నడాదూర్ అమ్మాళ్

   శ్రీ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వవరవరమునయే నమ:
శ్రీ వానాచల మహామునయే నమ:

engaLazhwan

                       ఎంగలాళ్వాన్ శ్రీ చరణములలో నడాదూర్ అమ్మాళ్

తిరునక్షత్రము:  చైత్ర,  చిత్త

అవతార స్థలము: కాంచీపురం

ఆచార్యులు: ఎంగలాళ్వాన్

శిష్యులు: శ్రీ శ్రుతప్రకాశికభట్టర్  (సుదర్శన సూరి), శ్రీ కిడాంబి అప్పుళ్ళార్ మొదలగువారు

పరమపదము చేరిన ప్రదేశము: కాంచీపురం

శ్రీ సూక్తులు: తత్త్వసారము, పరత్వాది పంచకము (లఘువివరణము – http://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-parathvadhi.html), గజేంద్రమోక్ష శ్లోకద్వయము, పరమార్ద శ్లోక ద్వయము, ప్రపన్న పారిజాతము, చరమోపాయసంగ్రహము, శ్రీ భాష్య ఉపన్యాసము, ప్రమేయ మాలై మొదలగునవి.

కాంచీపురంలో అవతరించిన వీరి నామధేయము వరదరాజన్. ఎమ్పెరుమానార్ స్థాపించిన శ్రీ భాష్య సింహాసనాధిపతులలో ఒకరు అయిన నడాదూర్ ఆళ్వాన్ మునిమనుమలు.

ఎంగళాల్వాన్  కాంచీపురమ్ దేవపెరుమాళ్కు క్షీర కైంకర్యము చేస్తూ ఉండేవారు.  క్షీరమును వేడి చేయడములో,  ఆ క్షీరమును దేవపెరుమళ్కు సమర్పించడములో, దేవపెరుమాళ్ పట్ల మాతృత్వ భావము చూపెడివారు.  అందువలన  దేవపెరుమాళ్ వీరిని “అమ్మాళ్” మరియు “వాత్స్య వరదాచార్యులు” అని  ప్రేమతో సత్కరించారు.

ఎంగళాల్వాన్  శ్రీభాష్యము అధ్యాపనమునకు పితామహులు అయిన నడాదూర్ ఆళ్వాన్ ను ఆశ్రయించగా, వారు వయోభారము చేత ఎంగళాల్వాన్నుఅశ్రయించమనిరి. అమ్మాళ్ ఎంగళాల్వాన్ తిరుమాళిగను చేరి, ద్వారమును తట్టగా, ఎంగళాల్వాన్ “వచ్చినది ఎవరు” అని అడుగగా, అమ్మాళ్ “నేను వరదన్” అని సమాధానము ఇచ్చారు. అప్పుడు ఎంగళాల్వాన్  అమ్మాళ్ను ” ‘నేను’ అనేది  నశించిన తరువాత రమ్మ” ని అన్నారు. అమ్మాళ్ పితామహులను చేరి జరిగిన వృత్తాంతము తెలియజేయగా, వారు “నేను” అని స్వపరిచయము చేసుకొనుట అహంకార పూరితము కావున, “అడియేన్” అని వినమ్రముగా అహంకార రహితముగ చేయవలెను అని ఆదేశించిరి. అమ్మాళ్ మరల ఎంగళాల్వాన్ తిరుమాళిగను చేరి, ద్వారమును తట్టగా, వారు “వచ్చినది ఎవరు” అని అడుగగా, అమ్మాళ్ “అడియేన్ వరదన్ దాసన్” అని సమాధానము ఇచ్చిరి. ఈ సమాధానముతో తృప్తి చెందిన ఎంగళాల్వాన్ , అమ్మాళ్ను స్వాగతించి, శిష్యునిగా స్వీకరించి, వారికి సాంప్రదాయరహస్యములను విశదీకరించిరి.  అమ్మాళ్ శ్రీవైష్ణవ సాంప్రదాయ విశిష్ఠులుగా ప్రసిద్ది చెందడముతో, వారి అచార్యులు అయిన  ఎంగళాల్వాన్  “అమ్మాళాచార్యులు” గా కొనియాడబడిరి.

