తిరువరంగత్తు అముదనార్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

Thiruvarangathu-Amudhanar
తిరువరంగత్తు అముదనార్

తిరు నక్షత్రము: ఫాల్గుణ (ఫంగుణి) హస్తా నక్షత్రం

అవతార స్థలము: శ్రీరంగం

ఆచార్యులు : కూరత్తాళ్వాన్

పరమపదము చేరిన ప్రదేశము : శ్రీరంగం

తిరువరంగత్తు అముదనార్ పూర్వము పెరియ కోయిల్ నంబిగా వ్యవరించ బడెడివారు. వీరు శ్రీరంగమున అధికార ప్రతినిధిగా మరియు పురోహితులుగా (వేద పురాణ విన్నపము చదివెడి వారు) ఉండెడి వారు. ప్రథమంగా వీరు శ్రీరంగ ఆలయములోని కార్యకలాపాలను సంస్కరించే  ఎంపెరుమానార్ (శ్రీరామానుజులు) పై ప్రతికూలంగా ఉండెడివారు. కాని శ్రీమన్నారాయణుని దివ్యకటాక్షముతో అంతిమంగా ఎంపెరుమానార్లతో బాంధవ్యం ఏర్పడి వారి కృపకు పాత్రులయ్యారు .

ఎప్పుడైతే ఎంపెరుమానార్ , పెరియపెరుమాళ్ చే ఉడయవర్ (విభూతి ద్వయ నాయకులు) గా ప్రకటింప బడి ఆలయ సంస్కరణలను ఉత్తమ మార్గములో చేయదలచిరో పెరియ కోయిల్ నంబి వీరిని అంత సులువుగా అంగీకరించ లేదు. ఎంపెరుమానార్ చాలా విసుగు చెంది మొదట వీరిని పదవి నుండి తీసివేయాలని నిర్ణయించుకున్నారు. కాని ఓ రోజు ఎంపెరుమానార్, పెరియ పెరుమాళ్ తిరువీధి / పురప్పాడు గురించి ఎదురు చూస్తునప్పుడు, స్వామి వీరి స్వప్ననమున  సాక్షాత్కరించి పెరియ కోయిల్ నంబి తనకు చాలా కాలము నుండి సేవచేస్తున్న ఆప్తుడిగా సూచించారు.

ఎంపెరుమానార్, పెరియ కోయిల్ నంబిని ఉద్ధరించడానికి మరియు మార్గనిర్ధేశం చేయడానికి, తాను చేయు సంస్కరణలకు తగ్గట్టుగా తయారు కావడానికి కూరత్తాళ్వాన్ ను నియమించారు. ఆళ్వాన్ వారిని ప్రభావశీలురుగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు, అయితే పెరియ కోయిల్ నంబి తాను ఎంపెరుమానార్ కు శిష్యులు కావాలని ఆశించారు. కాని పెరియ కోయిల్ నంబిని, తనను ఉద్ధరించిన కూరత్తళ్వాన్లను ఆచార్యులుగా స్వీకరించ వలసినదని ఎంపెరుమానార్ సూచించారు. పెరియ కోయిల్ నంబి తన సాంప్రదాయ సామర్ధ్యముతో తమిళ భాషలో రాసిన అమృతము వంటి పద్యముల వలన ఎంపెరుమానార్లచే  ‘అముదనార్’ అనే నామంతో వ్యవహరింప బడ్డారు. క్రమంగా అముదనార్ ఆళ్వాన్ మరియు ఎంపెరుమానార్ల తో  తమ బాంధవ్యమును పెంచుకున్నారు.

