమాధి గచ్చంతి యస్యైతే తస్య తద్ధనం ||

భార్య, సుతుడు, సేవకులు స్వతాహాగా తాము ఏమి ఆర్జించేవారు కాదు, సంపదంతయు తమ సంబంధ యజమానిదే (భర్త, అధికారి మరియు తండ్రి).

దీనిననుసరించి పెరియాళ్వార్ తన సర్వస్వమును తన స్వామియగు వట పత్రశాయికి  సమర్పించి ఇలా నివేదించారు “సంపాదించినదంతా మీ అనుగ్రహము వల్లనే కావున ఇదంతా మీకు చెందవలసినదే”. పెరియాళ్వార్ తమ మీద ఉన్న ఈ కార్యమును పూర్తి కాగానే  శ్రీమాలాకారుడు శ్రీకృష్ణునకు అందమైన మాలలను సమర్పించినటుల తానుకూడ నిత్యము చేయు మాలా కైంకర్యమును వటపత్రశాయికి ప్రేమాతిశయముచే వివిధ రకాల పూలతో రకరకాల మాలలను కట్టి సమర్పించ సాగిరి. పెరియాళ్వార్లకు బాల్యను నుండి అంతిమము వరకు శ్రీకృష్ణుని చరితం యందు అత్యంత అభిమానము కలిగి ఉండి తాము యశోదగా భావన చేసుకొని భగవానుని సౌశీల్యం (ఔదార్యం) మరియు సౌలభ్య ములను (సులభంగా లభించువాడు) అనుభవించిరి.

పొంగి పొరులుతున్న ప్రేమాతిశయ భావనలచే వారు  పెరియాళ్వార్ తిరుమొళి అనే దివ్య ప్రంబంధాన్ని  అనుగ్రహించారు. తమ భావనలో సదా శ్రియఃపతిని స్మరించేవారు. తమను  ఆశ్రయించిన  శిష్యులను మరియు అభిమాలను  అనుగ్రహించి దిద్దుబాటు ద్వారా ఉజ్జీవింపచేసిరి.

వీరి తదుపరి  దివ్య చరితమును ఆండాళ్  చరితములో http://acharyas.koyil.org/index.php/2012/12/16/andal-english/.  కూడ సేవించవచ్చు

వీరి తనియన్

గురుముఖ మనధీత్య ప్రాహ వేదానశేషాన్
నరపతి పరిక్లుప్తం శుల్కమాధాతుకామ: |
శ్వశురమమరవంధ్యం రంగనాథస్య సాక్షాత్
ద్విజకులతిలకం తం విష్ణుచిత్తం నమామి ||

వీరి అర్చావతార అనుభవం క్రితమే ఇక్కడ వివరించబడింది. http://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-periyazhwar.html.

ఆధారం : ఆరాయిరపడి వాఖ్యానం, గురుపరంపర ప్రభావం, పెరియ తిరుముడి అడైవు.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

మూలము: https://acharyas.koyil.org/index.php/2013/01/20/periyazhwar-english/

పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org