పరాశర భట్టర్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

గత సంచికలో మనము ఎంబార్ల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలోని తరువాత ఆచార్యుల  గురించి తెలుసుకొందాం.

పరాశర భట్టర్ (తిరువడి యందు నంజీయర్) – శ్రీరంగం

తిరునక్షత్రము: వైశాఖ మాసం, అనూరాధ నక్షత్రం
అవతార స్థలము: శ్రీరంగము
ఆచార్యులు : ఎంబార్ (గోవింద భట్టర్)
శిష్యులు: నంజీయర్
పరమపదం వేంచేసిన స్థలము: శ్రీరంగం
శ్రీసూక్తులు: అష్ట శ్లోకి, శ్రీరంగరాజ స్తవము, శ్రీగుణరత్న కోశం, భగవత్ గుణ దర్పణం (విష్ణు సహస్రనామ వ్యాఖ్యానము), శ్రీరంగరాజ స్తోత్రం.

కూరత్తాళ్వాన్ ఆండాళ్ దంపతులకు శ్రీరంగనాథుని అనుగ్రహము వలన కలిగిన సంతానమే శ్రీపరాశర భట్టర్, వేదవ్యాస భట్టర్.

ఒకనాడు వర్ష కురుస్తుండటం వలన ఆళ్వాన్ భిక్షాటనకు వెళ్ళలేకపోయిరి. ఆకలితో ఆళ్వాన్ అలాగే శయనించిరి. ఆళ్వాన్ ధర్మపత్నియైన ఆండాళ్, కోవెల నుండి నైవేద్య గంటానాదాన్ని విని తమ మనసులో పెరుమాళ్ళకి ఇలా విన్నవించుకుంది – “నీ భక్తుడైన ఆళ్వాన్ ఉపవాసముతో శయనిస్తే నీవు మాత్రం భోగాన్ని అనుభవిస్తున్నావా?”. ఇది గ్రహించిన పెరియ పెరుమాళ్ళు ఉత్తమ నంబి ద్వార తమ ప్రసాదాలని ఆళ్వాన్ తిరుమాలిగకు పంపిరి. ప్రసాదమును చూసిన ఆళ్వాన్ భీతి చెంది వెంటనే ఆండాళ్ వైపు తిరిగి ‘పెరుమాళ్ళను ఏమైన అడిగావా నా విషయంలో’? అని ప్రశ్నించిరి. ఆండాళ్ అవునని ఒప్పుకొనెను. ఆళ్వాన్ ఈ విషయ మందు కలత చెంది, రెండు గుప్పిళ్ళ నిండా సరిపడు ప్రసాదాన్ని మాత్రమే తీసుకొని, ఆ ప్రసాదంలో కొంచం తాను స్వీకరించి మిగితాది తమ ధర్మపత్నికి ఇచ్చిరి. ఆ ప్రసాద విశేష ప్రభావం వలన వారికి శ్రీపరాశర భట్టర్, వేద వ్యాస భట్టర్లు జన్మించిరి.

11 రోజుల వయస్సులోనే ఎంబార్ వ్యాస పరాశరులిద్దరికీ ద్వయ మహామంత్ర ఉపదేశం చేయగా, ఎంబెరుమానార్లు వారిద్దరికీ ఆచార్యుడిగా ఉండమని ఆజ్ఞాపించెను. పెరియ పెరుమాళ్ళకు దత్తపుత్రుడిగా పరాశర భట్టర్ను ఇవ్వాలని కూడా కూర్తాళ్వాన్ని సూచించెను. వారి ఆజ్ఞను ఆళ్వాన్ శిరసా వహించెను. భట్టర్ చిన్నతనంలో నుండే నాచ్చియార్ సంరక్షణలో ఆమె సన్నిధిలో పెరిగెను.

భగవద్రామానుజులు తమ శిష్యులైన అనంతాళ్వాన్, ఇతర శ్రీవైష్ణవులకి ‘నాకు ఎలాంటి  గౌరవమర్యాదలు ఇస్తున్నారో అధే విధంగా భట్టర్లకు కూడ ఇవ్వాలి’ అని ఆఙ్ఞాపించిరి.

భట్టర్ పిన్న వయస్సులోనే మహా తెలివి తేటలు కలిగి ఉండేవారు. ఆ విషయంలో కొన్ని ఘటనలు ఇక్కడ పరిశీలిద్దాము.