అమ్మాళ్ శిష్యులలో అగ్రగణ్యులయిన శ్రుత ప్రకాశిక భట్టర్ (శ్రీ వేద వ్యాస భట్టర్ మునిమనమలు), అమ్మాళ్ వద్ద శ్రీ భాష్యము అధ్యయనము చేసి, శ్రీ భాష్యమునకు శ్రుత ప్రకాశిక అను వ్యాఖ్యానము మరియు వేదార్ధ సంగ్రహము, శరణాగతి గద్యములకు వ్యాఖ్యానములు చేసిరి.

ఒకపరి అమ్మాళ్ శ్రీ భాష్య ప్రవచనము చేయుచుండగా, ఒక శిష్యుడు భక్తి యోగమును ఆచరించుటలో క్లిష్ఠతను మనవి చేయగా, అమ్మాళ్ వారికి శరణాగతిని సూచించిరి. శిష్యులు శరణాగతి కూడ మిగుల కష్టసాధ్యమని మనవి చేయగా, అమ్మాళ్ వారితొ “ఉజ్జీవనమునకు రామానుజులవారి పాద కమలములనే శరణ్యముల”ని భావించవలెనని ఆదేశించిరి.

చరమోపాయ నిర్ణయములో మరి ఒక వృత్తాంతము తెలుపబడినది.

నడాదూర్ అమ్మాళ్ శిష్యులకు శ్రీ భాష్యము ప్రవచించుచుండిరి. వారిలో కొందరు
“జీవులకు భక్తియోగమును ఆచరించుట దుస్సాధ్యము (ఎందువలననగా, భక్తియోగము ఆచరించగోరు జీవులకు పురుషులు మరియు త్రై వర్ణికులు (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు) అయి ఉండుట అను మొదలగు లక్షణములు ఉండవలెను) మరియు జీవాత్మకు ప్రపత్తి చేయుట స్వరూప విరుధ్ధము (ఎందువలననగా, జీవుడు పరమాత్మకు దాసుడు, పరతంత్రుడు అయి ఉండటము వలన ఉజ్జీవనము కొరకు తానై ఏమి ఆచరించుటకు అధికారము లేకుండుట వలన), మరి జీవుడు ఉజ్జీవనము పొందుట ఎట్లూ?” అని ప్రశ్నించిరి. ఈ ప్రశ్నకు నడాదూర్ అమ్మాళ్ “అప్పుడు జీవునకు ఎంపెరుమానార్ అభిమానమునకు పాత్రము అయి ఉండుటయే చరమోపాయము. మరియొక ఉపాయము లేదు. ఇది నా ధృఢ నిశ్చయము” అని పలికిరి. అమ్మాళ్ చరమసందేశము ప్రసిద్ధమైన శ్లోకరూపములో:

ప్రయాణకాలే చతురస్స్వశిష్యాన్ పదాస్తికస్తాన్ వరదోహి వీక్ష్య
భక్తి ప్రపత్తి యది దుష్కరేవః రామానుజార్యమ్ నమత్యేవధీత్

ఆమ్మాళ్ చివరి దినములలో వారి శిష్యులు తమకు ఏది శరణ్యము అని ప్రశ్నించగా వారు “భక్తి మరియు ప్రపత్తి మీ స్వరూపమునకు తగినవి కాదు. అందు వలన మీరు ఎమ్పెరుమానర్లను ఆశ్రయించి, వారికే ఆధార్యము కలిగి ఉండినచో మీకు ఉజ్జీవనము కలుగును” అని సమాధానము ఇచ్చారు.

వార్తామాలై నందు అమ్మాళ్ గురించి కొన్ని ఐతిహ్యములు ప్రస్తావించబడినవి.