అముదనార్ పెరియ కోయిల్ అధికార నియంత్రణను ఎంపెరుమానార్లకు  అప్పగించుట

అముదనార్ తల్లిగారు పరమపదించినప్పుడు 11వ రోజున జరుగు ఏకోధిష్ఠమున, మరణించిన వ్యక్తి శరీరమును ఒకరి యందు భావించి వారికి విశేషముగ ఆతిథ్యమును ఇవ్వవలసి ఉండును.   చివరన ఆ ఆతిథ్యము స్వీకరించిన వారిని ఆతిథ్యము ఇచ్చిన వారు ‘మీరు సంతృప్తులయ్యారా’ అని అడగాలి. స్వీకరించిన వారు పూర్తిగా ‘సంతృప్తులమయ్యాము’ అంటేనే ఆ కార్యము సఫలవుతుంది. దీనిలో విశేషమేమనగా ఎవరైతే ఈ ఆతిథ్యమును ఇస్తారో వారు ఒక సంవత్సరము వరకు ఆలయ కైంకర్యమును చేయరాదనే నియమం ఉండెడిది ఆ రోజుల్లో. అముదనార్ ఈ కార్యానికై ఉన్నత లక్షణాలు గల శ్రీ వైష్ణవుడు కావాలని ఎంపెరుమానార్ ఆశ్రయిస్తారు. ఆళ్వాన్ను వెళ్లవలసినదిగా ఎంపెరుమానార్ నియమించగా ఆళ్వాన్ సంతోషముతో అంగీకరిస్తారు. ఆ ఆతిథ్యకార్యము ముగియగా అముదనార్, ఆళ్వాన్ ను సంతృప్తులయ్యారా అని అడుగగా వారు ఆలయ నియంత్రణను ఎంపెరుమానార్ కు అప్పగిస్తే తాము సంతృప్తులము అవతామన్నారు. దీనికి అంగీకరించిన అముదనార్ తమ మాటను నిలబెట్టు కొనుటకై ఆలయ తాళం చెవులను మరియు నియంత్రణను ఆళ్వాన్   ద్వారా ఎంపెరుమానార్ కు అప్పగించారు. కాలక్రమేణ అముదనార్ తమ పౌరోహిత్యమును కూడా ఆళ్వాన్(ఇప్పటికి శ్రీరంగమున మనం ఆళ్వాన్ యొక్క వారసులు కైంకర్యమును చేయుటను సేవించవచ్చు) కు ఇచ్చివేసారు. అధికారం ఇచ్చినప్పటి నుండి అముదనార్ రానురాను ఆలయ కైంకర్యమునకు దూరమయ్యారు. ఎంపెరుమానార్   ఒకపరి తిరువరంగపెరుమాళ్ అరైయర్ దగ్గరకు వెళ్ళి ‘ఇయఱ్పా; గాన అధికారమును  తమకు ఇవ్వవలసినదని ప్రార్థించారు. వారు దీనికి ఆమోదించి  ఆ గానాధికారాన్ని ఎంపెరుమానార్ కి ఇచ్చారు. ఎంపెరుమానార్ ఈ ‘ఇయఱ్పా’ ను అముదనార్ కు అధికరింప చేసి నిత్యము శ్రీరంగనాథుని కైంకర్యమున దీనిని ఆలపించ వలసిన నిత్య కైంకర్యమును వారికి ఏర్పరిచారు.

శ్రీరామానుజ నూఱ్ఱందాది అవతారము మరియు వైభవం

serthi-amudhanar-azhwan-emperumanar
శ్రీరంగనాయకి సమేత నంపెరుమాళ్, అముదనార్, కూరత్తాళ్వాన్, ఎంపెరుమానార్

కొంత కాలం తర్వాత అముదనార్ ఎంపెరుమానార్ పైన  ‘రామానుజ నూఱ్ఱందాది’ ని (108 పాశురములు) రాసి ఎంపెరుమాన్ మరియు ఎంపెరుమానార్ సన్నిధిన ఉంచారు. నంపెరుమాళ్ ఒకసారి తన బ్రహ్మోత్సవ చివరి రోజున ఎంపెరుమానార్ ను ఇక తమ ఊరేగింపు గోష్ఠిలో పాల్గొనరాదని  మరియు శ్రీవైష్ణవులకు  రామానుజ నూర్ట్రందాది ని ఊరేగింపు గోష్ఠిలో  సేవించవలెనని, అది కాలక్రమేణ ప్రతి పురప్పాడులో ఇక నిత్య కృత్యము అవ్వాలని నిర్ణయించారు.

