శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
తిరునక్షత్రము: తులా(ఆశ్వీజ) మాసము, ఆరుద్రా నక్షత్రము
అవతార స్థలము: శ్రీరంగం
ఆచార్యులు: వడక్కు తిరివీధిపిళ్ళై( కాలక్షేప ఆచార్యులు పిళ్ళైలోకాచార్యులుమరియు అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్)
పరమపదము చేరిన ప్రదేశము: శ్రీరంగం
కూరకులోత్తమ దాసులు శ్రీరంగమున అవతరించిరి వారి నిత్యనివాసం కూడా శ్రీరంగమే. వీరు కూరకులోత్తమ నాయన్ గా కూడ వ్యవహరింప బడేవారు.
కూరకులోత్తమ దాసులు, తిరుమలై ఆళ్వార్ (తిరువాయ్మొళి పిళ్ళై ) ని సాంప్రదాయములోనికి తిరిగి తీసుకరావడానికి కారణమైనవారు. వీరు పిళ్ళై లోకాచార్యులకు అత్యంత సన్నిహితంగా ఉండే సహచరులు. వీరు పిళ్ళై లోకాచార్యులతో కలిసి శ్రీరంగమున నంపెరుమాళ్ళకు జరగు ఉలా (నంపెరుమాళ్ కలాబకాలమున జరుగు యాత్ర) ఉత్సవానికి వెళ్ళేవారు. జ్యోతిష్కుడి యందు పిళ్ళైలోకాచార్యులు తమ అవసాన కాలమున తాము అందించిన సాంప్రదాయ విశేషఙ్ఞానమును తిరువాయ్మొళి పిళ్ళై / తిరుమలై ఆళ్వార్ (అతిపిన్న వయస్కులుగా ఉన్నప్పుడు పిళ్ళై లోకాచార్యుల వద్ద పంచసంస్కారములు పొందిన) కి అందించి వారిని సాంప్రదాయ అధికారిగా చేయమని కూరకులోత్తమ దాసులను, తిరుకణ్ణంగుడి పిళ్ళైను , తిరుపుట్కులి జీయర్ను, నాలూర్ పిళ్ళై మరియు విలాంశోలై పిళ్ళైను నిర్ధేశించారు.
మొదట కూరకులోత్తమ దాసులు మధురైకు మంత్రి అయిన తిరుమలై ఆళ్వార్లను కలవాడానికి వెళ్ళారు. ఎందుకనగా తిరుమలై ఆళ్వార్ పరిపాలన యంత్రాంగములో మరియు తమిళ సాహిత్యమున బహు నైపుణ్యం కలవారు. మధురై రాజు పిన్న వయసులోనే మరణించడం వల్ల ఆ రాజు బాధ్యతలను మరియు యువరాజు పోషణా బాధ్యతలు వహించెడి వారు.
కూరకులోత్తమ దాసులు మధురై నగరమునకు ప్రవేశించి నమ్మాళ్వార్ అనుగ్రహించిన తిరువిరుత్త ప్రబంధమును అనుసంధించసాగిరి. ఆ సమయాన తిరుమళై ఆళ్వార్ నగరమున పల్లకిలో విహారానికి వెళుతూ వీరిని గమనించారు.
తిరుమలై ఆళ్వార్ పల్లకి దిగకుండానే కూరకులోత్తమ దాసులను దీనికి అర్థమును చెప్పమనిరి దానికి దాసులు వీరిపై ఉమ్మివేసిరి. దీనిని గమనించిన తిరుమలై ఆళ్వార్ భటులు ఆగ్రహించి కూరకులోత్తమ దాసులను శిక్షించడానికి ముందుకు వచ్చిరి. తిరుమలై ఆళ్వార్ కూరకులోత్తమ దాసుల గొప్పదనమును తెలిసిన వారు కనుక భటులను నిరోధించిరి.
తిరుమలై ఆళ్వార్ తిరిగి తమ భవనానికి వెళ్ళి తమకు మార్గదర్శనం చేయు మారుటి (సవతి) తల్లికి ఈ సంఘటనను చెప్పగా ఆవిడ కూరకులోత్తమ దాసులకు, పిళ్ళై లోకాచార్యులకు ఉన్న సంబంధమును ఎరిగి కూరకులోత్తమ దాసులను కీర్తించిరి. వారి గొప్పదనము గ్రహించిన తిరుమలై ఆళ్వార్ తాము కూరకులోత్తమ దాసులను వెతక సాగిరి.
