ఎంబెరుమానార్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

గత సంచికలో మనము పెరియ నంబి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల  గురించి తెలుసుకొందాం.

ramanuja thirumeni darsanamతిరు నక్షత్రం: చైత్ర మాసము, ఆరుద్ర నక్షత్రము
అవతారస్థలం: శ్రీపెరుంబూదూర్
ఆచార్యులు: పెరియ నంబి
శిష్యులు: కూరతాళ్వాన్, ముదలియాండాన్, ఎంబార్, అరుళళ పెరుమాళ్ ఎంబెరుమానార్,
అనంతాళ్వాన్, 74 సింహాసనాధిపతులు, కొన్ని వేల మంది శిష్యులు.12000 శ్రీ వైష్ణవులు, 74 సింహాసనాధిపతులు, 700 సన్యాసులు, అనేక కులాల వారెందరో శ్రీవైష్ణవులు రామానుజుల శిష్యులుగా చెప్పబడుతారు.
వీరు పరమపదించిన ప్రదేశము : శ్రీరంగం
శ్రీసూక్తి గ్రంధములు: వీరు నవ రత్నములనెడి తొమ్మిది గ్రంధ రచనలను చేసారు. అవి శ్రీభాష్యము, గీతా భాష్యము, వేదార్ధ సంగ్రహము, వేదాంత దీపము, వేదాంత సారము, శరణాగతి గద్యము, శ్రీరంగ గద్యము, శ్రీ వైకుంఠ గద్యము మరియు నిత్య గ్రంధము.

కేశవ దీక్షితులు, కాంతిమతి అను పుణ్య దంపతులకు ఆదిశెషుని అంశముగా ఇళయాళ్వార్లు శ్రీపెరుంబూదూర్ అను గ్రామమున జన్మించిరి. వీరికి అనేక నామధేయములు కలవు. ఎవరు వీరికి అవి బహూకరించెనో ఇప్పుడు చూద్దాము.

  • పెరియ తిరుమలై నంబి వారు రామానుజుల తల్లిదండ్రుల తరపున ఇళయాళ్వార్ అని నామకరణం చేసిరి.
  • పంచ సంస్కార సమయమున పెరియ నంబి శ్రీరామానుజ అని బహూకరించెను.
  • సన్యాసాశ్రమ స్వీకార సమయమున దేవ పెరుమాళ్ళు యతిరాజ అని పిలిచారు.
  • తిరువరంగ పెరుమాళ్ అరయర్ లక్ష్మణముని అని బహూకరించెను.
  • తిరుక్కోష్టియూర్ నందు వారికి శరణాగతి చేసిన వారి అందరికి; చరమ స్లోక అర్ధమును ఉపదేశించ్చినప్పుడు తిరుక్కోష్టియూర్ నంబి వారిని ఎంబెరుమానార్ అని పిలిచి వారికి ఆ పేరును బహూకరించెను.
  • శఠగోపన్ పొన్నడి అని తిరుమాలై అండాన్ బహూకరించెను.
  • కోయిల్ అణ్ణన్ అని తిరుమాలిరుంజోలై అళగర్కు 100 గంగాళాలలో పాయసం, 100 గంగాళాలలో వెన్న నైవేద్యముగా సమప్రించినప్పుడు ఆండాళ్ బహూకరించెను.
  • కాష్మీర దేశము నందు సరస్వతి దేవి శ్రీ భాష్యకారర్ అని బిరుదును బహూకరించెను.
  • శ్రీపెరుంబూదూర్ నందు ఆదికేశవ పెరుమాళ్ళు భూతపురీశర్ అని బహూకరించెను.
  • తిరువేంకటేశ్వరుడు వారికి దేశికేంద్ర అను బిరుదును బహూకరించెను.