ఎంపెరుమాన్ యొక్క అభీష్ఠమున ఎరిగిన ఎంపెరుమానార్ , అముదనార్  యొక్క ఈ గొప్పకార్యమును  గ్రహించి , ముదలాయిరమ్ నకు ఎలాగైతే మధురకవిఆళ్వార్ కూర్చిన (నమ్మాళ్వార్ వైభవమును సూచించు) కణ్ణినుణ్ శిరుత్తాంబు అంతిమంగా(శాత్తుమరై) ఉండునో    అలాగే ఇయఱ్పా కు ఈ రామానుజ నూఱ్ఱందాది కూడా ఉండాలని నియమనం చేసారు.

ఈ ప్రబంధం ప్రపన్న గాయత్రిగా ప్రసిద్ధి పొందినది, అలాగే ఎంపెరుమానార్  అందరి శ్రీవైష్ణవులకు ప్రతి రోజు ఒక్కసారైన గాయత్రి జపంతో సమానంగా బ్రహ్మోపదేశం (ఉపనయనవీతులు) పొందిన వారందరు తప్పని సరిగ్గా దీనిని అనుసంధించాలని నియమనం చేసారు.

రామానుజ నూఱ్ఱందాదిలో ఎంపెరుమానార్  యొక్క దివ్య నామము ప్రతి పాశురంలో పొందుపరచబడింది. కావుననే దీనికి రామానుజ నూఱ్ఱందాది అనే నామము స్థిరమైనది. ఇది  ఆచార్య అభిమాన నిష్ఠులకు (ఆచార్యుల దయకు పాత్రులైనవారు) అన్నింటిని సమకూర్చునది. ఈ ప్రబంధం ఎవరైతే  ఆచార్యునిపై దృష్ఠిని నిలుపుతారో వారికి ఇక ఏ స్వప్రయత్నము చేయడం అవసరమే లేకుండ భగవత్ సంబంధము కూడా ఏర్పడును. అందుకే మన పూర్వాచార్యులందరు మనం నిత్యము శ్రీ రామానుజుల దివ్య పాదారవిందములపై పూర్తిగా ఆధారపడాలని సూచించారు.

శ్రీ వైష్ణవ పండితుల్లో నాయకుడైన నాడాదూర్ అమ్మాళ్ అనే వారు దివ్య ప్రబంధ మగు రామానుజ నూఱ్ఱందాది లో  45 వ పాశురమగు ‘పేరొన్ఱు మత్తిల్లై’  మరియు  ‘నిన్ఱవణ్ కీర్తియుం’  అను 76 వ పాశురం ఆధారంగా ఎంపెరుమానార్ మనకు లక్ష్యం మరియు దానిని చేరుటకు సాధనం కూడా అని కృపచేసారు.

పెరియ వాచ్చాన్ పిళ్ళై తిరుక్కుమారులగు నాయనార్ ఆచ్చాన్ పిళ్ళై అను వారు తమ కృతమగు చరమోపాయ నిష్ఠ (http://ponnadi.blogspot.in/p/charamopaya-nirnayam.html) అను గ్రంథమున ఎంపెరుమానార్  వైభవమును తెలుపుటకు రామానుజ నూఱ్ఱందాదిని  విస్తృతంగా ఉపయోగించారు.

మాముణులు  రామానుజ నూఱ్ఱందాదిపై  సంక్షేపముగా సుందర మగు ఒక వ్యాఖ్యానాన్ని రచించారు. పరిచయ భాగంలో అముదనార్ మరియు రామానుజ నూఱ్ఱందాది వైభవమును తెలిపిరి. ఆ అమృత రుచిని ఇప్పుడు మనం ఆస్వాదిస్తాము.

తిరు మంత్రం మరియు ఆళ్వారుల పాశుర సారము చరమ పర్వ నిష్ఠ (సర్వం ఆచార్యులపై ఆధారపడి ఉండుట). ఇది నమ్మాళ్వార్  విషయమున మధురకవి ఆళ్వార్ వెల్లడించిరి. మధుర కవి ఆళ్వార్ వలె అముదనార్ కూడ సర్వం ఎంపెరుమానార్  మీద ఆధార పడ్డారు మరియు తమ ప్రబంధములో నిరూపించారు కూడా.

