శ్రీ శృత ప్రకాశిక భట్టర్

శ్రీ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమత్ వరవరమునయే నమ:
శ్రీ వానాచల మహామునయే నమ:

అవతార స్థలము: శ్రీరంగము

ఆచార్యులు: వేద వ్యాస భట్టర్, నడాదూర్ అమ్మాళ్

శ్రీ సూక్తులు: శృత ప్రకాశిక, శృత ప్రదీపక, వేదార్ధ సంగ్రహము వ్యాఖ్యానము (తాత్పర్య దీపిక), శరణాగతి గద్యము మరియు సుబాలోపనిషత్తులకు వ్యాఖ్యానము, శుకపక్షీయము.

శ్రీ పరాశర భట్టర్ పుత్రులు శ్రీ వేద వ్యాస భట్టర్ పౌత్రులుగా అవతరించిన శ్రీ శృత ప్రకాశిక భట్టర్ శ్రీ వైష్ణవ సాంప్రదాయములో సుప్రసిద్ధ ఆచార్యపురుషులు. శ్రీ భాష్యమునకు శృత ప్రకాశిక మరియు శృత ప్రదీపకలను మిక్కిలి ప్రశస్తములు, గహనములు అగు వ్యాఖ్యానములు చేశారు. ఈ వ్యాఖ్యానముల నామకరణము ద్వారా తాము ఎంపెరుమానార్ నుంచి నడాదూర్ అమ్మాళ్ వరకు ముఖతః శ్రోత్ర పరంపరగా వచ్చిన సూత్రములనే గ్రంథీకరించామని తెలియజేశారు.

శృత ప్రకాశిక భట్టర్ శ్రీ భాష్యమును నడాదూర్ అమ్మాళ్  వద్ద అధ్యయనము చేశారు. భట్టర్ ప్రజ్ఞను, సునిశిత బుద్దిని గమనించిన అమ్మాళ్, భట్టర్ వచ్చిన తరువాతనే కాల క్షేపము ప్రారంభము చేసేవారు. విషయమును గ్రహించిన కొందరు శిష్యులు అమ్మాళ్, భట్టర్ వారి వంశ ప్రాశశ్త్యము వలననే వారిని ఎక్కువగా ఆదరించుచున్నారని ఆరోపించారు. అమ్మాళ్ వారందరకు భట్టర్ వారి ప్రజ్ఞాపాటవములు తెలియజేయుటకు, ఒకసారి అధ్యాపనమును అకస్మాత్తుగా ఆపి, క్రితం రోజు తాము అదే విషయము గురించి చేసిన వివరణమును ప్రశ్నించిరి. అప్పుడు భట్టర్ అందరును ఆశ్చర్యచకితులు అగునట్లు, వినినది వినినట్టు సమాధానము ఇచ్చారు. అప్పుడు అమ్మాళ్ శిష్యులకు భట్టర్ ప్రజ్ఞా పాటవము అవగతము అయినది.

నంపిళ్ళై మరియు పెరియ వాచ్ఛాన్ పిళ్ళై మొదలగు వారు దివ్య ప్రబంధమునకు వ్యాఖ్యానములు రచించి, ఆళ్వార్ల భావపరంపరలను శాశ్వతముగా విస్తరింప చేసినట్లు, శృత ప్రకాశిక భట్టర్ శ్రీ భాష్యము, వేదార్ధ సంగ్రహము మొడలగు వ్యాఖ్యానములు రచించి సంస్కృత వేదాంతమును విస్తరింప చేసిరి.

గొప్ప జ్ఞాని మరియు నడాదూర్ అమ్మాళ్  ప్రియ శిష్యులు అయిన శ్రీ శృత ప్రకాశిక భట్టర్ యొక్క జీవితము నుండి కొన్ని ముఖ్యమైన ఘట్టములను దర్శించాము. వారి పాదకమలములను ఆశ్రయించి, వారి భాగవత నిష్ఠలో కొంత అయినా పొందెదము. 

శృత ప్రకాశిక భట్టర్ తనియన్

యతీంద్ర కృత భాష్యార్ధా యద్ వ్యాక్యానేన దర్శితాః
వరమ్ సుదర్శనార్యమ్ తమ్ వన్దే కూర కులాధిపమ్

అడియేన్ అనంతరామ రామానుజదాసుడు

 మూలము: http://acharyas.koyil.org/index.php/2013/04/16/srutha-prakasika-bhattar-english/

పొందు పరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/2012/08/17/introduction-contd-english/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

2 thoughts on “శ్రీ శృత ప్రకాశిక భట్టర్”

Comments are closed.