విళాఞ్జోలై పిళ్ళై

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

viLAnchOlai piLLai

తిరునక్షత్రం: ఆశ్వీజ (తులామాసం) ఉత్తరాషాడ నక్షత్రం .

అవతారస్థలం : తిరువనంతపురం దగ్గర ‘ఆఱనూర్’ అనే గ్రామం. ఇది కరైమనై అనే నదీ తీరాన ఉన్నది.

ఆచార్యులుపిళ్ళై లోకాచార్యులు

కాలక్షేప ఆచార్యులు: విళాఞ్జోళై పిళ్ళై ఈడును మరియు శ్రీ భాష్యమును, తత్త్వ త్రయమును  మిగిలిన రయస్య గ్రంథములను శ్రీ పిళ్ళై లోకాచార్యుల తమ్ముడగు శ్రీ అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనారాచార్యుల వద్ద అధ్యయనం చేశారు.

గ్రంథరచనలు: శ్రీ వచన భూషణమునకు సారమగు ‘సప్త గాథై’

పరమపదించిన స్థలం: తిరువనంతపురం

పిళ్ళై లోకాచార్యుల శిష్యుల్లో  విళాఞ్జోళై పిళ్ళై ఒకరు. వీరి దాస్య నామం నలం తిఘళ్ నారాయణ దాసులు.

వీరు ఈజవ (తాటి చెట్ల నుండి మద్యం సేకరించేవారు) కులములో పుట్టారు. కావున ఆలయములోకి రావడం నిషిద్ధముగా ఉండేది. కావున తమ గ్రామం నుండి ‘విలాం’ అనే వృక్షాలను ఎక్కి తిరువనంతపుర పద్మనాభస్వామి దేవాలయ గోపురం దర్శించి స్వామికి మంగళాశాసనం  చేసేవారు.

శ్రీ లోకార్య పదారవింద మఖిల శ్రుత్యర్థ కోశమసతాం
గోష్ఠీం చ తదేక లీన మనసా సంచితయంతమ్ సదా|

శ్రీ నారాయణ దాసమార్యమమలం సేవే సతాం సేవధిం
శ్రీ వాగ్భూషణ గూడభావ వివృతిం యస్య  సప్తగాథాం వ్యాధత||

విళాఞ్జోళై పిళ్ళై ఈడు, శ్రీభాష్యమును, తత్త్వత్రయమును మరియు మిగిలిన రహస్య గ్రంథములను శ్రీ పిళ్ళై లోకాచార్యుల తమ్ముడగు శ్రీ అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనారాచార్యుల వద్ద అధ్యయనం చేశారు.

శ్రీ వచన భూషణమును తమ ఆచార్యులగు శ్రీ పిళ్ళై లోకాచార్యుల వద్ద అధ్యయనం చేశారు. వీరు దాని అర్థములు తెలిసిన ఒక నిపుణుడిగా (అధికారి) భావించేవారు.

వీరు తమ ఆచార్యులకు ఒక గొప్ప కైంకర్యమును చేశారు. అది తమ ఆచార్యులు చరమదశలో ఉన్నపుడు వారు చెప్పిన నిబంధనలను పాటించారు- శ్రీ పిళ్ళై లోకాచార్యులు తమ శిష్యులగు తిరువాయ్మొళి పిళ్ళై (తిరుమలై ఆళ్వార్) ను సాంప్రదాయ సిద్ధంగా తయారు చేసి తమ ఉత్తరాధికారిగా చేయాలని మరియు శ్రీ వచన భూషణ విశేషాలను తిరువాయ్మొళి పిళ్ళైకు అందించమని విళాఞ్జోళై పిళ్ళై కు ఆదేశించారు.

విళాఞ్జోళై పిళ్ళై మరియు తిరువాయ్మొళి పిళ్ళై:

తిరువాయ్మొళి పిళ్ళైను తిరువనంతపుర దేవాలయ అర్చకులగు నంబూద్రిలు అనంత పద్మనాభ స్వామికి మూడు ద్వారముల నుండి మంగళాశాసనములు అనుగ్రహించమని ఆహ్వానించారు. అప్పుడు తిరువాయ్మొళి పిళ్ళైను విళాఞ్జోళై పిళ్ళై చూశారు.

