అళగియ మణవాళ మామునులు

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

గత సంచికలో మనము  తిరువాయ్మొళి పిళ్ళై గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల  గురించి తెలుసుకొందాం. తిరునక్షత్రము: ఆశ్వయుజ మాసము, మూలా నక్షత్రము
అవతార స్థలము:  ఆళ్వార్ తిరునగరి
ఆచార్యులు : తిరువాయ్మొళి  ప్పిళ్ళై
శిష్యులు:  అష్ట దిగ్గజులు – పొన్నడిక్కాల్ జీయర్, కోయిల్ అణ్ణన్, పతంగి పరవస్తు పట్టర్పిరాన్ జీయర్, తిరువేంకట జీయర్, ఎఱుంబి అప్పా, ప్రతివాధి భయంకరమ్ అణ్ణన్, అప్పిళ్ళై, అప్పిళ్ళార్. నవ రత్నములు – సేనై ముదలియాండాన్ నాయనార్, శఠగోప దాసర్ (నాలూర్ శిఱ్ఱాత్తాన్), కందాడై పోరేఱ్ఱు నాయన్, యేట్టూర్ శింగరాచార్యులు, కందాడై అణ్ణప్పన్, కందాడై తిరుక్కోపురత్తు నాయనార్, కందాడై నారణప్పై, కందాడై తోళప్పరప్పై, కందాడై అళైత్తు వాళ్విత్త పెరుమాళ్. ఇతర తిరువంశములు, తిరుమాళిగలు, దివ్య దేశాల శిష్యులు.
పరమపదము చేరిన స్థలము: తిరువరంగము
శ్రీ సూక్తులు: శ్రీ దేవరాజ మంగళము, యతిరాజ వింశతి, ఉపదేశ రత్తిన మాలై, తిరువాయ్మొళి నూఱ్ఱన్దాది, ఆర్తి ప్రబంధము. వ్యాఖ్యానములు: ముముక్షుపడి, తత్వ త్రయము, శ్రీవచన భూషణము, ఆచార్య హృదయము, పెరియాళ్వార్ తిరుమొళి (పెరియ వాచాన్ పిళ్ళైల వ్యాఖ్యానము నుండి తప్పిన ఒక భాగము), రామానుశ నూఱ్ఱన్దాది. ప్రమాణ తిరట్టు (అన్ని శ్లోకములకు సంగ్రహముగా, శాస్త్ర వాఖ్యములకు ఒక ముఖ్యమైన గ్రంథము) ఈడు 36000 పడి, ఙ్ఞాన సారము, ప్రమేయ సారము, తత్వ త్రయము, శ్రీవచన భూషణము.

అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ ఆళ్వార్ తిరునగరిలో తిగళ కిడంతాన్ తిరుణావీరుడయ పిరాన్, శ్రీ రంగ నాచ్చియార్లకు ఆదిశేషుల అవతారముగా జన్మించారు. వీరికి  అళగియ మణవాళ మామునులు, సుందర జామాత్రు ముని, రమ్య జామాత్రు ముని, రమ్య జామాత్రు యోగి, వరవరముని, యతీంద్ర ప్రవణర్, కాంతోపయంత్రులు, రామానుజన్ పొన్నడి, సౌమ్య జామాత్రు యోగీంద్రర్, కోయిల్ శెల్వ మణవాళ మామునులు మొదలైన అనేక తిరునామములు ఉన్నాయి. వీరికి పెరియ జీయర్, వెళ్ళై జీయర్, విషద వాక్ శిఖామణి, పొయిల్లాద మణవాళ మాముని మొదలైన బిరుదములు ఉన్నాయి.

జీవిత చరిత్ర సంగ్రహముగా:

  • పెరియ పెరుమాళ్ళ అనుగ్రహంతో ఆదిశేషుల అంశావతారముగా ఆళ్వార్ తిరునగరిలో జన్మించారు.