  • 118 – ఎంగళాల్వాన్ నడాదూర్ అమ్మాళ్కు చరమ శ్లోకమును వివరించుచుండగా,  “సర్వధర్మాన్ పరిత్యజ్య” వద్ద అమ్మాళ్ పరమాత్మ శాస్త్రములందు కల ఇతర సకల ఉపాయములను త్యజించుమని ఏ విధముగా  అంత స్వాతంత్ర్యముతో  ఆదేశించుచున్నారు అని ఆశ్చర్యమును వ్యక్తము చేశారు. అప్పుడు ఎంగళాల్వాన్ “నిరంకుశ స్వాతంత్ర్యము పరమాత్మకు స్వభావసిద్ధము కావున ఆ ఆదేశము శాస్త్రసమ్మతము. జీవులు పరమాత్మకు పరతంత్రులు కావటమువలన, వారు పరమాత్మ కంటె వేరగు ఉపాయములను ఆశ్రయించుట స్వరూప విరుద్ధము కావున, పరమాత్మను మాత్రమే రక్షకముగా భావించ వలెనను అదేశముతో జీవులను సంసారము నుండి ఉజ్జీవింప చేయుచున్నారు. అందువలన పరమాత్మ ఆదేశము ఆయన స్వభావోచితము” అని పలికిరి.
  • 198 – ఒకపరి నడాదూర్ అమ్మాళ్ ఆలిపిళ్ళాన్ అన  (బహుశా అబ్రాహ్మణ లేక ఆచార్య పురుషత్వము లేని)  శ్రీవైష్ణవునితో ప్రసాదమును స్వీకరించు చుండగా చూసిన పెరుంగూర్పిళ్ళై ఆనందముతో ”నేను తమని  ఈ శ్రీ వైష్ణవునితో కలసిమెలసి ఉండుట చూచియుండని యెడల వర్ణా శ్రమ ధర్మములు ఎల్లప్పుడూ పాటించ వలెనననే సామాన్య ధర్మము  యొక్క ముఖ్యభావము నాకు గోచరించెడిది కాదు” అని పలికిరి. అప్పుడు అమ్మాళ్  “యధార్ధముగా పూర్ణుడైన ఆచార్య సంబంధము కలిగిన అందరు వ్యక్తులు, సమస్త వస్తువులు మనకు సేవ్యములు/స్వీకార్యములు. అటులనే నేను ఈ గొప్ప శ్రీ వైష్ణవునితో ప్రసాద స్వీకారమను అనుష్ఠానము మన పూర్వాచార్యులు ఆదేశించిన విశేషమైన భాగవత ధర్మములో భాగముగానే భావించ వలయున” ని సెలవిచ్చిరి.

మణవాళ మాముణులు తమ పిళ్ళై లోకాచార్యుల తత్త్వ త్రయ వ్యాఖ్యానము సూత్రము 35 లో (http://ponnadi.blogspot.in/p/thathva-thrayam.html), జీవ స్వాతంత్ర్యమును (జీవాత్మకు పరమాత్మచే ప్రసాదించబడినది) అనగా, కర్మా చరణములో జీవుని ప్రథమ ప్రయత్నము, పిమ్మట ఆ కర్మాచరణలో పరమాత్మ యొక్క సహాయ సహకారములను స్పష్ఠ పరచుటకై, నడాదూర్ అమ్మాళ్ యొక్క తత్త్వ సారము నుంచి ఒక అద్భుతమైన శ్లోకమును ఉదహరించిరి.

పరమోత్కృష్ఠ జ్ఞానమును కలిగినవారు, ఎంగళాల్వాన్లకు మిక్కిలి ప్రియతములు అయిన నడాదూర్ అమ్మాళ్ యొక్క జీవితము నుండి కొన్ని ముఖ్యమైన ఘట్టములను దర్శించాము. వారి పాదకమలములను ఆశ్రయించి, వారి భాగవత నిష్ఠలో కొంత అయినా పొందెదము. 

నడాదూర్ అమ్మాళ్ తనియన్:

వందేహమ్ వరదార్యమ్ తమ్ వత్సాభిజనభూషణమ్
భాష్యామృత ప్రధానాఢ్య సంజీవయతి మామపి

అడియేన్ అనంతరామ రామానుజ దాసుడు

మూలము : http://acharyas.koyil.org/index.php/2013/04/05/nadathur-ammal-english/

పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/2012/08/17/introduction-contd-english/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org