వారి జీవిత చరిత్ర సంగ్రహముగ:

  • తిరువల్లిక్కేణి పార్ధసారధి పెరుమాళ్ళ కటాక్షముతో వారి అంశావతారముగా శ్రీపెరుంబూదూర్లో అవతరించిరి.
ఉభయ నాచ్చియార్ సమేత పార్ధసారధి పెరుమాళ్ - తిరువల్లిక్కేణి
ఉభయ నాచ్చియార్ సమేత పార్ధసారధి పెరుమాళ్ – తిరువల్లిక్కేణి
  • తంజమ్మాల్ (రక్షకాంబాళ్) తో వీరికి వివాహము జరిగెను.
  • కాంచిపురమున యాదవప్రకాశుల వద్ద సామాన్య శాస్త్రమును, పూర్వ పక్షమును నేర్చుకొనెను.
  • శాస్త్ర వాక్యములకు యాదవప్రకాశుల ఇచ్చే వంకర అర్థాలను వీరు సరిదిద్దేవారు.
  • యాదవ ప్రకాశుల శిష్యులు కొందరు వారణాసి యాత్రలో, ఇళయాళ్వర్లను హత్య చేయాలను పూనుకొనగా, ఇళయాళ్వర్ల పిన్ని కొడుకైన గోవిందర్ (ఎంబార్), ఆ హత్య నుండి ఇళయాళ్వర్లను తప్పించి, వారిని కాంచిపురానికి వెళ్ళమని పంపి వేసెను. వారు ఆ అడవిలో తప్పిపోయి దారిని వెదుకుతుండగా, దేవ పెరుమాళ్ళు పెరుందేవి తాయారుతో కలిసి వీరికి సహాయపడి, కాంచిపురానికి చేర్చెను.
  • కాంచిపురానికి విచ్చేసిన తరువాత; వారి తల్లిగారి ఆదేశము ప్రకారము, తిరుక్కచ్చి నంబి వారి ఆధ్వర్యములో దేవ పెరుమాళ్ళకు సేవించుచుండెను.
  • పెరియ నంబితో కలిసి ఇళయాళ్వార్లు శ్రీరంగానికి ఆళవందార్లను దర్శించుకొనుటకు బయలుదేరెను. కాని వారికి ఆళవందార్ల చరమ తిరుమేని దర్శనము మాత్రమే లభించెను. అప్పుడు ఆళవందార్ల 3 కోరికలను తీర్చుతానని ప్రతిజ్ఞ చేసెను.
  • ఇళయాళ్వార్లు తిరుక్కచ్చినంబి వారిని గురువుగా భావించి; వారిని పంచ సంస్కారములు ప్రసాదించమని కోరెను. అలా చేయుట శాస్త్ర ప్రమామం కాదని తిరుక్కచ్చినంబి నిరాకరించెను. కనీసం వారి శేష ప్రసాదము పొందాలని ఇళయాళ్వార్లు ఆశించెను. ఆ కోరిక కూడ తీరలేదు.
  • దేవ పెరుమాళ్ళు తిరుక్కచ్చి నంబి ద్వారా ఇళయళ్వార్లకు ఆరు వార్తలు (ఆరు విషయములు) అందించెను.
  • పెరియ నంబి, ఇళయాళ్వర్లు ఇరువురు మధురాంతకములో కలుసుకొని, ఇళయాళ్వర్లకు పంచ సంస్కారములను కావించి; వారికి ‘రామానుజ’ అను దాస్య నామమును ఇచ్చెను.
  • రామానుజుల తిరుమాలిగలో పెరియ నంబి వారు కొంతకాలం ఉండి, వారికి సంప్రదాయ అర్ధములను బోధ చేసిరి. తుదకు పెరియ నంబి వారు శ్రీరంగమునకు వెళ్ళిపోయెను.
  • దేవ పెరుమాళ్ళ వద్ద రామానుజులు సన్యాసాశ్రమమును స్వీకరించెను.
  • ఆళ్వాన్, ఆండాన్ రామానుజులకు శిష్యులయ్యెను.
  • యాదవ ప్రకాశులు రామానుజులకు శిష్యులుగా మారి,  గోవింద జీయర్ అని నామమును పొందెను. వారి ‘యతి ధర్మ సముచయం’ అను గ్రంథమును రచించెను. శ్రీవైష్ణవ యతులకు అది ప్రమాణముగ భాసిల్లుచున్నది.
  • పెరియ పెరుమాళ్ళు తిరువరంగ పెరుమాళ్ళను దేవ పెరుమాళ్ళ వద్దకు పంపి; రామానుజులను శ్రీరంగమునకు పంప వలసినదిగా కోరెను. దేవ పెరుమాళ్ళు అందుకు అంగీకరించగా, రామానుజులు శ్రీరంగవాసి అయ్యెను.