వారు రాగానే  ఒక ఆశ్చర్యమును చూశారు. విళాఞ్జోళై పిళ్ళై తమ ఆచార్యులగు పిళ్ళై లోకాచార్యుల తిరుమేని మీద యోగధ్యానములో ఉన్నారు. ఆ రోజుల్లోవారి గొప్ప శిష్యులందరు శ్రీరంగములో ఉన్నప్పుడు ఇలాంటివి జరిగేవి. విళాఞ్జోళై పిళ్ళై తిరుమేని (దివ్య శరీరం) సాలె గూడులతో కప్పబడింది.

తిరువాయ్మొళి పిళ్ళై వారి పాదాలపై పడి వారి ముందు మౌనంగా ఉండి పోయారు. విళాఞ్జోళై పిళ్ళై వెంటనే నేత్రాలను తెరచి తమ కృపను వారిపై అనుగ్రహించారు. విళాఞ్జోళై పిళ్ళై వీరికోసం చాలా కాలంగా ఎదురుచూడడం వల్ల వీరిని చూడగానే చాలా ఆనందించారు.

విళాఞ్జోళై పిళ్ళై శ్రీ వచన భూషణం యొక్క రహస్యార్థాలను తిరువాయ్మొళిపిళ్ళైకి అనుగ్రహించారు. ఇంకా అదనంగా శ్రీ వచన భూషణ సారమైన సప్తగాథై అను 7 పాశురముల గ్రంథమును కూడ తిరువాయ్మొళి పిళ్ళైకి ఉపదేశించారు.

ఇది తొండరడిపొడి ఆళ్వార్ అనుగ్రహించిన ‘కొడుమిన్ కొణ్మిన్’ కు ఒక ప్రముఖ ఉదాహరణ- ఈజవ  కులమునకు చెందిన విళాఞ్జోళై పిళ్ళై  అనుగ్రహంచారు, బ్రాహ్మణ కులానికి చెందిన తిరువాయ్మొళి పిళ్ళై స్వీకరించారు. ఇదే శ్రీవైష్ణవ సిద్ధాంతపు సారతమము.

కొంతకాలం తర్వాత  తిరువాయ్మొళి పిళ్ళై,  విళాఞ్జోళై పిళ్ళై దగ్గర సెలవు తీసుకొని శ్రీ రామానుజ దర్శనమునకు (సిద్ధాంతమునకు) దర్శనస్థాపక ఆచార్యులుగా ప్రకాశించిరి.

విళాఞ్జోళై పిళ్ళై చరమ దశ

ఒక రోజు నంబూద్రీలు అనంత పద్మనాభ స్వామికి తిరువారాధనం చేస్తున్నారు, ఆ సమయాన విళాఞ్జోళై పిళ్ళై  తూర్పు ద్వారం గుండా దేవాలయంలోకి ప్రవేశించారు. ధ్వజ స్తంభమును దాటి, శ్రీ నరసింహున్ని దర్శించి, ఉత్తర ద్వారం ద్వారా గర్భ గృహం దగ్గరకు ప్రవేశించారు, ‘ఓర్రై కాల్ మండప’ మెట్లు ఎక్కారు, పెరుమాళ్ దర్శనమిచ్చు మూడు ద్వారముల స్థలములోకి వచ్చారు, దానిలో ఎంపెరుమాన్ దివ్య పాదారవిందములు దర్శన మిచ్చు గవాక్షం దగ్గర నిల్చున్నారు.

దీనిని గమనించిన నంబూద్రీలు, విళాఞ్జోళై పిళ్ళై కులము కారణంగా, దేవాలయ ఆచార వ్యవహారాలనుసరించి వారిని గర్భ గృహములోనికి రానీయకూడదని సన్నిధి తలుపులను మూసి బయటకు వెళ్ళిపోయారు.

అదే సమయంలో విళాఞ్జోళై పిళ్ళై శిష్యులు కొందరు దేవాలయమును సమీపించి ఇలా తెలిపారు – తమ ఆచార్యులగు విళాఞ్జోళై పిళ్ళై వారి ఆచార్యులగు పిళ్ళై లోకాచార్యుల తిరువడిని చేరారు, కావున వారి చరమ తిరుమేనికి అలంకరించుటకు పెరుమాళ్ ‘తిరు పరివట్టం (తలకు చుట్టు పెరుమాళ్ వస్త్రం), శేషమాల’ ఇవ్వమని అభ్యర్థించారు. వారు దేవాలయ ముఖ ద్వారం వద్ద నిల్చుని రామానుజ నూఱ్ఱందాది ఇయళ్ను అనుసంధించ సాగారు.

