శ్రీమన్నాథమునులు

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

గత సంచికలో మనం నమ్మాళ్వార్ల గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల  గురించి తెలుసుకొందాం.

నాథమునులు, కాట్టుమన్నార్ కోయిల్

తిరునక్షత్రం    :  జ్యేష్ఠ మాసం, అనురాధా నక్షత్రం
అవతారస్థలం  : కాట్టుమన్నార్ కోయిల్ (వీర నారాయణపురం)
ఆచార్యులు : నమ్మాళ్వారులు
శిష్యులు:   ఉయ్యక్కొండార్, కురుగై కావలప్పన్, పిళ్ళై కరుణాకర దాసర్, నంబి కరుణాకర్ దాసర్, యేరు తిరువుడైయార్, తిరుక్కణ్ణమంగై ఆన్డాన్, వానమామలై  దైవనాయక ఆణ్డాన్, ఉరుప్పట్తూర్ ఆచ్ఛాన్ పిళ్ళై, చోగత్తూర్ ఆళ్వాన్,  కీళైఅగత్తానాళ్వాన్, మేళైఅగత్తానాళ్వాన్ మొదలైనవారు.
శ్రీసూక్తి గ్రంథములు: న్యాయ తత్త్వం, యోగ రహస్యం , పురుష నిర్ణయం

శ్రీమన్నాథమునులు వీరనారాయణపురంలో ఈశ్వరభట్టాళ్వార్లకు జన్మించారు. వీరికి రంగనాథముని, నాథ బ్రహ్మర్ అను నామధేయములు కలవు. వీరు అష్టాంగ యోగంలో, దేవగానంలో నిష్ణాతులు. వీరే ‘అరయర్ సేవ’ ని దివ్య దేశములలో ప్రవేశ పెట్టారు. ఇప్పటికీ ఆ సేవను మనం శ్రీరంగం, ఆళ్వార్తిరునగరి, శ్రీవిల్లిపుత్తూర్లలో సేవించ వచ్చును.

నాథమునులు తమ తండ్రిగారు, భార్య, పుత్రుడు ఈశ్వరమునితో కలసి మథుర, బృందావనం, గోవర్ధనగిరి, ద్వారక, బదరికాశ్రమం, నైమిశారణ్యం మొదలలైన దివ్యదేశాల దర్శనానికి వెళ్లిరి. వీరు యమునా తీరమున ఉన్న గోవర్ధనపురం అనే ఊరిలో ఉన్నప్పుడు, నాథమునులకు రాత్రి కలలో భగవానుడు సాక్షాత్కరించి కాట్టుమన్నార్ కోయిల్ కి  తిరిగి వెళ్ళమని ఆదేశించిరి. వారు తిరుగు ప్రయాణంలో వారణాసి, జగన్నాథ పురి, సింహాచలం, తిరుమల, ఘటికాచలం, కాంచీపురం, తిరువహీంద్రపురం, తిరుక్కోవలూరు, శ్రీరంగం, కుంభకోణం మొదలైన దివ్యదేశాలను దర్శించి, ఆయా దివ్యదేశాలలో వేంచేసి ఉన్నపెరుమాళ్ళకు మంగళాశాసనము గావించి చివరికి వీరనారాయణపురము చేరుకొన్నారు.

