కూర నారాయణ జీయర్

తిరునక్షత్రం – మార్గశీర్ష (మార్గళి) – ధనిష్ఠా నక్షత్రం

అవతార స్థలం – శ్రీరంగం

ఆచార్యులు – కూరత్తాళ్వాన్, పరాశర భట్టర్

పరమపదం అలకరించిన స్థలం – శ్రీరంగం

గ్రంధరచనలు – సుదర్శన శతకం, స్తోత్రరత్న వ్యాఖ్యానం, శ్రీసూక్త భాష్యం, ఉపనిషద్ భాష్యం, నిత్య గ్రంథం (తిరువారాధన క్రమం) మొదలైనవి

శిష్యులు – శేమమ్ జీయర్, తిరుక్కురుగై పిళ్ళాన్ జీయర్, సుందర పాడ్య దేవుడు మొదలైన వారు.

ఎంబార్  సోదరులగు శిరియ గోవింద పెరుమాళ్ళకు మార్గళి మాస ధనిష్ఠా నక్షత్రమున శ్రీ రంగమున అవతరించిరి. సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత వీరు కూర నారాయణ జీయర్గా, నలం తిగళి నారాయణ జీయర్ గా, నారాయణముని గా, పెరియ జీయర్ గా మరియు శ్రీ రంగ నారాయణ జీయర్ గా వ్యవహరింప బడేవారు.

emperumanar-azhwan-bhattar ఎంపెరుమానార్ , కూరతాళ్వాన్ మరియు పరాశర భట్టర్

వీరు సన్యాసాశ్రమం స్వీకరించక మునుపు వీరికి “ఎడుత్త కై అళిగియ నాయనార్” అనే కుమారులు ఉండేవారు. వీరు మొదట కూరతాళ్వాన్ శిష్యులుగా ఉండి పిమ్మట ఆళ్వాన్ తిరుక్కుమారులగు పరాశర భట్టర్ శిష్యులై వీరి వద్ద సాంప్రదాయమును అధిగమించిరి.

వీరు బాహ్యంగా శ్రీ రంగమున పార్థ సారథి సన్నిధి మరియు గరుడాళ్వార్ సన్నిధి మొదలైనవి నిర్మింపచేశారు. ఇంకా పెరియ పెరుమాళ్ళ కు ఆంతరంగిక కైంకర్యములు ఎన్నో చేశారు.

కూరనారాయణ జీయర్ తరువాతి కాలంలో వేంచేసి ఉన్న  వేదాంతాచార్యులు వీరిని తమ గ్రంథములలో పెరియ జీయర్గా పేర్కొన్నారు. (కూరనారాయణ జీయర్ అను పేరు గల ఇంకొకరు  వేదాంతాచార్యుల తర్వాతి కాలంలో కూడ ఉన్నారని తెలుస్తుంది)  వేదాంతాచార్యులు తమ సొంత  స్తోత్ర వ్యాఖ్యానములో కూర నారాయణ జీయర్  స్తోత్ర వ్యాఖ్యానమును ఉట్టంకించారు.

ఇంకను కూరనారాయణ జీయర్ కృత శ్రీసూక్త భాష్యం మరియు నిత్య గ్రంథములను వేదాంతాచార్యులు తమ రహస్యత్రయ సారంలో పేర్కొన్నారు. కూరత్తాళ్వాన్ శిష్యులైన కూరనారాయణజీయర్ ఆ కాలంలో వేంచేసి ఉన్న  నఙ్ఞీయర్ కన్నా వయస్సులో పెద్దవారు కనుక  వీరి మధ్య వ్యత్యాసమును తెలియపరచుటకు వేదాంతాచార్యులు,  కూరనారాయణ జీయర్ను పెరియ (పెద్ద) జీయర్గా వ్యవహరించారు.

మాముణులు తమ ఈడు ప్రమాణతిరట్టులో (నంపిళ్ళై యొక్క ఈడు మహావ్యాఖ్యానములో నుండి సేకరించిన ప్రమాణాలు) కూరనారాయణ జీయర్ కృత ఉపనిషద్ భాష్యంను ఉట్టంకించారు. అలాగే  మాముణులు  , కూరనారాయణ జీయర్ను “శుద్ధ సంప్రదాయ నిష్ఠులు” (సాంప్రదాయము విషయములందు దృఢమైన ఆచరణ కలవారు) అని పేర్కొన్నారు.

