ఆళవందార్

 

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

గత సంచికలో మనం మణక్కాల్ నంబి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల  గురించి తెలుసుకొందాం.

ఆళవందార్లు, కాట్టుమన్నార్ కోవెల

తిరు నక్షత్రం: ఆషాడ మాసం, ఉత్తరాషాడ నక్షత్రం
అవతారస్థలం: కాట్టుమన్నార్ కోయిల్ (వీరనారాయణపురం)
ఆచార్యులు: మణక్కాల్ నంబి
శిష్యులు: పెరియ నంబి, పెరియ తిరుమలై నంబి, తిరుక్కోట్టియూర్ నంబి, తిరుమాలై ఆండాన్,  దైవవారి ఆండాన్, వానమామలై ఆండాన్, ఈశ్వరాండాన్, జీయరాండాన్, ఆళవందారాళ్వాన్, తిరుమోగూరప్పన్, తిరుమోగూర్నిన్ఱర్, దేవ పెరుమాళ్, మాఱనేరి నంబి, తిరుక్కచ్చి నంబి, తిరువరంగ పెరుమాళ్ అరయర్ (ఆళవందార్ల కుమారుడు, మణక్కాల్ నంబి శిష్యులు), తిరుక్కురుగూర్ దాసర్, వకుళాభరణ సోమయాజియార్, అమ్మంగి, ఆళ్కొండి, గోవింద దాసర్ (వడమధురైలో జన్మించినవారు), నాథముని దాసర్ (రాజ పురోహితుడు), తిరువరంగత్తమ్మాన్ (రాజ మహిషి).
శ్రీసూక్తి గ్రంథములు: చతుః శ్లోకి, స్తోత్త్ర రత్నం, సిద్ధి త్రయం, ఆగమ ప్రామాణ్యం, గీతార్థ సంగ్రహము.
పరమపదించిన ప్రదేశం: శ్రీ రంగం.

యమునైతురైవన్ (యామునాచార్యులు)  కాట్టుమన్నార్ కోయిల్ నందు జన్మించిరి. వీరు ‘ఆళావందార్’ అనే నామముతో ప్రసిద్దిగాంచిరి. వీరికున్న ఇతర నామాలు – పెరియ ముదలియార్, పరమాచార్యులు, వాదిమత్తేభ సింహేంద్రులు.

ఈశ్వరమునులకు పుత్రుడు, నాథమునులకు మనుమడైన వీరు, సామాన్య శాస్త్రం అనే విద్యను మహా భాష్య భట్టర్ వద్ద అభ్యసించిరి. ఆ సమయములో అక్కిఆళ్వాన్ (రాజ పురోహితుడు) రాజ్యంలోని పండింతులందరు శిస్తు కట్టవలెనని తన ప్రతినిధిని పంపిరి. (తాను అధికార పండితుడు కాబట్టి). ఆ వార్త విని మహాభాష్య భట్టర్ కలత చెందడము చూచి యమునైతురైవన్ తాను ఆ సమస్యను పరిష్కంచగలనని గురువుగారిని విచారపడవద్దని చెప్పి, ఒక శ్లోకమును పత్రంపై ఇలా వ్రాసిరి – “ఎవరైతే చవకబారు ప్రచారం కొరకు ప్రయత్నిస్తారో వారిని నిర్మూలించెదను”, ఆ పత్రాన్ని అక్కి ఆళ్వాన్ వద్దకు పంపిరి. అక్కి ఆళ్వాన్ అది చూచి కోపంతో తన సైనికులను యమునైతురైవన్ని రాజ్యసభకు తీసుకురమ్మని పంపిరి. అప్పుడు యమునైతురైవన్ తనకి సరియగు గౌరవం ఇస్తే వస్తానని చెప్పెను. అప్పుడు రాజు పల్లకి పంపగా యమునైతురైవన్  పల్లకిలో కూర్చొని సభకి వచ్చిరి.