  • రామానుజులు పెరియ తిరుమలై నంబిని పంపి, గోవింద భట్టర్లను (ఎంబార్) తిరిగి శ్రీవైష్ణవములోకి తీసుకువచ్చేను.
  • చరమ శ్లోకార్ధమును తిరుక్కోష్ఠియూర్ నంబి వద్ద నేర్చుకొనుటకు రామానుజులు తిరుక్కోష్టియూర్ వెళ్లి, అక్కడ నేర్చుకొనుటకు ఆసక్తి ఉన్న వారందరికి ఆ శ్లోకార్థమును వివరించెను. అది చూసి నంబి సంతోషించి ఎంబెరుమానార్ అని బిరుదును బహూకరించెను.
  • తిరువాయ్మొళి కాలక్షేపమును తిరుమాలై ఆండాన్ల వద్ద నేర్చుకొనెను.
  • తిరువరంగ పెరుమాళ్ అరయర్ వద్ద పంచమోపాయ (ఆచార్య) నిష్ట నేర్చుకొనెను.
  • ఎంబెరుమానార్లు తన సంబంధము ఉన్న వారందరి శ్రేయస్సు కొరకు పరమ కారుణ్యముతో నంపెరుమాళ్ళు, శ్రీరంగ నాచ్చియార్ ఎదుట శరణాగతి చేసెను.
  • ఎంబెరుమానార్లకు ఒకనాడు విషపూరిత భిక్ష ఇవ్వబడెను. తిరుక్కోష్ఠియూర్ నంబి శ్రీరంగమునకు వచ్చి, కిడాంబి ఆచాన్లను ఎంబెరుమానార్ల భిక్ష బాధ్యతను స్వీకరించవలసినదిగా ఆదేశించెను.
  • రామానుజులు యజ్ఞ మూర్తిని వాదనలో వోడించిరి. వారు అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లుగా మారి, ఎంబెరుమానార్ల (రామానుజుల) తిరువారాధన పెరుమాళ్ళ  తిరువారాధన కైంకర్యమును పొందెను.
  • అనంతాళ్వాన్లను, మరికొందరిని అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ల శిష్యులవ్వమని ఆదేశించెను.
  • అనంతాళ్వాన్లను తిరుమల వేంకటేశుని నిత్య కైంకర్యము చేయమని తిరుమలకు పంపెను.
  • ఎంబెరుమానార్లు దివ్య దేశ యాత్రకు వెళ్ళి, తిరుమల చేరుకొనెను.
  • ఆ పిమ్మట తిరువేంకటేశ్వడిని విష్ణు మూర్తి (విగ్రహము) అని నిరూపించి; కుదృష్టులని ఓడించెను.
  • రామానుజులు తిరువేంకటేశ్వడి ఆచార్యునిగా కీర్తించబడెను. ఇప్పటికి కూడ రామానుజులు తిరుమలలో జ్ఞాన ముద్రలో దర్శనమిస్తారు.
ఎమ్పెరుమానార్ - తిరుమల
ఎంబెరుమానార్లు – తిరుమల
  • అక్కడ పెరియ తిరుమలై నంబి వద్ద శ్రీరామాయణ కాలక్షేపమును వినెను.
  • ఎంబెరుమానార్లు గొవింద భట్టర్లకు సన్యాసాశ్రమమును ప్రసాదించి వారికి ఎంబార్లుగ నామకరణము చేసెను.
  • ఎంబెరుమానార్లు కూరతాళ్వాన్లతో కలిసి కాశ్మీరు దేశమునకు ‘బోదాయన వృత్తి’ గ్రంధమును తెచ్చుటకు వెళ్ళెను. వారికి గ్రంధము లభించినప్పటికి అక్కడి పండితులు వారి సైన్యమును పంపి వారి దగ్గర నుంచి తిరిగి తీసుకొనెను. అప్పుడు ఆళ్వాన్లు ఆ గ్రంథం మొత్తాన్ని తాను ధారణలో నిలుపుకున్నట్లు చెప్పెను.
  • ఎంబెరుమానార్లు ఆళ్వాన్ల సాహాయముతో శ్రీభాష్యమును రచించెను. ఈ విధముగా ఆళవందార్ల మొదటి కోరిక నిరవేర్చెను.
  • ఎంబెరుమానార్లు ఒకనాడు తిరుక్కురుంగుడి దివ్య దేశమునకు వెళ్ళగ అక్కడి పెరుమాళ్ళు రామానుజులకు శిష్యుడయ్యి శ్రీవైష్ణవ నంబి అను పేరు పొందెను.