కూరనారాయణ జీయర్ సుదర్శన ఉపాసకులుగా తెలుపబడ్డారు. ఒకసారి కూరత్తాళ్వాన్ , కూరనారాయణ జీయర్తో ఇలా అన్నారు “మనం శ్రీవైష్ణవ కుంటుంబములో జన్మించిన వారము, ఈ సాంప్రదాయమున ఉపాసనలు చేయుట తగదని పరిగణింపబడుతుంది. మనం  సంపూర్ణంగా భగవంతునిపై ఆధారపడిన వారము, స్వ ప్రయోజనాలను చేకూర్చు ఈ ఉపాసనలను చేయుట అనుచితము కదా”. దీనికి కూరనారాయణ జీయర్ “ఈ ఉపాసన నా ప్రయోజనమునకు కాదు, భగవానునికి మరియు భాగవతుల సేవార్థం మాత్రమే” అని విన్నవించారు. ఈ మాటకు సంబంధించిన రెండు సంఘటనలు ఈ  ఇక్కడ మనం తెలుసుకుందాము.

  • పూర్వము నంపెరుమాళ్ కు కావేరీ నదిలో తెప్పోత్సవము జరుగుతుండేది. ఒక సారి ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆకస్మికంగా వరద రావడం చేత తెప్పం (పడవ) వరదలోకి నెట్టబడింది. ఆ సమయాన కూరనారాయణ జీయర్ తమ ఉపాసన శక్తి వలన తెప్పమును జాగ్రత్తగా ఒడ్డునకు చేర్చారు.  ఆనాటి నుండి శ్రీరంగములోనే ఒక పెద్ద తటాకం పుష్కరిణిని ఏర్పరచి దానిలో  తెప్పోత్సవము సురక్షితంగా జరుపవలెనని కైంకర్యపరులకు ఆఙ్ఞాపించారు జీయర్.

namperumal-theppamఉభయ దేవేరీలతో కూడిన నంపెరుమాళ్ తెప్పోత్సవం

  • ఒక సారి తిరు వరంగ పెరుమాళ్ అరైయర్ వ్యాధితో బాధ పడుతుండెడివారు, దీనివలన పెరియపెరుమాళ్  కైంకర్యమునకు ఆటంకం కలిగేది. అప్పుడు కూరనారాయణ జీయర్ సుదర్శన శతకమును రాసి, స్తోత్రం చేయుట వలన అరైయర్ వ్యాధి నుండి  విముక్తులయ్యారు. ఈ విషయం సుదర్శన శతక తనియన్లో స్పష్ఠంగా తెలుపబడింది.

thiruvarangapperumal arayar                                                    తిరువరంగ పెరుమాళ్ అరైయర్

శ్రీరంగమున  ఎంపెరుమానార్ తర్వాత వారి మఠము కూరనారాయణ జీయర్కు సమర్పించబడింది. ఆ మఠమునకు “శ్రీరంగ నారాయణ జీయర్ మఠం” గా నామ కరణం చేయబడింది. ఆనాటి నుండి క్రమంగా జీయర్లు పరంపరగా వస్తు శ్రీరంగ దేవాలయమునకు కైంకర్యం చేస్తున్నారు.

ఇంత వరకు కూరనారాయణ జీయర్ వైభవమును అనుభవించాము. వారి శ్రీ పాదముల యందు భగవత్ / భాగవత / ఆచార్య కైంకర్యం చేయాలని ప్రార్థన చేద్దాం.

కూరనారాయణ జీయర్ తనియన్

శ్రీపరాశరభట్టార్య శిష్యం శ్రీరంగపాలకమ్ |
నారాయణమునిం వందేఙ్ఞానాధి గుణసాగరం ||

సముద్రము వంటి విశాలమైన ఙ్ఞాన భక్తి  వైరాగ్యముల కలిగి శ్రీ రంగ పాలకులై, శ్రీ పరాశర భట్టర్ల శిష్యులైన కూరనారాయణ జీయర్కు వందనము చేయు చున్నాను.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజ దాసన్

మూలము: https://acharyas.koyil.org/index.php/2013/12/30/kura-narayana-jiyar-english/

పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

3 thoughts on “కూర నారాయణ జీయర్”

  1. Adiyen,
    Can I know whether these essays, like, Kura Narayana jeeyar, are taken from Guruparamparai, of world press, or separately given, please

Comments are closed.