  • భట్టర్ ఒకసారి వీధిలో ఆడుకొనుచుండగా సర్వజ్ఞ భట్టర్ అనే పండితుడు పల్లకిలో వచ్చిరి.    శ్రీరంగ దివ్యదేశమున పల్లకినెక్కి రావడమా! అని నేరుగ వారి వద్దకు వెళ్ళి చర్చావాదనకు రమ్మని ఆహ్వానించెను. వీరు పరాశర భట్టర్ను చూసి చిన్నబాలుడని భావించి ‘మీరు ఏ ప్రశ్న అడిగినా మేము సమాధానము చెప్పెదమని అనిరి’. భట్టర్ ఒక పిడికెడు ఇసుకను తీసుకొని ‘ఇది ఎంత అని?’ అని అడిగిరి. సర్వజ్ఞ భట్టర్ మాటలు రానివాడై తనకు తెలియదని చెప్పెను. భట్టర్ “ఒక పిడికెడు” అని సమాధానము చెప్పిరి. భట్టర్ తెలివికి ఆశ్చర్యం చెంది పల్లకి దిగి భట్టర్ను పల్లకిలో కూర్చో బెట్టి తాము పల్లకి మోస్తూ ఆళ్వాన్ వద్దకి తీసుకెళ్ళి స్తుతించిరి.
  • భట్టర్ గురుకుల వాసమున ఉన్నపుడు వీధిలో ఆడుకుంటున్నారు. అప్పుడు ఆళ్వాన్ వచ్చి బడికి వెళ్ళకుండా ఆడుకుంటున్నావెందుకు?’ అని ప్రశ్నించిరి. భట్టర్ ఇలా చెప్పిరి “ప్రతి దినము చెప్పిన సంథయే (పాఠము వళ్ళెవేయుట) మళ్ళీ మళ్ళీ చెపుతున్నారని’ అనిరి. సాధారణముగా ఒక సంథ 15 దినములు నడుచును. కాని భట్టర్ పాఠాన్ని మొదటి సంథలోనే కంఠస్థ పరిచేవారు. ఆళ్వాన్ మచ్చుకి ఒక పాశురమును అడుగగా భట్టర్ చాలా సులువుగా దానిని పఠించెను.
  • ఒకసారి ఆళ్వాన్ తిరువాయ్మొళిలోని ‘నెడుమార్కడిమై’ అనే పదిగము చెపుతున్నపుడు దానిలో  “శిరుమా మనిశర్” అనే పదం వద్ద భట్టర్ ఇలా అడిగిరి “ఒకే వ్యక్తి చిన్నగా మరియు పెద్దగా ఉన్నారనడము అసంగతముగా లేదా?” అని, దానికి ఆళ్వాన్ వివరణ ఇలా చెప్పెను ‘మొదలియాండాన్, అరుళాళపెరుమాళ్ ఎంబెరుమానార్ల వంటి వారు శరీర దృష్ట్యా  చిన్నవారైనప్పటికి ఙ్ఞాన వివేకములో చాలా పెద్దవారు కదా!’ అని. భట్టర్ ఈ తర్క సమాధానమునకు సంతృప్తి చెందిరి.

భట్టర్ పెద్ద వారైన తరువాత సాంప్రదాయమునకు దర్శన ప్రవర్తకులుగా మారిరి. భట్టర్ ఙ్ఞాన గుణ సంపన్నులు. ప్రబంధార్థముల (అరుళిచెయల్) యందు బహునిష్ణాతులు.

ఆళ్వాన్ వలె భట్టర్ కూడా తిరువాయ్మొళి  అర్థ భావనలో లీనమయ్యేవారు. వాటిలో కొన్ని ఘటనలు వ్యాఖ్యానములందు అక్కడక్కడ ఉట్టంకించబడ్డాయి. ఆళ్వార్ అధికంగా పరాంకుశ నాయికా భావనావస్థలో ఉండేవారు – దీనికి భట్టర్ “ఆళ్వార్ మనోభావన తెలుసుకొనుట ఎవరికి సాధ్యపడదు” అని చెప్పేవారు.

వివిధ సంఘటనలలో భట్టర్ వినయం, ఉదారత్త్వం, వివేకాది గుణములు దర్శనమగును. మణవాళ మాముని తమ “యతిరాజ వింశతి”లో భట్టరుల ఉదారత్త్వమును ఆళవందార్లు, ఆళ్వాన్ల ఉదారత్త్వముతో పోల్చేవారు. చాలమట్టుకు వ్యాఖ్యానములలో ఐతిహ్యములు, నిర్వాహకములు భట్టరులచే సంపూర్ణము గావించబడెను.