తిరుమలై ఆళ్వార్ తాము ఏనుగు అంబారిపై అధిరోహించి వెళ్ళిరి, కూరకులోత్తమ దాసులు తాము కనబడాలని ఒక ఎత్తైన ప్రదేశమునకు ఎక్కిరి. దీనిని గమనించిన తిరుమలై ఆళ్వార్ వెంటనే తమ అంబారిని దిగి కూరకులోత్తమదాసుల తిరువడిపై పడి వారిని స్తుతించిరి.
కూరకులోత్తమదాసులను ,తిరుమలై ఆళ్వార్ తమ రాజభవనమునకు తీసుకెళ్ళి పిళ్ళై లోకాచార్యుల చే అనుగ్రహించబడిన అమూల్యమైన నిర్ధేశ్యములను శ్రవణం చేశారు. ఆ నిర్థేశ్యములను అనుసరించ దలచి తిరుమలై ఆళ్వార్, కూరకులోత్తమ దాసులను ప్రతి రోజు ప్రాతః కాలమున తమ అనుష్ఠాన సమయమున వచ్చి సాంప్రదాయ రహస్యములను అనుగ్రహించాలని ప్రార్థించారు. మరియు కూరకులోత్తమ దాసులకు వేగై నదీ తీరాన ఒక నివాసగృహమును ఏర్పాటు చేసి వారి జీవనమునకు అవసరమగు వస్తుసామాగ్రిని సమకూర్చారు.
కూరకులోత్తమ దాసులు ప్రతిరోజు తిరుమలై ఆళ్వార్ దగ్గరకు వెళ్ళసాగిరి. తిరుమలై ఆళ్వార్ ప్రతిరోజు తాము తిరుమణ్ కాప్పు (స్వరూపం) చేసుకొనేసమయాన (మనం తిరుమణ్ కాప్పు చేసుకొనే సమయాన గురుపరంపరను అనుసంధిస్తాము కదా) పిళ్ళై లోకాచార్యుల తనియన్ను అనుసంధించుటను కూరకులోత్తమ దాసులు గమనించి చాలా ఆనందించిరి. కూరకులోత్తమ దాసులు వారికి సాంప్రదాయ విషయాలను బోధించసాగిరి. ఒక రోజున కూరకులోత్తమ దాసులు రానందున తిరుమలై ఆళ్వార్ తమ సేవకున్ని పంపారు అయినా ఏ స్పందన లేదు.
ఆచార్య సంబంధమువల్ల తామే స్వయంగా వెళ్ళిరి. కూరకులోత్తమ దాసులు వారిని కొంత సమయం వేచి ఉండేలా చేసిరి. చివరకు తిరుమలై ఆళ్వార్ తాము కూరకులోత్తమ దాసుల శ్రీ పాదములపై పడి తమ తప్పిదమును మన్నించమని వేడుకొనగా వారు మన్నించిరి.
ఆనాటి నుండి తిరుమలై ఆళ్వార్ తామే స్వయంగా కాలక్షేప సమయానికి ఉపస్థితులై ప్రతిరోజు కూరకులోత్తమ దాసుల శ్రీ పాద తీర్థమును మరియు శేష ప్రసాదాన్ని స్వీకరించసాగిరి. భాగవత్తోత్తముల శ్రీ పాద తీర్థము మరియు శేషప్రసాదం తీసుకొన్నవాళ్ళు పవిత్రులవతారు. అలాగే తిరుమలై ఆళ్వార్లో గొప్ప మార్పు వచ్చినది. వీటి ప్రభావం వల్ల తిరుమలై ఆళ్వార్ “కూరకులోత్తమ దాస నాయన్ తిరువడిగళే శరణం” అని అనుసంధిస్తు తమ రాజ్య విషయముల యందు మరియు ప్రాపంచిక విషయాల యందు నిరాసక్తతను ప్రదర్శించ సాగిరి.