అముదనార్  ఆళ్వాన్   యొక్క అలుపెరుగని మరియు అపార కరుణా ప్రయత్నముతో మరియు   ఎంపెరుమానార్  దివ్య కృపచే సంస్కరించ బడ్డారు. ఎలాగైతే మధుర కవి ఆళ్వార్ తమ 10 పాశురములలోని తమ నిష్ఠతో వెల్లడింప బడ్డారో, అముదనార్  తమ 108 పాశురములో ఆచార్య నిష్ఠను ఈ జగత్తులో ప్రతి వారు ఉజ్జీవించి లాభపడుటకు మరియు ఆచార్య నిష్ఠులకు చాల ప్రధాన సూత్రముగా ఆచార్య నిష్ఠను బహిర్గతం చేసారు. మాముణులు కూడ దీనిని ఉపవీతులకు (ఉపనయన సంస్కారవంతులకు) ప్రధానమగు గాయత్రి మంత్రము వలె ప్రతి శ్రీవైష్ణవ ప్రపన్నుడికి అత్యంత ప్రధానమైనదని, దీనిని ప్రపన్న గాయత్రిగా వ్యవహరించి ప్రతిదినం శ్రీవైష్ణవునిచే పఠింపబడాలి అని వెల్లడించారు..

అముదనార్ ప్రావీణ్యత

అముదనార్ తమిళం మరియు సంస్కృతములలో నిష్ణాతులు. ఇది అతనికి అరుళిచ్చెయళ్లో చాలా పాశురములకు సుందరమగు అర్థాలను తెలుపుటకు తోడ్పడింది.

ఇక్కడ దానికి ఉదాహరణలను సేవిద్దాం:

తిరువిరుత్తం 72 వ పాశురమున, నంపిళ్ళై గారు అముదనార్ యొక్క కథన్నాన్నిఅందంగా వర్ణిస్తారు. ఈ పాశురమున నమ్మాళ్వార్ ,  పరాంకుశ నాయికా అవస్థ (స్థితి) భావనలో ఉన్నప్పుడు  గాఢాంధ రాత్రిన ఎంపెరుమాన్ తో వియోగం కలిగినప్పుడు ఆ భావనను ఆందోళనగా  అనుభవిస్తారు. సాధారణంగా లోకమున ప్రేయసి ప్రియులు వియోగ దుఃఖాన్ని ఎక్కువగా రాత్రి సమయాన అనుభవిస్తారు. ఆ సమాయాన సన్నని చంద్రవంక దర్శనం వలన చీకటి కొంత తగ్గును. సాధారణంగా ఈ చల్లని నెలవంకను చూసి ప్రేమికుల సమూహం ఆనందాన్ని అనుభవిస్తారు, కాని వియోగమున ఇది బాధాకరం. పరాకుంశ నాయకి ఈ నెల వంక చల్లదనం వల్ల ఎంపెరుమాన్ విషయాన తన మానసిక స్థితిని  అసలు నియంత్రించుకోలేక పోయినది. ఈ విషయాన్ని అముదనార్ ఉపమానంతో చాలా చక్కగా వర్ణించారు. ఒకసారి భయస్థుడగు ఒక బ్రాహ్మణుడు రాత్రి సమయాన అడవి గుండా ప్రాయాణిస్తున్నాడు. ఆ సమయాన ఒక అడవి మృగం అతన్ని వేటాడగా దాన్నుండి తప్పించుకొని ఎలాగో ఒక చెట్టుపైన ఎక్కాడు. ఆ మృగం  ఈ బ్రాహ్మణుడు దిగగానే  ఆరగిస్తామని క్రింద ఎదురుచూడ సాగింది. ఆ బ్రాహ్మణుడు చాలా భయపడసాగాడు. ఆ సమయాన్నే ఒక పులి ఆ వైపుగా వచ్చి ఆ అడవి మృగాన్ని చంపి తిని వేసి  ఈ బ్రాహ్మణుడు దిగగానే ఆరగిస్తామని క్రింద ఎదురుచూడ సాగింది. ఆ బ్రాహ్మణుడు క్రితము కన్నా ఇంకా ఎక్కువగా భయపడ సాగాడు పులి తినునేమో అని. అదే విధంగా ఈ పరాంకుశ నాయకి అసలు ఆదిలోనే చీకటికి భయపడ సాగింది ఆపై నెలవంక చల్లదనం – ఇలా అభివర్ణించారు అముదనార్.