  • శ్రీరంగరాజ స్తోత్రమందు ఒక సన్నివేశము – ఒకసారి ఒక శునకము పెరియ కోవెలలోకి ఏ విధంగానో దూరెను. దీనికి అర్చకులు దోష నివారణకై  లఘు సంప్రోక్షణ చేయదలచిరి. ఇది విన్న భట్టర్ పెరియ పెరుమాళ్ళ వద్దకు వెళ్ళి ఇలా విన్నవించిరి, ‘దాసుడు భగవంతున్ని సేవించుటకై ప్రతిదినము వస్తున్నాడు కదా ! మరి అప్పుడు చేయని సంప్రోక్షణ  ఇప్పుడెందుకు’ అని ప్రశ్నించిరి. ఇది వారి నిగర్వమునకు తార్కాణం – తాము గొప్పపడింతులైనప్పటికిని  శునకము కన్నా తక్కువ అని భావించేవారు.
  • దేవ లోకమున దేవుడిగా జన్మించడం కన్నా శ్రీరంగ వీధులలో శునకముగానైనా జన్మించవలెను అని భావించేవారట.
  • ఒకప్పుడు భట్టర్ రాకను గమనించని నంపెరుమాళ్ళ  కైంకర్యపరులు అసూయతో వారిని దూషించసాగిరి. అది విన్న భట్టర్ వారిని ప్రతి దూషణం చేయకుండా, పైగా వారికి విలువైన ఆభరణాలతో, వస్త్రాలతో సన్మానించి కృతజ్ఞతలు చెప్పి ఈ విధముగా అన్నారట, “ప్రతి శ్రీవైష్ణవుడు తప్పక రెండు పనులు చేయవలెను”. అవి – భగవానున్ని కీర్తించడం, తమ స్వాపరాధములను ఒప్పుకొనడం. మేము భగవత్ గుణానుభవములో మునిగి కర్తవ్య నిర్వాహణలో చేసిన లోపములను గుర్తించలేకపోతిమి. ఇప్పుడు మీరు నాకు నా బాధ్యతని గుర్తు చేసి చాలా ఉపకారము చేసినారు, అందుకే మీకు నేను తప్పక ప్రతి ఫలమును ఇవ్వవలెను.” ఇదీ వారి నైచ్యానుసంధానము.
  • ఎంతో మంది వైష్ణవులు భట్టర్ కాలక్షేప గోష్ఠి వచ్చేవారు. ఒకసారి భట్టర్ కాలక్షేపం ఆరంభించాక ఒక సామాన్య వైష్ణవుని గురించి ఎదురు చూడసాగిరి. గోష్టిలోని మిగితా పండితులు ఎందుకు ఆలస్యము అని అడుగగా భట్టర్ ఈ విధముగా చెప్పిరి – ఆ  వైష్ణవుడు మీ అంత పండితుడు కాకపోయినప్పటికి అసలైన రహస్యాన్ని తెలిసినవాడనిరి. ఈ విషయము నిరూపించుటకై ఆ పండితులలో ఒకరిని పిలచి ఇలా అడిగిరి “ఉపాయం అనగానేమి?”, పండితుడు ఇలా చెప్పెను “శాస్త్రములో చాలా ఉపాయములు చెప్పబడినవి అవి – కర్మ, ఙ్ఞాన, భక్తి యోగములు”. అప్పుడు భట్టర్ మరలా ఇలా ప్రశ్నించిరి. “ఉపేయం అనగానేమి?” దానికి ఆ పండితుడు ఇలా చెప్పెను “గమ్యములు చాలా ఉన్నవి – ఐశ్వర్యము, కైవల్యము, కైంకర్యము మొదలగునవి”.  భట్టర్ ఇలా తెలిపిరి –  ఎంత పెద్ద పండితులైనప్పటికిని అడిగిన ప్రశ్నకు స్పష్ఠతలేని సమాధానన్ని ఇచ్చిరి. అదే సమయాన ఆ వైష్ణవుడురాగా భట్టర్ వారిని అవే ప్రశ్నలనుడగగా ఇలా సమాధానమును చెప్పెను – “ఉపాయము, ఉపేయము భగవానుడే”.  ఇదే వైష్ణవ నిష్ఠ అని భట్టర్ చెప్పిరి, అందుకే వారికై  మేము ఎదురు చూసామని చెప్పిరి.
  • ఒకసారి సోమాసియాండాన్ తిరువారాధన క్రమము గురించి అడుగగా, భట్టర్ వారికి వివరణతో ఉపదేశించిరి. ఒకసారి భట్టర్ వద్దకు సోమాసియాండాన్ దర్శనార్ధమై రాగా, భట్టర్ ప్రసాదమును స్వీకరించుటకై ఉపక్రమించి, హఠాత్తుగా తిరువారాధన చేయడము మరిచిపోయారని గ్రహించి, వెంటనే లఘు తిరువారాధనం చేసి, పెరుమాళ్ళకు సిద్ధము చేసిన తళిహ (ఆహార పదార్థాలను) ను నివేదించి ప్రసాదమును స్వీకరించిరి. అప్పుడు  సోమాసియాండాన్ ఆశ్చర్యమునొంది మరి మాకు పెద్ద తిరువారాధన ఎందుకు ఉపదేశించారని అడిగిరి. భట్టర్ ఈ విధముగా చెప్పిరి – తమకు లఘు తిరువారాధననే చాలును (తిరువారాధన మొదలు పెడితే దానిపైనే నిమగ్నమై ఇతరములపై (కాలక్షేపాదులు/గుణానుభవం) దృష్ఠితగ్గును). కాని సోమాసియాండాన్లకు తిరువారాధన పెద్దదైననూ చాలదు (వీరు సోమ యాగమును చాలా విశేషముగా జరిపించిరి – అందువలన వీరికి  లఘు తిరువారాధనపై  తృప్తి కలుగదు).