ఒకనాడు ఒక  శ్రీవైష్ణవ బృందం మేలైనాడు (తిరునారాయణపురము) నుండి కాట్టుమన్నార్ కోయిల్ ను దర్శించి తిరువాయ్మొళిలోని ‘ఆరావముదే పత్తును (పది పాశురములు) కాట్టుమన్నార్ పెరుమాళ్ళ సన్నిధి ఎదుట సేవించిరి. వాటి అర్థం గ్రహించిన నాథమునులు ఆ శ్రీవైష్ణవ బృందాన్ని ఆ పాశురముల గురించి వాకబు చేసారు. కానీ వాళ్ళు ఆ పద కొండు పాశురములు తప్ప మరేతర విషయం తమకు తెలియదని చెప్పారు. మీరు తిరుక్కురుగూర్ వెళ్ళితే వాటి పూర్తి సమాచారం అక్కడ తెలుసుకోవచ్చు అని చెప్పారు. వెంటనే నాథమునులు ఆళ్వార్తిరునగరికి చేరి అక్కడ మధురకవి ఆళ్వార్ల శిష్య వంశములోని పరాంకుశ దాసులు అనే వారిని కలిసారు. వారు నాథమునులకు “కణ్ణినుణ్ శిరుఱ్ఱాంబు” అనే ప్రబంధమును ఉపదేశించి దానిని 12 వేల సార్లు తిరుప్పుళి ఆళ్వార్ (చింతచెట్టు – నమ్మాళ్వార్లు వేంచేసి ఉన్న స్థలం) ఎదుట ప్రార్థించమనిరి. నాథమునులు అష్ఠాగయోగం ఎరిగిన వారైనందున నమ్మాళ్వార్లని స్మరించి 12000 వేల సార్లు కణ్ణినుణ్ శిరుఱ్ఱాంబు ని జపించిరి. వీరు ప్రార్థనకు నమ్మాళ్వార్లు మెచ్చి, ఎదుట ప్రత్యక్షమయ్యి అష్ఠాంగయోగము నందు వారికున్న శ్రద్ధను అభినందించి 4 వేల పాశురములు కలిగిన దివ్య ప్రబంధమును వాటి అర్థములను ఉపదేశించిరి. ఏ విధముగా పెరుమాళ్ళు నమ్మాళ్వార్లకు జ్ఞానాన్ని అనుగ్రహించారో, అదే విధముగా శ్రీనమ్మాళ్వార్లు నాథమునులకు జ్ఞానాన్ని అనుగ్రహించెను. అందుకే మణవాళ మామునులు తమ ఉపదేశ రత్నమాలలో “అరుళ్ పెత్త నాథముని ముదలాన” అని అన్నారు.

ఆ తరువాత, నాథమునులు కాట్టుమన్నార్ కోవెలకి తిరిగి వచ్చి మన్నార్ పెరుమాళ్ళ ఎదుట నాలుగు వేల దివ్యప్రబంధ పాశురములను విన్నవించారు. ఆ పాశురములను ఆలకించిన మన్నార్ పెరుమాళ్ళు ముగ్ధుడై దివ్య ప్రబంధాన్నినాలుగు భాగములుగా విభజించి, విస్తరింప చేయుమని ఆఙ్ఞాపించిరి. వీరు ఆ ప్రబంధాలకు రాగ తాళాలను చేర్చి తన మేనళ్లులైన  కీళైఅగత్తాళ్వాన్, మేళైఅగత్తాళ్వాన్లకు నేర్పి దానిని ప్రచారం గావించమనిరి.

నాథమునులు దేవగానంలో నిష్ణాతులు. ఒకసారి ఆ దేశమును పరిపాలించే రాజు సామాన్య గాయకుడికి, దేవగాయకునికి మధ్యన వ్యత్యాసమును గుర్తించలేక నాథమునులు ఆ రాజుకి తెలియపరిచారు. రాజు వీరి సామర్థ్యతను ప్రశ్నించగా, వీరు 4 వేల తాళములతో శబ్దము చేయమని చెప్పి వాటి నుండి వచ్చే శబ్ధమును బట్టి ఒక్కొక్క తాళము బరువును చెప్పిరి – ఇది వీరి నైపుణ్యము. అప్పుడు రాజు వారి గొప్పతనమును గుర్తించి చాల ధనమును కానుకగా ఇచ్చిరి. కాని నాథమునులు వాటిని తిరస్కరించిరి.

నాథమునులు తమ యోగ దృష్ఠితో రాబోవు కాలమున ఆళవందార్లు (వీరి మనుమనిగా) అవతరిస్తారని గ్రహించి, తమ కుమారులైన ఈశ్వరమునులకు ఆ బాలునికి ‘యమునై తురైవన్’ (కృష్ణ పరమాత్మపై తమకు గల ప్రీతి విశేషం చేత) అని నామకరణం చేయమని ఆజ్జాపించిరి. అలాగే తమ శిష్యులందరిని యమునైతురైవన్ కి శాస్త్రములన్నింటిని ఉపదేశించమని నియమించిరి.

నాథమునులు పెరుమాళ్ళ ధ్యానంలో ఉన్నప్పుడు బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయేవారు. ఒకసారి అలా ఉండగా రాజు, అతని భార్యలు నాథమునుల దర్శనార్ధమై వచ్చి ధ్యానంలో ఉండడం చూసి ధ్యాన భంగం కాకుడదని తిరిగి వెళ్ళిపోయారు. కాని నాథమునులు నిర్మలమైన భక్తి ధ్యానములో ఉన్నారు, కావున వచ్చిన వారు కృష్ణ పరమాత్మ, గోపికలుగా భావించి వారి వెనుక పరిగెడుతారు.