సంవాద ఆరంభమున రాణి, ఈ సంవాదములో యమునైతురైవనే నిశ్చయముగా గెలుస్తాడని, ఒకవేళ ఓడిపోతే రాజుకు తాను పాదదాసిగా ఉంటానని మహారాజుతో పందెం కాసింది. రాజు అక్కి ఆళ్వానే నిశ్చయముగా వాదంలో గెలుస్తాడని తన  విశ్వాసం వ్యక్తం చేసి, ఒకవేళ అలా జరగని పక్షంలో తన అర్థ రాజ్యమును ఇస్తానని పందెం తిరిగి కాసెను.

అక్కి ఆళ్వాన్ తన వాద ప్రతిభ యందు చాలా విశ్వాసముతో యమునైతురైవన్ ఏ ప్రశ్న అడిగినా దానిని ఖండించగలను అని చెప్పిరి. యమునైతురైవన్ క్రింది 3 ప్రశలను అడిగిరి.

 1. అక్కిఆళ్వాన్ తల్లి గొడ్రాలు కాదు.
 2. ఈ రాజు సార్వభౌముడు.
 3. రాజపత్ని పతివ్రత.

ఇవి విని అక్కి ఆళ్వాన్ కు నోట మాట రాలేదు. రాజు గారి భయము వలన ఏ ప్రశ్నను ఖండించ లేకపోయెను. కాని యమునైతురైవన్ చాలా సులభముగ వాటికి సమాధానము ఇలా చెప్పిరి.

 1.  ఒకే సంతానం కలిగిన స్త్రీ గొడ్రాలితో సమానము. (శాస్త్ర ప్రకారం/కదలీ వంద్య).
 2. సార్వభౌముడనగా ఈ ప్రపంచాన్ని పరిపాలించువాడు. కాని ఈ రాజు ఈ రాజ్యమునకే అధికారి.
 3. శాస్త్రప్రకారము జరుగే వివాహాలలో, మంత్రోచ్చారణలు చేస్తూ మొదట పెళ్ళి కూతురుని  దేవతలకు అర్పించి ఆ తరువాత భర్తికి అప్పగించే విధి ఇంది. కావున మహారాణి ప్రతివత కాదు.

అక్కి ఆళ్వాన్ యమునైతురైవన్ శాస్త్ర ప్రావీణ్యమును అంగీకరించి వాదములో తన ఓటమిని ఒప్పుకొనిరి. యమునైతురైవన్ శాస్త్ర ప్రమాణంతో ఇచ్చిన వివరణతో విశిష్టాద్వైత సిద్దాంతమును స్థాపించిరి. అలాగే యమునైతురైవన్ కి శిష్యులైరి. అప్పుడు రాణి వారిని “ఆళవందార్” (తనను రక్షించుటకు వచ్చినవారు) అని సంభోధించినది. రాజు తన అర్థ రాజ్యమును ఆళవందార్లకు ఇచ్చిరి.

గత సంచికలో మణక్కాల్ నంబి, ఆళవందార్లను శ్రీరంగమునకు తిరిగి తీసుకురావడము,  సంప్రదాయమునకు ఆచార్యునిగా ఎలా తీర్చిదిద్దారో చూసాము. వీరు శ్రీరంగానికి వచ్చిన పిదప సన్యాసాశ్రమము స్వీకరించి సంప్రదాయమును విస్తరించిరి. అనేక మంది వీరికి శిష్యులు అయ్యిరి.

ఒకసారి మణక్కాల్ నంబి, ఆళవందార్లను పిలిచి కురుగైక్కావలప్పన్ దగ్గరికి వెళ్ళి అష్టాంగయోగ రహస్యమును అభ్యసించమని ఆజ్ఞాపించెను. వీరు అక్కడికి వెళ్ళగా, కురుగైక్కావలప్పన్ యోగము ద్వారా భగవదనుభవములో నిమగ్నమై ఉన్నారు. కాని ఆళవందార్ల రాకని గుర్తించి వారిని పలకరించిరి. యోగానుభవములో ఉన్నప్పుడు భగవానుడు నా భుజస్కందములపై నుండి మిమ్మల్ని తదేకముగా చూస్తున్నారు కావున నాకర్థమైనది ఇక్కడ ఎవరో శొట్టనంబి (నాథమునుల) వంశమునకు చెందినవారు వచ్చి ఉన్నారని గమనించాను. భగవానునకు, నాథమునుల వంశముపై మహాప్రీతి అని చెప్పిరి. ఆళవందార్లకు తాను యోగ రహస్యమును ఉపదేశిస్తానని సమయము నిర్ధారించి పత్రంపైన రాసిచ్చిరి. కాని కురుగైక్కావలప్పన్ రాసిచ్చిన పత్రంలో ఉన్న సమయాన ఆళవందార్లు తిరువనంతపురమును దర్శించుటకు వెళ్ళిరి. వెంటనే ఆళవందార్లకు యోగరహస్యము గుర్తుకువచ్చి ఆ పత్రము తీసి చూడగా ఆ సమయం అడిచిపోయిందని గుర్తించారు.