విళాఞ్జోళై పిళ్ళై  అనంత పద్మనాభ స్వామి తిరువడిని చేరారు.

తిరువాయ్మొళి పిళ్ళై ఈ వార్తను విని ఆచార్యునికి ఒక శిష్యుడు చేయవలసిన చరమ కైంకర్యమును మరియు తిరువధ్యయనమును సాంప్రదాయాన్ని అనుసరించి చేశారు. ఈ ఘటన మాఱనేరి నంబి గారికి పెరియ నంబి గారు చేసిన బ్రహ్మమేధా సంస్కారమును గుర్తు చేస్తుంది.

తిరువాయ్మొళి పిళ్ళై అంతటివారే విళాఞ్జోళై పిళ్ళై యందు ఆచార్యభావనను ఉంచేవారు. దీనిని దృష్ఠిలో ఉంచుకొని వారి శిష్యులు ఇలా చెప్పారు.

పట్ఱాద ఎంగళ్ మణవాళ యోగి పదమ్ పణిన్దోన్
నర్ఱేవరాస – నలంతిఘళ్ నారణ తాదరుడన్
కఱారెన్  కూరక్కులోత్తమ తాదన్ కళల్ పణివోన్
మఱారుమ్ ఒవ్వా తిరువాయ్మొళి పిళ్ళై వాళియే

 తిరువాయ్మొళి పిళ్ళై గారు అనుగ్రహించిన  విళాఞ్జోళై పిళ్ళై  వాళి తనియన్:

వాళి నలన్తికళ్ నారణతాతనరుళ్
వాళి యవనముద వాయ్ మొళికళ్, -వాళియే
ఏఱు తిరువుడైయాన్ ఎన్దై యులకారియన్ శొల్,
తేఱు తిరువుడైయాన్ శీర్

వీరి తనియన్:

తులాహిర్బుధ్న్య సంభూతం శ్రీలోకార్య పదాశ్రితం |
సప్తగాథా ప్రవక్తారం నారాయణ మహం భజే ||

తులా మాసమున ఉత్తరాషాడ నక్షత్రమున అవతరించి,శ్రీ పిళ్ళై లోకాచార్యుల శ్రీ పాద పద్మములను ఆశ్రయించి, ‘సప్తగాథై’ (శ్రీ వచన భూషణ సారము) ప్రవర్తకులైన శ్రీ నారాయణ గురువులను / విళాఞ్జోళై పిళ్ళైను భజిస్తున్నాను.

ఆధారములు:

1. “మన్ను పుగళ్ మణవాళ మామునివన్ ” రంగ రాజన్ 2011.

2. “నిత్యానుసంధానం”- శ్రీవైష్ణవ శ్రీ; శ్రీసుదర్శన ట్రస్ట్.

3.. పిళ్ళై లోకం జీయర్  యతీంద్ర ప్రవణ ప్రభావం – శ్రీ ఉ.వే డా|| వి.వి.రామానుజన్ ద్వారా ముద్రితం 1992, 2000, 2006

4. మూలం సప్త గాథై – http://acharya.org/sloka/vspillai/index.html అక్టోబర్ 27, 2012.

5. శ్రీ రామానుజ E – జర్నల్ ‘http://www.docstoc.com/docs/2437367/Sri-Ramanuja-E-Journal – అక్టోబర్ 27, 2012.

6. చిత్ర రూపకల్పన శ్రీ సారథి తోతాద్రి స్వామి.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజ దాస

సూచన:  సప్త గాథైకు  శ్రీ పిళ్ళైలోకం జీయర్ అనుగ్రహించిన ద్రావిడ వ్యాఖ్యానమునకు  డా||ఉ.వే ఈ. ఏ. శింగరాచార్య స్వామి వారు తెలుగు అనువాదంతో అనుగ్రహించిన కోశము ఉన్నది. కావలసిన వారు  శ్రీ రామానుజ సిద్ధాంత సభ, సికింద్రాబాద్, నల్లా శశిధర్ రామానుజ దాసున్ని సంప్రదించగలరు.  9885343309

మూలము: https://acharyas.koyil.org/index.php/2015/05/29/vilancholai-pillai/ (originally from http://acharyar.wordpress.com/2012/10/26/vilancholai-pillai-vaibhavam/)

పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/2012/08/17/introduction-contd-english/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

1 thought on “విళాఞ్జోలై పిళ్ళై”

Comments are closed.