మామునులు – ఆళ్వార్ తిరునగరి, తిరువడిలో అష్ట దిగ్గజములు 

  • వీరు అమ్మమ్మగారి ఊరైన శిక్కిల్ కిడారములో తమ తండ్రిగారి దగ్గర సామాన్య శాస్త్రాన్ని, వేదాన్ని అధ్యాయనమును చేశారు. చదువుకునే రోజుల్లోనే వీరికి వివాహము కూడా జరిగింది.
  • తిరువాయ్మొళి పిళ్ళైల వైభవమును విని ఆళ్వార్ తిరునగరికి తిరిగి వచ్చి వారిని ఆశ్రయించారు. మనము గత సంచికలో చూసి ఉన్నాము.
  • వీరి ధర్మ పత్ని ఒక బాలునికి జన్మనివ్వగా, వీరు తిరువాయ్మొళి పిళ్ళై దగ్గరకు వెళ్లి ఆ బాలుడికి సరియగు నామముతో నామకరణము చేయమని అభ్యర్తించారు. తిరువాయ్మొళి పిళ్ళై , రామానుజుల పేరు చాలా ఉత్తమమైనదని, దానిని ఆధారముగా చేసుకొని వారి కుమారులకు “ఎమ్మైయన్ ఇరామానుసన్” అని నామకరణము చేశారు.
  • తిరువాయ్మొళి పిళ్ళై పరమపదమును చేరిన తరువాత, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు దరిశన ప్రవర్తకరులుగా బాధ్యతలు చేపట్టారు.
  • వీరు అరుళిచ్చెయల్ (దివ్య ప్రబంధము) లో మహాప్రావీణ్యము ఉన్నవారు. ముఖ్యముగా తిరువాయ్మొళిలో, ఈడు 36000 పడి వ్యాఖ్యానములో మహాపట్టు ఉన్నవారు వీరు. ఈడు వ్యాఖ్యానము ఆధారంగా ఉండే అన్ని ప్రమాణములను సేకరించి గ్రంథికరించారు.
  • అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ల కీర్తిని గురించి విని, అళగియ వరదర్ (వానమామలై) వీరికి ప్రథమ శిష్యులుగా మారి, తమ ఆచార్యులకు నిరాటంకంగా సేవలను అందించాలనే సంలల్పంతో వెంటనే సన్యాసాశ్రమమును స్వీకరించారు. వానమామలై జీయర్ (స్వస్థలము కావడముచే), పొన్నడిక్కాల్ జీయర్ (కారణము నాయనార్లకు మొదటి శిష్యులు, ఎంతో మందిని ఈ దారిలో నడుచుటకు పునాది వేసినవారు – పొన్ అడిక్కాల్ అనగా బంగారు పునాది) అని ప్రసిద్ధికి ఎక్కారు.
  • శ్రీరంగానికి వెళ్లి అక్కడి నుండి మన సంప్రదాయాన్ని వ్యాపింపజేయాలన్న తమ ఆచార్యుని నియమనమును గుర్తుచేసుకొని, వారు ఆళ్వారుల వద్దకు వెళ్ళి, వారి అనుమతితో శ్రీరంగమునకు బయలుదేరారు.
  • శ్రీరంగానికి వెళ్ళే దారిలో, శ్రీవిల్లిపుత్తూర్ ఆండాళ్ రంగమన్నార్లకు, తిరుమాలిరుంజోలై అళగర్లకు తమ మంగళాశాసనములు చేసుకున్నారు.
  • శ్రీరంగానికి చేరుకొని కావేరి ఒడ్డున తమ నిత్యకర్మానుష్టానములను పూర్తి చేసుకున్న తరువాత, అక్కడి శ్రీవైష్ణవులందరూ వచ్చి వీరికి స్వాగతమును పలికారు. స్థానిక శ్రీవైష్ణవుల పురుషకారముచే ఎమ్పెరుమానార్లకు, నమ్మాళ్వార్లకు, పెరియ పిరాట్టి, విశ్వక్సేనులు, పెరియ పెరుమాళ్ళకు, నంపెరుమాళ్ళకు ఉభయ నాచ్చియార్లకు వరుసగా మంగళాశాసనమును చేసుకున్నారు. ఎమ్పెరుమానార్లకు స్వాగతమును పలికిన విధముగా పెరుమాళ్ళు వీరికి కూడా పలికి ప్రత్యేక ప్రసాదాలను, శ్రీ శఠగోపమును ప్రసాదించారు.