అదే సమయములో, వారి శిష్యులైన దైవవారిఆండాన్ ఆచార్య ఎడబాటుని సహించలేక తిరువనంతపురమునకు బయలుదేరగా, అక్కడ నుండి ఆళవందార్లు శ్రీరంగానికి తిరుగు ప్రయాణమయ్యారు. వారిద్దరు తిరువనంతపురము ముఖద్వారము దగ్గర కలుసుకొనిరి. దైవవారిఆండాన్ తమ ఆచార్యులను సేవించి సంతోషించి వారితో తిరుగి ప్రయాణమవ్వగా ఆళవందార్లు వారిని అనంతశయన పెరుమాళ్ళను దర్శించుకోమన్నారు, దానికి వీరు పెరుమాళ్ళ కన్నా మీరే మాకు ముఖ్యమనిరి. వారి ఆచార్య భక్తికి ఇదొక నిదర్శనం.

ఆళవందార్లు తిరిగి శ్రీరంగమునకు చేరి తన తర్వాత ఈ సంప్రదాయ బాధ్యతలు ఎవరికి అప్పగించవలనని కలత చెందుతుండగా, ఇళయాళ్వార్  (శ్రీరామానుజులు) గుర్తుకు వచ్చిరి. ఆ సమయంలో, ఇళయాళ్వార్ కాంచీపురములో యాదవ ప్రకాశుల వద్ద విద్యను అభ్యసించుచున్నారు. ఆళవందార్లు వరదరాజ స్వామిని సేవించుకొని, కరియమాణిక్క పెరుమాళ్ళ సన్నిధిన నిలబడి ఉండగా, అదే సమయమున ఇళయాళ్వార్ విద్యార్థుల గోష్ఠితో ఆ వైపు వచ్చిరి. ఆళవందార్లు ఇళయాళ్వార్లపైన తమ కృపా కటాక్షములు కురిపించి, దేవ పెరుమాళ్ళ సన్నిధికి వెళ్ళి ఇళయాళ్వార్లని తమ తర్వాత దర్శనాస్థాపకులుగా చేయమని ప్రార్థించిరి. అలా ఆళవందార్లు విత్తనమును నాటి మహా వృక్షమును చేసిరి, అదే ‘ఎంబెరుమానార్ దర్శనం. ఇళయాళ్వర్ల ఆధ్యాత్మిక ఙ్ఞానాభివృద్దికై  సహకరించవలసినదని తిరుక్కచ్చినంబిని ఆఙ్ఞాపించారు.

ఆళవందార్లు తమ చరమ దశలో తన శిష్యులందరిని తిరువరంగ పెరుమాళ్ అరయర్ని ఆశ్రయించమని  చెప్పి కొన్ని సూచనలు చేసిరి.