కూరకులోత్తమ దాసులు తిరిగి శిక్కిళ్ గ్రామానికి (తిరుపుళ్ళాని కి సమీపమున ఉన్నది) వెళ్ళిపోయిరి. తిరుమలై ఆళ్వార్ తమ రాజ్యభారాన్ని అప్పచెప్పి తాను రాజ్యాన్ని వదలి కూరకులోత్తమ దాసులతో సహవాసం చేస్తు వారికి సమస్త సేవలు చేయనారంభించిరి.
కూరకులోత్తమ దాసులు తమ అవసానమున తిరుమలై ఆళ్వార్కు తరువాతి సాంప్రదాయ విషయాలను విలాంశోలై పిళ్ళై మరియు తిరుకణ్ణంగుడి పిళ్ళై వద్ద సేవించమని నిర్థేశించిరి. ఒకనాడు కూరకులోత్తమ దాసులు పిళ్ళై లోకాచార్యుల తిరువడిని స్మరిస్తూ తమ చరమ శరీరాన్ని వదిలి పరమపదం వేం చేశారు.
మామునులు, కూరకులోత్తమ దాసులను “కూరకులోత్తమ దాసం ఉదారం” (వీరు చాలా ఉదార స్వభావులు మరియు కృపాలురు) అని కీర్తించారు. కారణం వీరి నిరంతర కృషి మరియు నిర్హేతుక కృపవల్ల తాము పిళ్ళై లోకాచార్యుల వద్ద సేవించిన సాంప్రదాయ విషయాలన్నింటిని తిరుమలై ఆళ్వార్ కు బోధించి వారు మళ్ళీ సాంప్రదాయములోనికి వచ్చేలా శ్రమించిరి. వీరు మన సాంప్రదాయమున రహస్య గ్రంథ కాలక్షేప పరంపరలో ఒక ప్రముఖ స్థాన్నాన్ని ఆక్రమించారు. మరియు చాలా రహస్య గ్రంథములలో పెక్కు తనియన్ల తో కీర్తంచబడ్డారు.
శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రము ప్రతి శిష్యునికి ” ఆచార్య అభిమానమే ఉత్తారకం” అని నిర్థేశించినది. దీనికి వ్యాఖ్యానమును చేస్తు మామునులు ఇలా అనుగ్రహించారు “ప్రపన్నునకు అన్నీ ఉపాయములకన్నా ఆచార్యుని నిర్హేతుక కృప మరియు వారు ‘ఇతను నా శిష్యుడు’ అని తలంచిన అదే శిష్యునకు ముక్తి (మోక్షం) ని ప్రసాదించును’.
ఈ విషయాన్ని మనం పిళ్ళై లోకాచార్యుల, కూరకులోత్తమ దాసుల మరియు తిరువాయ్మొళి పిళ్ళై చరితమున స్పష్ఠంగా దర్శించవచ్చును. కూరకులోత్తమ దాసుల మరియు తిరువాయ్మొళి పిళ్ళై యందు పిళ్ళై లోకాచార్యుల అభిమానం మరియు ఉత్తమ ఆచార్యులగు తిరువాయ్మొళి పిళ్ళై యొక్క అలుపెరుగని శ్రమవల్ల క్రమంగా ఆ అభిమానం అళిగియ మణవాళ మామునుల ద్వారా మనకు సంక్రమించినది.
ప్రతి నిత్యం పిళ్ళైలోకాచార్యుల ను ధ్యానించు కూరకులోత్తమ దాసులను ధ్యానము చేద్దాం.
కూరకులోత్తమ దాసుల తనియన్ :
లోకాచార్య కృపాపాత్రం కౌణ్డిన్య కుల భూషణం |
సమస్తాత్మ గుణావాసం వందే కూర కులోత్తమం ||
పిళ్ళైలోకాచార్యుల కృపకు పాత్రులై కౌణ్డిన్య కుల భూషణుడై అనేక కల్యాణ గుణములకు ఆవాస్యయొగ్యుడైన కూరకులోత్తమ దాసులకు వందనం చేయుచున్నాను.
అడియేన్ నల్లా శశిధర్ రామానుజ దాస
మూలము: http://acharyas.koyil.org/index.php/2012/11/02/kura-kulothama-dhasar-english/
పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/2012/08/17/introduction-contd-english/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org
Very excellent.