మరొకసారి రాజు వేట ముగించుకొని తన భార్య, ఒక వేటగాడు, ఒక కోతితో కలిసి నాథమునుల గృహమునకు వస్తారు. వారి కూతురు నాన్నగారు లేరని చెప్పగా వారు తిరిగి వెళ్ళిపోతారు, కొంత సమయానికి నాథమునులు వచ్చాక వారి కూతురు రాజు వచ్చిన సంగతిని విన్నవిస్తుంది. భగవానుని తదేక ధ్యాసలో ఉన్న వీరికి ఆ వచ్చిన వారు స్వయంగా రామసీతాలక్ష్మణహనుమేనని భావించి వారు వెళ్ళిన దిశగా కనిపించేంత వరకు పరిగెడతారు. వారు కనపడక పోయేసరికి అయ్యో అని ముర్చిల్లుతారు. భగవానుడి ఎడబాటును తట్టుకోలేక అక్కడే పరమపదమును అలంకరిస్తారు. ఆ వార్త విన్న ఈశ్వరమునులు, నాథమునుల శిష్యులు అక్కడ చేరుకొని చరమ కైంకర్యాన్ని జరిపిస్తారు.

దివ్య ప్రబంధమును తిరిగి మనకు అందించడములో నాథమునుల కృషి లేకపోతే ఈవేళ మనము ‘శ్రీవైష్ణవశ్రీ’ ని పొంది ఉండే వాళ్ళము కాదు. ఆళవందార్లు తమ స్తోత్త్ర రత్నంలో నాథమునుల వైభవాన్ని మొదటి 3 శ్లోకాలలో వర్ణిస్తారు.

  1. ఇతర ప్రాపంచిక విషయములందు వైరాగ్యము, అసాధారణమైన భగవద్విషయముల యందే లోతైన ఙ్ఞానము కలిగి నిరంతరము భగవంతున్ని ధ్యానము చేయు, భగవంతుని యందు సముద్రము వంటి లోతైన ఙ్ఞానము కలిగిన శ్రీమన్నాథమునులకు నమస్కరిస్తున్నాను.
  2.  మధు అనే రాక్షసుడిని చంపిన వాని పాద పద్మములందును, భగవతత్త్వఙ్ఞానమందును అనురాగమును అధికముగా గల శ్రీమన్నాథమునుల పాద పద్మములే ఇహపరములందు నాకు శరణ్యము.
  3. అచ్యుతుని యందు అపారమైన భక్తి, నిజమైన జ్ఞానమును కలిగి, అమృత సముద్రమై, ఇతరులను కాపాడుటకు ఈ లోకమున అవతరించినవారై, పరిపూర్ణ భక్తి కలవారై, యోగీంద్రులైన శ్రీ నాథమునులను నమస్కరించుచున్నాను.
  4. చివర శ్లోకంలో దయ చేసి నన్ను, నేను చేసిన పనులను చూసినచో నన్ను అంగీకరించలేవు, నీ పాద పద్మములందు స్వభావ సిద్ధమైన ప్రేమ కలిగి, ఆత్మ గుణ పరిపూర్ణులగు మా పితామహులగు శ్రీమన్నాథములను చూచి అనుగ్రహింపుము.

పైన చెప్పిన 4 శ్లోకములలో మనం నాథమునుల గొప్పతనమును అర్థం చేసుకొని వారి లాగా మనకు అచ్యుతుడికి, ఆళ్వార్లతో  అలాంటి సంబంధం కలిగేలా వృద్ధి చెందాలని శ్రీమన్నాథమునుల శ్రీ చరణాలను ప్రార్థిద్దాము.

స్వాదయన్నిహ సర్వేషాం త్రయ్యంతార్థం సుదుర్గ్రహం |
స్తోత్రయామాస యోగీంద్రః తం వందే యామునాహ్వయం||
యత్పదాంభోరుహ ధ్యానవిధ్వస్తాశేషకల్మషః|
వస్తుతాముపయాతో2హం యామునేయం నమామి తం||
నమో నమో యామునాయ యామునాయ నమో నమః |
నమో నమో యామునాయ యామునాయ నమో నమః |

నాథమునుల తనియన్:

నమో అచింత్యాద్బుత అక్లిష్ట ఙ్ఞానవైరాగ్య రాశయే !
నాథాయ మునయేऽగాధ భగవద్భక్తి సింధవే !!

అడియేన్ రఘువంశీ రామానుజదాసన్.

మూలము: https://acharyas.koyil.org/index.php/2012/08/22/nathamunigal-english/

పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org