వాటిలో విలువైనవి కొన్ని

 1. దివ్య దేశములు మన జీవితం. ఎప్పుడూ వాటిని స్మరిస్తూ, కైంకర్యం చేస్తూ సమయమును గడపాలి.
 2. పెరియ పెరుమాళ్ళ శ్రీచరణములందు వేంచేసి ఉన్న తిరుప్పాణాళ్వార్ను సేవించాలి. తాను ఎల్లప్పుడు తిరుప్పాణాళ్వర్లనే స్మరిస్తూ, వారే ఉపాయ ఉపేయములని భావించాను (తిరువరంగ పెరుమాళ్ అరయర్ ఎల్లప్పుడు వారినే ఆరాధించేవారు). అలానే వీరు తిరుప్పాణాళ్వార్లను (పెరియ పెరుమాళ్ళ గురించి పాడిరి), కురువరుత్త నంబి (తిరువేంగడ పెరుమాళ్ళకి మట్టి పుష్పాలను సమర్పించినవారు), తిరుక్కచ్చి నంబి (దేవ పెరుమాళ్ళకు తిరువాలవట్ట కైంకర్యము చేసినవారు) ని ఒకే స్థాయిలో చేస్తాను.
 3. ప్రపన్నులు ఎప్పుడు తమ ఆత్మయాత్ర (భగవద్విషయము) గురించి కాని దేహ యాత్ర (లౌకికము) గురించి కాని చింతింపరాదు. ఆత్మ ఎప్పుడూ భగవానుని పారతంత్ర్యమే, ఆత్మ యాత్ర గురించి భవానుడే చూసుకొనును. అలానే దేహము కర్మ ద్వారా నడుచును. మన దేహయాత్ర మన పుణ్యము/ పాపములే నడిపించును. అందువలన మనము వాటి గురించి చింతించకూడదు.
 4. మనము ఎప్పుడు భాగవతాపచారము చేయరాదు, వారిని సదా భగవానునితో సమానముగా గౌరవించవలెను.
 5. భగవానుని శ్రీచరణ తీర్థమును ఎలాగైతే స్వీకరిస్తామో అలానే ఆచార్య శ్రీపాద తీర్థమును కూడా స్వీకరించవలెను.
 6. ఆచార్య పురుషులు శ్రీపాద తీర్థమును ఇతరులకు ఇస్తున్నప్పుడు, తాను తమ ఆచార్యుని ప్రతినిధిగా భావించి ఇవ్వాలి (స్వతంత్రించరాదని భావం). వాక్య గురుపరంపరను/ ద్వయ మంత్రానుసంధానము చేస్తూ ఇవ్వవలెను.

చివరగా తమ శిష్యులను, ఇతర శ్రీ వైష్ణవులందరిని సమావేశ పరచి తన కర్తవ్య నిర్వాహణలో ఏమైనా దోషములున్న మన్నించమనిరి. శ్రీపాద తీర్థమును తీసుకొని, వారందరికి తదీయారాధన చేసి తమ చరమ తిరుమేనిని వదిలి పరమపదమును చేరిరి. వారి శిష్యులందరు బాధతో వారి చరమ కైంకర్యమునకు గొప్పగా ఏర్పాట్లు చేయసాగిరి. ఎవరైన శ్రీవైష్ణవులు పరమపదము చేరితే అది వరముగా భావించి వారికి చాలా వైభవముగా చరమ కైంకర్యమును నిర్వహించుచుందురు. చరమ కైంకర్యములో తిరుమంజనము, శ్రీచూర్ణ పరిపాలనము, అలంకారము, బ్రహ్మ రథము మొదలైనవి ఉంటాయి.

ఇలా ఉండగా, పెరియ నంబి కాంచీపురము నుండి ఇళయాళ్వార్లని తమతో శ్రీరంగమునకు తీసుకురావడానికి వెళ్ళిరి. అప్పుడు ఇళయాళ్వార్లు దేవ పెరుమాళ్ళ తీర్థ కైంకర్యమునకై శాలక్కిణర్ బావి దగ్గర ఉండెను. పెరియ నంబి అక్కడకు వెళ్ళి ఆళవందార్ల స్త్రోత్ర రత్నమును బిగ్గరగా పఠించారు. ఇది విన్న ఇళయాళ్వార్ల్ఉ వాటి లోతైన అర్థములకు ముగ్థుడై, పెరియ నంబిని ఆ శ్లోకములను ఎవరు రచించారని అడిగిరి. అప్పుడు పెరియ నంబి ఆళవందార్ల గొప్పతనమును గురించి చెప్పి తమతో పాటు ఇళయాళ్వార్లని శ్రీరంగమునకు రావలసినదిగా కోరిరి. ఇళయాళ్వార్ల్ఉ వారి కోరికను మన్నించి దేవ పెరుమాళ్ళు, తిరుక్కచ్చి నంబి వద్ద ఆఙ్ఞ తీసుకొని శ్రీరంగమునకు బయలుదేరిరి. వారు శ్రీరంగ సమీపమునకు చేరుతుండగా ఆళవందార్ల చరమ యాత్రని చూసి పెరియ నంబి క్రింద పడి దుఃఖించుచుండగా, ఇళయాళ్వార్లు అక్కడ ఉన్న శ్రీవైష్ణవులని విచారించి, ఏమి జరిగినదో గ్రహించిరి.