  • ఒకసారి శ్రీరంగమున శ్రీకృష్ణాష్ఠమి ఉరియాడి పురప్పాడు జరుగుచుండగా, భట్టర్ వేద పారాయణ గోష్ఠి నుండి గొల్లవారి గోష్ఠిలో చేరిరి. గోష్ఠి శ్రీవైష్ణవులు ఇదేమని అడుగగా వారు – భగవానుని కటాక్షము ఈ రోజున గొల్ల పిల్లలందు ఉండును (ఎందుకనగా ఈ పురప్పాడు ప్రత్యేకముగా వారి కోసమే) కావున కటాక్షము వైపు ఉండడమే కదా మన స్వరూపం అని వివరించిరి.
  • ఒకసారి అనంతాళ్వాన్, భట్టర్ని  పరమపద నాథునకు రెండు హస్తములు ఉండునా లేక నాలుగా? అని అడిగిరి. దీనికి భట్టర్ – రెండు రూపములు ఉండును – రెండు హస్తములు ఉంటే పెరియ పెరుమాళ్, నాలుగు హస్తములు ఉంటే నంపెరుమాళ్ అని సమాధానము నిచ్చిరి.
  • చాలా దూరము నుండి వచ్చిన  అమ్మణి ఆళ్వాన్ ఏదైన విశేషమును అనుగ్రహించమని అభ్యర్ధించిరి. దానికి భట్టర్ తిరువాయ్మొళిలోని నెడుమార్క్ డిమై పదిగము చెబుతూ –భగవంతుడిని  గురించి తెలుసుకోవడము కేవలం ఆహారాన్ని రుచి చూసినట్లుగా, అదే భాగవతుల గురించి తెలుసుకోవడము తృప్తిగా కడుపునిండా భోంచేసినట్లని చెప్పిరి.
  • ఒకసారి ఒక రాజు భట్టర్ల కీర్తి తెలుసుకొని వారి వద్దకి వచ్చి ఏవిధమైన ధన సహాయము కావాలన్న మా దగ్గరికి రమ్మని చెప్పిరి. భట్టర్ దీనికి ఇలా సమాధానమిచ్చిరి – ‘ఒకవేళ నంపెరుమాళ్ళ అభయ హస్తము వేరే దిక్కుకు మారిననూ, మేము ఇతరుల సహాయార్ధమై ఎక్కడికి రాము’ అని చెప్పిరి.
  • కూరత్తాళ్వాన్లకి అముదనార్లకు మధ్య ఆచార్య శిష్య సంబంధం ఉండడం వలన ఆళ్వాన్ కుమారులైన భట్టర్ని శిష్య దృష్ఠితో చూసేవారు. దీనికి భట్టర్ “ఈ దృష్ఠి అంగీకరించదగినదే, కానీ అముదనార్లు తమను తమ శిష్యులుగా భావిస్తున్నామని ఎప్పుడు చెప్పలేదే“ అని బాధ చెందేవారు.
  • ఒకరు భట్టర్ ని ఇలా అడిగిరి “శ్రీవైష్ణవులు దేవతాంతరములతో ఎలా ప్రవర్తించవలెను?”, భట్టర్ బదులుచెబుతూ ‘మీరు ప్రశ్న అడిగే విధానమే సరిగ్గా లేదు, ఈ విధముగా అడుగవలెను’ ‘దేవతాంతరములు శ్రీవైష్ణవులతో ఏవిధముగా ప్రవర్తిస్తారు?”అని చెప్పిరి. దేవతాంతరములు రజోతమో గుణములతో కూడి ఉందురు, శ్రీవైష్ణవులు కేవలం సత్త్వగుణసంపన్నులు. సహజముగా దేవతాంతరములు శ్రీవైష్ణవులకు సహాయకులుగా ఉందురు. (ఈ ఐతిహ్యం కూరత్తాళ్వాన్ చరితములో తెలియును).
  • భట్టర్ల వైభవం వాచామగోచరం. వీరి తల్లిగారే (స్వతహాగా మహాఙ్ఞాని) స్వయంగా తమ కుమారుని శ్రీపాద తీర్ధమును స్వీకరించేవారట. దీనికి కారణం అడుగగా, ‘ఒక శిల్పి రాతిని శిల్పముగా మార్చును, ఆ శిల్పము భగవానుని మూర్తి అయితే దానిని భక్తి గౌరవములతో నమస్కరించ వలసినదే కదా! అలానే నేను భట్టరులకు జన్మ నిచ్చినను వారి అపార వైభవము వలన వారి శేషత్త్వమును స్వీకరిస్తున్నాము’ అని వివరించినది.