  • నంపెరుమాళ్ళ కృపతీ ఆళ్వాన్, ఆండాళ్ దంపతులకు ఇద్దరు కుమారులు జన్మించెను.
  • ఎంబెరుమానార్లు వారికి పరాశర, వేద వ్యాస అని నామకరణము చేసి ఆళవందార్ల రెండవ కోర్కెను తీర్చెను.
  • ఎంబార్ల సోదరుడైన శిరియ గోవింద పెరుమాళ్ళకు బిడ్డ పుట్టగ వారికి “పరాంకుశ నంబి” అని నామకరణము చేసి ఆళవందార్ల మూడవ కోర్కెను తీర్చెను. అదే విధముగా ఎంబెరుమానార్లు తిరుక్కురుంగై పిరాన్ పిళ్ళాన్ వారికి తిరువాయ్మొళికి భాష్యమును రచించమని చెప్పి ఆళవందార్ల మూడవ కోర్కెను తీర్చెనని ప్రసిద్ధి.
  • ఎంబెరుమానార్లు తిరునారాయణపురమునకు వెళ్ళి, అక్కడ ఆలయ నిర్వహణను, ఆరాధనా విధనమును స్ధాపించి ఎందరికో పంచ సంస్కారములను ప్రసాదించెను.
  • ఒకనాడు ఎంబెరుమానార్లు 1000 తలల ఆదిశేషునిగా మారి 1000 జైనులను ఏక కాలమున వాదనలో ఓడించెను.
  • ఎంబెరుమానార్లు శెల్వ పిళ్ళై ఉత్సవ మూర్తిని తిరిగి సంపాదించి, ఆ మహమ్మదీయ రాజు కుతురికి శెల్వ పిళ్ళైకు వివాహము చేసెను.
  • ఎంబెరుమానార్లు శైవ రాజు మరణము పొందిన పిదప శ్రీరంగమునకు వేంచేసెను. దేవ పెరుమాళ్ళను సేవించి తమ కన్నులు తిరిగి పొందమని కూరత్తాళ్వాన్లను ఆదేశించెను.
  • ఎంబెరుమానార్లు తిరుమాలిరుంజోలై  దేశమునకు వెళ్ళి; 100 గంగాళాల పాయిసం, 100 గంగాళాల వెన్నను నివేదన చేసి ఆండాళ్ కోరికను తీర్చెను.
  • ఎంబెరుమానార్లు పిళ్ళై ఉరంగావిల్లి దాసర్ల గొప్ప తనమును ఇతర శ్రీవైష్ణవులకు చూపించెను.
  • ఎంబెరుమానార్లు వారి శిష్యులకు అనేక చరమ ఆదేశములను ఇచ్చెను. పరాశర భట్టర్లను వారితో సమానముగ చూడవలెనని ఆదేశించెను. నంజీయర్లను మన సంప్రదాయమునకు మార్చవలసిందిగ పరాశర భట్టర్లకు ఆదేశించెను.
  • చివరిగా ఆళవందార్ల తిరుమేనిని ధ్యానము చేసుకొనుచూ, ఈ లీలా విభూతిలో తమ లీలను పూర్తి చేసుకొని నిత్య విభూతి యందు లీలను కొనసాగించుటకై పరమపదమునకు సాగెను.
  • ఆళ్వార్ల చరమ తిరుమేనిని ఆళ్వార్ల తిరునగరిలో ఆదినాథుడి కోవెలలో భద్రము చేసినట్లు; ఎంబెరుమానార్లు చరమ తిరుమేనిని శ్రీరంగములో రంగనాథ కోవెలలో భద్రపరచబడి ఉంది. (ఎంబెరుమానార్ల సన్నిది వద్ద మూలవర్ తిరుమేని క్రింద). వారి చరమ కైంకర్యములు అన్ని రంగనాథ బ్రహ్మోత్సవము వలె వైభవముగా జరిగెను.