ఆ సమయములో ఆళవందార్లకు చరమ కైంకర్యము సమయాన అక్కడి వారందరు వారి చేతి వేళ్ళలో మూడు వేళ్ళు ముడుచుకొని ఉండడము గమనించగా, ఇళయాళ్వార్లు దాని కారణము అడుగగా, శ్రీ వైష్ణవులు ఆళవందార్ల 3 తీరని కోరికల గురించి చెప్పిరి. అవి:

 1. వ్యాస పరాశరుల ఉపకారమునకు మనము కృతఙ్ఞతని చూపవలెను.
 2. నమ్మాళ్వార్ల యందు అధికాభిమనమును ప్రదర్శించవలెను.
 3. వ్యాసుని బ్రహ్మ సూత్రములకు విశిష్టాద్వైతపరముగా భాష్యమును రచించవలెను.

అవి విన్న ఇళయాళ్వార్లు వెంటనే ఆ మూడు కోరికలను తాను పూర్తి చేయుదనని ప్రమాణము చేయగానే ఆళవందార్ల వేళ్ళు తెరుచుకొనెను. అక్కడ గుమికూడిన శ్రీవైష్ణవులు అది చూచి ఆనందపరవశులై, ఆళవందార్ల కృప, శక్తి పూర్తిగా వీరియందు ఉండునని, మన దర్శన నిర్వాహణకై వీరు వచ్చినారని ఆనందించిరి. చరమ కైంకర్యములు పూర్తైన పిమ్మట ఇళయాళ్వార్, ఆళవందార్లు ఇక లేరనే బాధతో నంపెరుమాళ్ళని దర్శించకుండానే కాంచీపురమునకు తిరిగి వచ్చిరి.

ఆళవందార్లు ఉభయ వేదాంతములలో గొప్ప పండితులు. చాలా సులభముగా శ్రీసూక్తులను వారి గ్రంథములను నుండి అర్థము చేసుకోవచ్చును.

* పిరాట్టి తత్త్వమును చతుః శ్లోకిలోని 4 శ్లోకముల ద్వారా వివరించిరి.

* స్త్రోత్ర రత్నము నిజముగా ఒక రత్నమే – శరణాగతి భావమును (తిరువాయ్మొళిలో వివరించిన విధముగా) చాలా సులభంగా శ్లోకముల ద్వారా అందించిరి.

* గీతార్థ సంగ్రహం ద్వారా గీతలోని తత్త్వమును వెలికి తీసిరి.

* ‘ఆగమ ప్రామాణ్యము’ శ్రీపాంచారాత్ర ఆగమ ప్రాముఖ్యతని, ప్రాబల్యమును గుర్తించిన మొదటి గ్రంథము.

ఆళవందార్ల తనియన్ :

యత్ పదాం భోరుహ ధ్యాన విధ్వస్తాశేషకల్మషః |
వస్తుతాముపయాతోऽహం యామునేయం నమామి తం ||

ఎవరి దివ్య కృపతో నా కల్మషములన్నీ నాశనము చెందినవో, ఒక వస్తువుగా గుర్తించబడ్డానో పూర్వము అసత్ (అచేతనము) గా ఉండి యామునాచార్యుల పాదముల ధ్యానముతో ప్రస్తుతం సత్ (ఆత్మ/ చేతనము) గా భావిస్తున్నానో ఆ శ్రీయామునాచార్యులకు నమస్కరిస్తున్నాను.

తదుపరి సంచికలో పెరియనంబి వైభవమును తెలుసుకుందాము.

అడియేన్ రఘు వంశీ రామానుజ దాసన్

మూలము:

పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

18 thoughts on “ఆళవందార్”

Comments are closed.