  • ఒకసారి గొప్పపండితులైన దేవతాంతరపరుడి ధోవతి అనుకోకుండా భట్టర్ వారికి తగిలినది. జరిగిన సంఘటనకు భట్టర్ కొద్దిగా కలతచెంది సౌమ్యముగా వారితో మాట్లాడి పంపివేసి వెంటనే వారి తల్లిగారి వద్దకి పరిగెత్తి దీనికి ప్రాయశ్చిత్తమేమని అడిగిరి. ఆవిడ ‘శ్రీవైష్ణవుని శ్రీపాద తీర్ధ స్వీకరణమే దీనికి ప్రాయశ్చిత్తమనిరి’. వారు వెంటనే ఒక  శ్రీవైష్ణవుడి దగ్గరికి పరుగెత్తి వారి శ్రీపాదతీర్ధమును ఇవ్వవలసినదిగా అభ్యర్థించిరి. ఆ శ్రీవైష్ణవుడు భట్టర్ వైభవం తెలిసిన వారై ఇచ్చుటకు నిరాకరించిరి. కాని భట్టర్ వారిని అభ్యర్థించి వారి శ్రీపాద తీర్ధమును స్వీకరించిరి.
  • ఒకసారి భట్టర్ తిరువాలవట్ట (చామర) కైంకర్యమును నంపెరుమాళ్ళకి కావేరి నది వద్ద గల మండపములో చేయుచున్నారు. సూర్యాస్త సమయాన కొందరు భట్టర్కు సంధ్యావందన సమయమని గుర్తు చేసిరి. దానికి  భట్టర్ – ‘మేము భగవత్కైంకర్యములో ఉన్నాము కావున దీనిని చిత్ర గుప్తుడు పాపముగా పరిగణించడు’ అని సమాధానమిచ్చిరి. అళగియ పెరుమాళ్ నాయనార్ తమ ఆచార్య హృదయములో దీనిని ఇలా సూత్ర పరిచిరి- “అత్తాణి చేవగత్తిల్ పొతువానతు నజువుమ్” – భగవత్కైంకర్య భిన్నములైన పనులు చేస్తు నిత్యకర్మలను మానుట దోషం (ఉదా- పిచ్చా పాటికి మాట్లాడుట, TV చూడడం లాంటివి).
  • ఒకసారి అధ్యయన ఉత్సవము జరుగుచుండగా ఆండాళ్ అమ్మంగార్ భట్టరులకు ద్వాదశి పారణ గురించి గుర్తుకు చేసెను. దానికి భట్టర్ ఇలా  సమాధానము చెప్పెను, “భగవానునికి పెద్ద ఉత్సవము జరుగుతుండగా దానిలో నిమగ్నమైన ఉన్న మనకు ఈ రోజు ఏకాదశి/ద్వాదశి అని ఎలా గుర్తుకువస్తుంది?”. అనగా దీని సారం – భగవదనుభవము చేయుచున్నపుడు తిండి ధ్యాస ఉండ రాదు (దీనిని విపరీతార్థముగా తీసుకొని ఏకాదశి ఉపవాసం చేయరాదనే దురాలోచన ఏర్పడింది. కాని ఏకాదశి ఉపవాస వ్రతం అనివార్యం).
  • ఒకసారి భట్టర్ తమ శిష్యులకు దేహము, దాని అలంకరణపై వ్యామోహమును వదిలి వేయమని చెప్పిరి. కాని మరునాడు భట్టర్ మంచి పట్టు వస్త్రమును, ఆభరణములను ధరించి వచ్చెను. శిష్యులు మీరు చెప్పినవి మీరే ఆచరించడం లేదే, ఇది అసంగతంగా ఉన్నదే అని అడిగిరి. భట్టర్ ఇలా సమాధానమిచ్చిరి – మా శరీరము కోయిలాళ్వార్ – భగవానునికి వాస స్థలముగా భావించెదము. కావుననే ఈ మండపమును (దేహం) అలంకరించుకొంటామని చెప్పిరి. ఒకవేళ మనకే గనుక అద్యవసాయమ్ (గట్టి నమ్మకము) ఎర్పడినచో ఈ దేహమును పలు విధములుగా అలంకరించుకొనవచ్చును.
  • కూరత్తాళ్వాన్ కు శిష్యులైన ఆ దేశరాజు వీరసుందర బ్రహ్మరాయన్ ఒక మందిరం నిర్మించదలచిరి దానికి అడ్డుగా ఉన్న పిళ్ళై ఆళ్వానుల తిరుమాళిగను కూల్చి వేయదలచిరి. భట్టర్ ఆ రాజును అలా చేయవద్దని ఆజ్ఞాపించగా వారు వినలేదు. అప్పుడు భట్టర్ శ్రీరంగమును వదిలి తిరుక్కోష్టియూర్ కి వెళ్ళి కొంత కాలము నివసించిరి. ఆ సమయములో భట్టర్ శ్రీరంగనాథుని విరహముచే బాధలో మునిగిపోయిరి. ఆ రాజు మరణించాక భట్టర్ శ్రీరంగమునకు తిరిగి వచ్చిరి, శ్రీరంగమునకు వచ్చే సమయాన శ్రీరంగరాజ స్తవమును రచించిరి.
  • ఒకసారి భట్టర్ వాదములో కొందరిని ఓడించిరి. వారు కుయుక్తితో ఒక కుండలో సర్పము నుంచి అందులో ఏమున్నదని అడిగిరి. భట్టర్ అందులో సర్పమున్నదని తెలుసుకొని, “లోపల ఒక ఛత్రం ఉంది” అని చెప్పిరి. ఆ పండితులు సమాధానముతో కలవరపడగా భట్టర్ ఇలా వివరించిరి –  పొయిగై ఆళ్వారుల ముదల్ తిరువందాదిలోని పాశురమును చెప్పిరి “శెన్ఱాల్ కుడైయామ్” అనగా – ఆదిశేషుడే భగవానినికి ఛత్రం వంటి వాడు కనుక  సర్పమనగా (ఆదిశేషన్) మరో విధంగా ఛత్రం అని వివరించిరి.