మన సంప్రదాయమున ఎంబెరుమానార్లకు ఉన్న అద్వితీయమైన స్ధానము:

మన ఆచార్య రత్నహారములో ఎంబెరుమానార్లను నాయక మణిగా (మధ్యలో ఉండునది) అని కీర్తిస్తారు. నాయనార్ ఆచాన్ పిళ్ళై (పెరియవాచాన్ పిళ్ళై వారి తనయులు) వారి చరమోపాయ నిర్ణయం అను గ్రంథమున ఎంబెరుమానార్ల పూర్తి వైభవమును చాటి చెప్పిరి. ఆ గ్రంథములోని కొన్ని అద్భుతమైన విషయములను మనము ఇప్పుడు చెప్పుకుందాము.

  • మన పూర్వాచార్యుల (రామానుజులకు ముందు, తరువాత వారు) శ్రీసూక్తుల ప్రకారము శ్రీవైష్ణవులకు చరమోపాయము ఎంబెరుమానార్లు అని నిర్ధారించెను.
  • మన పూర్వచార్యులందరు తమ ఆచార్యులపై ఆధారపడినప్పటికీ, వారి ఆచార్యులందరు ఎంబెరుమానార్ల మీద ఆధారపడమని చెప్పెను. ఈ విధముగా ఎమ్పెరుమానార్ల ఉద్ధారకత్త్వము నిరూపించబడెను.
  • పెరియవాచాన్ పిళ్ళై వారి ‘మానిక్క మాలై’ అను గ్రంథములో “ఆచార్య స్ధానము” చాల గొప్పదని, ఎంబెరుమానార్లు మాత్రమే ఆ స్ధానమునకు అర్హులని చెప్పెను.
  • ఎంబెరుమానార్లకు ముందు ఆచార్యులు “అనువృత్తి ప్రసన్నాచార్యులు అని పిలవబడెని. అనగా తమ శిష్యులచే సేవను పొంది, తృప్తి చెందితే వారికి అమూల్యమైన ఉపదేశములను అనుగ్రహించి, వారిని శిష్యులుగా స్వీకరించేవారు. కాని ఎంబెరుమానార్లు, కలియుగ కష్ఠాలను చూసి, ఆచార్యులు “కృపా మాత్ర ప్రసన్నాచార్యులు” గా ఉండవలెనని ఆదేశించిరి. అనగా ఆచార్యులు పూర్తి కారుణ్యముతో, ఉపదేశము పొందాలన్న ఉత్సాహముని అర్హతగా చూసి శిష్యులను స్వీకరించవలెనని అన్నారు.
  • పితృ లోకమున పితృలు ఏ విధముగనైతే సత్ సంతానము చేత లాభము పొందుదురో, అటులనే వారి తరువాతి తరముల వారు కూడా ఏ విధముగ ప్రయోజనమును పొందురో; అదే విధముగ శ్రీవైష్ణవ కులము నందు ఎంబెరుమానార్లకు ముందు ఉన్న ఆచార్యులు, వారి తరువాతి ఆచార్యులు అందరూ రామానుజుల రాకతో హితము పొందెనని ప్రతీతి.
  • వసుదేవుడు/దేవకి, నందగోపుడు/యశోదా, దశరథుడు/కౌసల్య ఏ విధముగ పెరుమాళ్ళకు జన్మనిచ్చుట వలన తరించారో; అదే విధముగ ఎంబెరుమానార్లకు ముందు ఆచార్యులు ప్రపన్న కులము నందు ఎంబెరుమానార్ల అవతారము చేత పావనమయ్యిరి.