భట్టర్ మరియు అముదనార్

భట్టర్ తాను ఆళ్వాన్ కుమారుడని అహంభావించేవారు. తాను స్వయంగా తమ సహస్ర నామ భాష్యములో ఎంపెమానార్ తో గొప్ప సంబంధము గల ఆళ్వాన్కు తాము జన్మించామని చెప్పుకున్నారు. అముదనార్ కూడ ఆళ్వాన్ తో సంబంధమును తమ రామానుజ నూఱ్ఱందాదిలో 7వ పాశురాన చెప్పుకున్నారు.

ఒకసారి అముదనార్ అత్యంత పార వశ్యంతో వేరొక శ్రీవైష్ణవుడితో  భట్టర్ కు ఇలా కబురు  పంపారు “మీకు కేవలం ఆళ్వాన్ తో  శారీరక సంబంధము మాత్రమే, కాని మాకు వారితో ఙ్ఞాన సంబంధము” అని. భట్టర్ దానికి ప్రతి సమాధానంగా“ అది సరే! కాని మీరు అలా ఆత్మస్తుతి చేసుకోరాదు కదా” అనిరి.

ఆళ్వాన్ తో సంబంధము చాల విశేషమైనదని కావుననే  అది అముదనార్ గర్వమునకు దారితీసినది – అని  దీనిలోని వైభవ విషయములో మన పూర్వాచార్యుల అభిమతం. కాని వారు ఈ చర్చల సమస్యలను అంతగా ఇతరులు నొచ్చుకోకుండా ఉండేలా చూసారు. ఆ విషయం ఒక ఉదార మార్గమున  పరిష్కరించారు, ఇలాంటి సంఘటన మనం అర్థము చేసుకుంటామని.  మనం మన పూర్వాచార్యుల నిజాయితీని గొప్పగా అభినందించాలి, ఎందుకనగా ఇలాంటి సంఘటనలను కూడ వారు చాప క్రింద (సాధారణముగా పరిష్కరించలేనిది) దాయకుండా బహిర్గతం చేసారు.

చివరగా మామునులు, తమ  ఆర్తిప్రబంధములోని 40వ పాశురాన – ఈ సంసార సాగరములో మునగ కుండ తప్పించునది అదేనని  గుర్తించారు. మనం ఎంపెరుమానార్   దివ్య పాదార విందముల యందు సదా ఆధీనులమై ఉండాలి, శ్రీరామానుజుల ప్రియ భక్తులతో కాలం గడపాలి. కబురు రామానుజ నూఱ్ఱందాదిని సదా పఠనం / ధ్యానం చేయాలి.

మనం కొంత మాత్రమే  తిరువరంగత్తు అముదనార్ వైభవమును అనుభవించాము. వారు  పూర్తిగా భాగవత నిష్ఠలో ఉండి సదా ఎంపెరుమానార్ కు మరియు ఆళ్వాన్ కు అత్యంత ప్రియతములై ఉండిరి. మనం కూడ వారి  భాగవత నిష్ఠలో కొంతనైనా రావాలని వారి శ్రీపాదాలను ప్రార్థిస్తాము.

తిరువరంగత్త అముదనార్ తనియన్:

శ్రీరంగే మీనహస్తే చ జాతమ్ రంగార్యనందనం |
రామానుజ పదస్కంధం రంగనాథ గురుంభజే  ||

అడియేన్ నల్లా శశిధర్ రామానుజ దాస

మూలము: https://acharyas.koyil.org/index.php/2013/03/26/thiruvarangathu-amudhanar-english/

పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org