ఇలా చాలా సంఘటనలు వారి జీవితము నందు జరిగినవి. ఇవన్నియు మళ్ళీ మళ్ళీ స్మరణకు వచ్చి ఆనందమయమగును మనస్సు.

భట్టర్ కు పెరియ పెరుమాళ్ళ  కన్నా అమ్మ అయిన  శ్రీరంగ నాచ్చియారుతో   ప్రత్యేకానుబంధము ఉండెడిది. ఒకసారి నమ్పెరుమాళ్ళు నాచ్చియార్ తిరుక్కోలములో ఉండి భట్టర్ తో ‘మేము శ్రీరంగ నాచ్చియార్ వలె ఉన్నమా?’ అని అడిగిరి. భట్టర్ ఇలా సమాధానమిచ్చిరి- ‘అంతా బాగానే ఉంది కాని అమ్మ నేత్రములలో ఉన్న కారుణ్యము మీ  నేత్రములలో కరువైనది’ అని అనిరి. హనుమాన్ తాము రాముణ్ణి, సీతమ్మను వర్ణిస్తూ – సమస్త కళ్యాణ గుణములలో ఇద్దరు సమ ఉజ్జీయులే కాని సీతమ్మకు మాత్రము “అసితేక్షణ” (అందమైన నేత్రములు) అనే విశేష గుణం ఉన్నదని చెప్పెను. శ్రీగుణరత్న కోశములో శ్రీరంగ నాచ్చియారుతో గల అనుబంధమును కీర్తించిరి.