  • నమ్మాళ్వార్లు, ఎంబెరుమానార్ల అవతారమునకు ముందుగానే వారిని దర్శించి పొలిగ పొలిగ పొలిగ పదిగము నందు కీర్తించి భవిష్యదాచార్య (ఎంబెరుమానార్) విగ్రహమును నాథమునులకు ప్రసాదించిరి. (నమ్మాళ్వార్ల అనుగ్రహముతో మధురకవి ఆళ్వార్లు తామ్రపర్ణి జలమును మరిగించుట వలన లభించిన భవిష్యదాచార్య విగ్రహము మరొకటి).
భవిష్యదాచార్యులు (విగ్రహము) – ఆళ్వార్ తిరునగరి
భవిష్యదాచార్యులు (విగ్రహము) –ఆళ్వార్తిరునగరి
  • ఈ దివ్యరూపం నాథముని మెదలుకొని ఉయ్యకొండార్ మొదలైనవారి నుండి తిరుకోష్ఠియూర్ నంబి వరకు వచ్చినది. (తామ్రపర్ణి నీటిని మరిగించడం వలన వచ్చిన  వేరొక దివ్యరూపమును తిరువాయ్మొళి పిళ్ళై, మణవాళమామునుల వరకు ఆళ్వార్తిరునగరి భవిష్యదాచార్య సన్నిధిలో ఆరాధింపబడింది.)
  • పెరుమాళ్ళు ఏ విధముగనైతే రఘుకులంలో అవతరించి ఆ కులమును ప్రఖ్యాతి గావించెనో, అదే విధముగ ఎంబెరుమానార్లు ప్రపన్న కులము నందు అవతరించి ఈ కులమును ప్రఖ్యాతి గావించెను అని పెరియ నంబి అన్నారు.
  • ఎంబార్లతో “ఎంబెరుమానార్ తిరువడిగళే తంజమ్, ఎమ్పెరుమానార్లను నాకంటే ఎక్కువగా ధ్యానించు” అని పెరియ తిరుమలై నంబి వారు ఆజ్ఞాపించిరి.
  • తిరుక్కోష్ఠియూర్ నంబి తమ చివరి రోజులలో, రామానుజుల సంబంధము కలుగుట చేత తాను ఎంతో అదృష్టవంతుడినని చెప్పెను. ఒకనాడు తిరుమాలై ఆండాన్లకు రామానుజులతో భేదము కలిగినప్పుడు,  తిరుక్కోష్ఠియూర్ నంబి వారు ఆండాన్లతో ఈ విధముగ అనెను. వారు రామానుజులకు ఏమి కొత్తగ నేర్పించడం లేదని, రామానుజులు సర్వజ్ఞులని చెప్పెను. ఏ విధముగా సాందిపని దగ్గర కృష్ణ పరమాత్మ, వశిష్టుని వద్ద పెరుమాళ్ళు నేర్చుకొనెనో అదే విధముగ రామానుజులు మన దగ్గర నేర్చుకుంటున్నారు, అని చెప్పెను.
  • పెరరుళాళన్, పెరియ పెరుమాళ్, తిరువేంకటేశ్వరుడు, తిరుమాలిరుంజోలై అళగర్, తిరుక్కురుంగుడి నంబి మొదలైన పెరుమాళ్ళు ఎంబెరుమానార్ల గొప్పతనమును కీర్తించి, అందరినీ ఎంబెరుమానార్ల మీద మాత్రమే ఆధారపడమని చెప్పెను.
  • అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్, ఆళ్వాన్, ఆండాన్, వడుగ నంబి, వంగి పురత్తు నంబి, భట్టర్, నడాతూర్ అమ్మాళ్, నంజీయర్, నంపిళ్ళై, అనేక ఆచార్యులు తమ శిష్యులకు ఎంబెరుమానార్ల తిరువడిన్ఇ మాత్రమే ధ్యానించమని, శరణు పొందమని చెప్పేవారు.
  • మన పూర్వాచార్యులు అందరు మనకి ఎంబెరుమానార్లు మాత్రమే ఉపాయ ఉపేయములుగా ధ్యానించాలి అని ఆదేశించెను. దీనినే ‘చరమోపాయ నిష్ఠ’ లేక ‘అంతిమోపాయ నిష్ఠ’ అని అందురు.