భట్టర్ క్లిష్టమైన పాశురాలకు అద్భుతమైన వివరణలను ఇచ్చారు. వాటిలో కొన్నింటిని ఇక్కడ అనుభవిద్దాం.

  • పెరియ తిరుమొళి 7.1.1 – ‘కరవా మడనాగు’ పాశురమునకు – పిళ్ళై అముదనార్ వివరణ – ఆళ్వార్ గోవు, భగవానుడు దూడ – ఎలాగైతే  ఆవు తన దూడకై ఆప్యాయతతో ఎదురు చూచునో ఆళ్వార్ కూడ భగవానునికై ఎదురుచూడును. కాని భట్టర్ ఈ వివరణలో కొంత మార్పు చేసి ఈ విధముగా చెప్పిరి “కరవా మడనాగు తన్ కన్ఱు” కలిపి చదువవలెను,  అందువలన దీనర్థం ఇలా మారును “దూడ తన తల్లి ఆవు కొరకై ఆప్యాయతతో ఎదురు చూచునో” అలా, దీనిని  పూర్వాచార్యులు కూడా అభినందించిరి.
  • పెరియ తిరుమొళిలోని 4.4.6వ వ్యాఖ్యానము – అప్పాన్ తిరువళుంతూర్ అరయర్ మరియు ఇతర శ్రీవైష్ణవులు భట్టరులను ఈ పాశురార్థమును వివరించమని అభ్యర్థించిరి. భట్టర్ వారిని పాశురము చదువమని అడిగి విని వెంటనే రావణుడు అన్న వచనములివి అని తెలిపిరి. భట్టర్ ఇక్కడ ఈ విధముగా వివరించెను రావణుడు (గర్వముతో) ఇలా అన్నాడు, “నేను ముల్లోకాధి పతిని కాని సాధారణ మానవుడు తాను వీరుడని తలచి నాతో యుద్ధము చేయుటకై వచ్చెను” అని. అయినను చివరకు రాముని చేతిలో రావణుడు ఓడిపోయెను.

భట్టరుల జీవితములో ముఖ్యమైన సంఘటన – తిరునారాయణ పురమునకు వెళ్ళి మాధవాచార్యులను (పూర్వాశ్రమములో నంజీయర్) వాదములో ఓడించి తిరిగి మన సంప్రదాయములోనికి తీసుకురావడము.

భగవానుని ఆఙ్ఞమేరకు మాధవాచార్యులను సంస్కరించవలెనని భట్టర్ తిరునారాయణ పురమునకు పల్లకిలో శ్రీవైష్ణవ గోష్టితో కూడి వెళ్ళిరి. ఈ రీతిన వెళ్ళిన భట్టర్ని మాధవాచార్యుల శిష్యులు అడ్డగించిరి. పిమ్మట భట్టర్ సాధారణ వేషమును ధరించి మాధవాచార్యుల తదీయారాధన కూటమునకు వెళ్ళి, అక్కడ వారు తదీయారాధన చేయక వేచి ఉండగా మాధవాచార్యులు గమనించి భట్టర్ ను సమీపించి కారణమడిగిరి. అప్పుడు భట్టర్ మీతో వాదము కావలెనని అడిగిరి. మాధవాచార్యులు భట్టరుల గురించి విని ఉండడము వలన, వారేనని తెలుసుకొని (ఎందుకనగ తనతో గెలిచే ధైర్యము వేరవరికిని లేదని) భట్టర్ తో వాదములో పాల్గొనిరి. తిరునెడుంతాండగమును ప్రమాణంగా చూపిస్తు భగవానుని పరత్త్వమును తెలిపిరి. ఇతర ప్రమాణ శాస్త్రాల ద్వారా పరత్త్వముని నిర్ణయించిరి. మాధవాచార్యులు తమ ఓటమిని అంగీకరించి భట్టర్ శ్రీచరణములని ఆశ్రయించి వారిని తమ ఆచార్యులుగా స్వీకరించిరి. భట్టర్  అరుళిచ్చెయల్, సంప్రదాయార్థములను ఉపదేశించి శ్రీరంగమునకు అధ్యయనోత్సవము ఆరంభమగుటకు ఒక రోజు ముందు చేరిరి. శ్రీరంగములో వీరికై విశేష స్వాగతమును ఏర్పాటు చేసిరి. భట్టర్ పెరియ పెరుమాళ్ళ వద్దకి వెళ్ళి అక్కడ జరిగిన వృత్తాంతమును విన్నవించగా, పెరియ పెరుమాళ్ళు చాలా సంతోషపడి భట్టరులని తిరునెడుంతాండగమును పఠించమని ఆఙ్ఙాపించిరి. అప్పడి నుండి శ్రీరంగములో అధ్యయనోత్సవ ఆరంభమునకు ముందు రోజు తిరునెడుంతాండగము సేవించు సాంప్రదాయం పరంపరగా ఇప్పటి వరకును వచ్చుచున్నది.