  • కూరత్తాళ్వాన్లు తిరువరంగత్తాముదనార్లను సంస్కరించాక; వారు ఎంబెరుమానార్ల యందు గొప్ప ప్రీతిని పొందిరి. వారి భావమును తమ ప్రబంధము (రామానుశ నూఱ్ఱందాది) యందు పొందుపరిచిరి. రామానుజుల వైభవమును పతాక స్ధాయిలో చక్కగ రచించబడెను. ఈ ప్రబంధము రామానుజులు శ్రీరంగములో ఉన్న రోజుల్లో కూర్చబడింది. నంపెరుమాళ్ళు తమ ఉరేరిగింపు సమయమున ఏ వాద్యములు లేకుండా ఈ ప్రబంధము సేవీమ్చవలసిందిగా ఆదేశించెను. మన పూర్వాచార్యులు ఎంబెరుమానార్ల వైభవమును, మన సాంప్రదాయమునకు వారు చేసిన ఎనలేని కృషిని దృష్టిలో ఉంచుకొని, వారి వైభవాన్ని తెలిపే ఈ ప్రబంధమును 4000 దివ్య ప్రబందములలో చేర్చిరి. ఈ ప్రబంధమే ప్రపన్న గాయత్రిగా ప్రసిద్ధి పొందెను. శ్రీవైష్ణవులు తప్పక రోజుకి ఒకసారి అయిన పఠించవలెను.
  • మనవాళ మామునులు వారి ఉపదేశ రత్న మాలైలో మన సాంప్రదాయమును “ఎంబెరుమానార్ దరిశనం” అని నంపెరుమాళ్ళు స్వయంగా నామకరణము చేసినట్లుగా వివరించెను. స్వయంగా రామానుజులు, ఈ సంసారములో చిక్కుకున్న వారికి పరమ కారుణ్యముతో ఉపదేశమును ప్రసాదించి వారిని ఉద్ధరించుటయెగాక, 74 సింహాసనాధి పతులను నియమించి మన సనాతన ధర్మమును ప్రచారము చేసి అందరికీ తెలుసుకోవాలనే కోరికను అర్హతగ చూసి అనుగ్రహీంచవలసినదిగా ఆదేశించెను.

రామానుజుల వైభవమును సంక్షేపముగ చెప్పుట సాధ్యమే కాని; వారి వైభవము అనంతము. తమ 1000 ముఖములతో (ఆదిశేషుడు) కూడ, వారి వైభవమును కీర్తించలేరు. అలాంటిది, మన లాంటి వారి వల్ల సాధ్యపడదు అను చెప్పుటలో అతిశయోక్తి లేదు. మనము కేవలం వారి వల్లన ఏమి భాగ్యమును పొందామో చెప్పుకొని ఆనందమును పొందుట తప్ప మనము వారి వైభవమును పూర్తిగ  కీర్తించలేము. అది అసాధ్యము.

ఎంబెరుమానార్ల  తనియన్:

యోనిత్యమచ్యుత పదామ్బుజ యుగ్మ రుక్మ
వ్యామోహతస్ తదితరాణి తృణాయ మేనే
అస్మద్గురోర్ భగవతోస్య దయైకసింధోః
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే

సీతా రామాంజనేయ దినేష్ రామానుజ దాస

మూలము: https://acharyas.koyil.org/index.php/2012/09/06/emperumanar-english/

పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

46 thoughts on “ఎంబెరుమానార్”

Comments are closed.