భట్టర్ వారి మొట్ట మొదటి గ్రంథము రహస్య త్రయము. తిరు మంత్రము, ద్వయ మంత్రము, చరమ శ్లోకార్థములను అద్భుతముగా ఎనమిది శ్లోకములలో నిబిడీకరించారు అదే అష్టశ్లోకి. క్లిష్టమైన శాస్త్రార్థములను సులభ రీతిలో శ్రీరంగరాజ స్తవము నందు వర్ణించిరి. విష్ణు సహస్ర నామ వ్యాఖ్యానములో భగవానుని ప్రతి నామమునకు ప్రత్యేక విశేషణమును తెలిపిరి. శ్రీ గుణరత్న కోశము అను స్తోత్రమందు శ్రీరంగనాచ్చియారుల వైభవమును అద్భుతంగా వివరించిరి.

మన పూర్వాచార్యులలో భట్టర్ చాలా తక్కువ కాలము జీవించిరి. ఒక వేల వారు ఇంకొంత కాలము కనుక జీవించి ఉంటే తప్పక ఇక్కడి నుండే పరమపదమునకు సోపానమును వేసెడివారు. భట్టర్ నంజీయర్ను తిరువాయ్మొళికి వ్యాఖ్యానమును రాయమని ఆజ్ఞాపించి, వారిని తమ తర్వాత దర్శన ప్రవర్తకులుగా నియమించిరి.

ఒకసారి భట్టర్ ఆనంద పరవశమున కొన్ని పాశురములను వాటి అర్థములను పెరియ పెరుమాళ్ళ ఎదుట విన్నవించిరి. దానికి పెరుమాళ్ళు ఆనందించి, “మీకు మోక్షమును ప్రసాదిస్తున్నాము ఇప్పుడు” అని చెప్పిరి. భట్టర్ అది విని ఆనంద పరవశులై, పెరుమాళ్ళతో ఇలా విన్నవించిరి  ‘ఈ రూపాన్ని (నంపెరుమాళ్) పరమపదములో దర్శించకుంటే అక్కడి నుండి శ్రీరంగమునకు తిరిగి వచ్చెదము’ అని చెప్పిరి. తమ తల్లిగారి వద్దకి వెళ్ళి ఈ విషయమును తెలిపిరి. దానికి వారు తన కుమారుడు తమ కన్నా మొదలు మోక్షమును పొందుతున్నారని భట్టర్ కన్నా ఎక్కువగా ఆనందించిరి (ఇదే మన పూర్వాచార్యుల నిష్ఠ – తమ జీవన స్వస్వరూపమును పూర్తిగా అవగాహన కలవారు).

కొందరు శ్రీవైష్ణవులు భట్టర్ను ఈ విధముగా అడిగిరి “పెరియ పెరుమాళ్ళు సంతోషముతో మీకు మోక్షమును ప్రసాదించినప్పుడు మీరు ఎందుకు సమ్మతమును తెలిపిరి? ఈ సంసార మందు  కొట్టుమిట్టాడుతున్న జీవాత్మలని ఉద్దరించాలి కదా? అక్కడకి వెళ్ళి ఏమి చేస్తారు? ఈ కార్యమును ఎవరు పూర్తి చేస్తారు?”. దీనికి భట్టర్ “ఎలాగైతే శుద్ధమైన నెయ్యి శునకము కడుపులో ఇమడలేదో అలా మేము ఈ సంసారము నందు ఇమడలేము” అని సమాధానమిచ్చిరి.

అంతిమ దినమున భట్టర్ వైష్ణవులందరిని తమ తిరుమాళిగకు పిలచి విశేష తదీయారాధన చేసిరి. పద్మాసనములో కూర్చొని, తిరునెడుంతాండగమును సేవిస్తు ఆనందముతో తిరుమేనిని వదిలి పరమపదమును అలంకరించిరి. అందరు దుఃఖముతో చరమ కైంకర్యమును చేసిరి. వారి తల్లిగారైన ఆండాళ్ సంతోషముతో భట్టరుల చరమ తిరుమేనిని ఆలింగనమును చేసుకొని వారికి వీడుకోలు పలికెను. భట్టర్ జీవితము భక్తుల హృదయమును రంజింప చేయును.

భగవానునితో, ఆచార్యులతో మనకు ఇలాంటి సంబంధము ఉండేలా భట్టరు వారి శ్రీచరణముల యందు ప్రార్థిద్దాము.

భట్టర్ తనియన్ :

శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహితః ।
శ్రీవత్సాంక సుతః శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే ॥

రఘు వంశీ రామానుజ దాసన్

మూలము: https://acharyas.koyil.org/index.php/2012/09/11/parasara-bhattar-english/

పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

20 thoughts on “పరాశర భట్టర్”

Comments are closed.