  • తరువాత పిళ్ళై లోకాచార్యుల తిరుమాళిగకు వెళ్ళి,  పిళ్ళై లోకాచార్యులతో పాటు వారి సహోదరుడైన అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు మన సంప్రదాయమునకు చేసిన కైంకర్యములను కొనియాడి కీర్తించారు.
  • వారు కొంత కాలము శ్రీరంగములో నివసించిన తరువాత, నంపెరుమాళ్ళు ఒకానొక రోజు వీరిని శ్రీరంగములోనే నిత్య వాసమును చేయమని, సాంప్రదాయములోని నిగూఢ అర్థములను ఉపదేశించమని వీరిని ఆదేశించారు. వీరు సంతోషంగా అంగీకరించి మహమ్మదీయుల దండ యాత్ర తరువాత మనము కోల్పోయిన గ్రంథాలన్నింటిని తిరిగి సేకరించారు.
  • ఒక సందర్భంలో ఉత్తమ నంబి సేవను విమర్శిస్తూ పొన్నడిక్కాల్ జీయర్ వీరికి ఫిర్యాదు చేసారు. వారు పెరుమాళ్ళ కైంకర్యమును సరియైన విధముగా చేయగలిగేలా చేయమని పెరుమాళ్ళనే ప్రార్థించమని జీయర్ను ఆఙ్ఞాపించారు.
  • తరువాత తిరుమలను దర్శించాలనే కోరికతో పొన్నడిక్కాల్ జీయర్తో కలిసి బయలుదేరుతారు. దారిలో తిరుక్కోవలూర్, తిరుక్కడిగై దివ్య దేశాలకు మంగళాశాసనము చేసి తమ ప్రయాణం ముందుకు సాగించారు.
  • తిరుమలలోని పెరియ కేళ్వి అప్పన్ జీయర్ (ఎంబెరుమానార్లు నియమించిన పెద్ద జీయర్ వారు) తమ స్వప్నములో, పెరియ పెరుమాళ్ళ వలె కనిపించే ఒక శ్రీవైష్ణవుడు శయనించి ఉన్నట్టు, వారి శ్రీ చరణాల వద్ద ఒక సన్యాసి నిలబడి ఉన్నట్టు కనిపించారు. ఆ స్వప్నములోనే వారు అక్కడ వచ్చి వెళ్ళే వారిని వారు ఎవరని అడుగగా, “తిరువాయ్మొళి ఈట్టు పెరుక్కర్ అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్, వారి ప్రాణ సుకృత్ (ప్రాణ వాయువు),  శిష్యుడైన పొన్నడిక్కాల్ జీయర్” అని బదులుస్తారు. నిద్రనుండి మేలుకొని, మంచి శకునముతో వచ్చిన ఆ స్వప్నమును గురించి ఆలోచిస్తుండగా వారిరువురు త్వరలో తిరుమలై చేరుకుంటున్నారన్న వార్త అందుతుంది. నాయనార్ తిరుపతికి చేరి, ఏడు కొండలను, గోవింద రాజులు, నరసింహ (కొండ క్రింద) పెరుమాళ్ళను సేవించుకొని చివరగా తిరుమలకి చేరుకుంటారు. పెరియ కేల్వి అప్పన్ జీయర్ వారు (పెద్ద జీయర్) నాయనార్లు, పొన్నడిక్కాల్ జీయర్లకు ఘనముగా స్వాగతము పలికి, ఇరువురిని తిరువేంకటటేశ్వరుడి సన్నిధికి మంగళాశాసనము చేయుటకై తీసుకొని వెళతారు. పెరుమాళ్ళు వారిద్దరిని చూసి సంతోషముతో తమ ప్రసాదమును, శ్రీ శఠగోపమును ప్రసాదించిన తరువాత, పెరుమాళ్ళ నుండి సెలవు తీసుకుంటారు.
  • తరువాత కాంచీపురం చేరుకొని దేవ పెరుమాళ్ళకు మంగళాశాసనమును చేసుకుంటారు. ‘ఎంబెరుమానార్ల వలే వీరు కూడా’ అని చెప్పి దేవ పెరుమాళ్ళు తమ ప్రసాదము శ్రీశఠగోపమును వీరికి అనుగ్రహిస్తారు.

మామునులు – కాంచీపురము

  • తరువాత వీరు శ్రీపెరుంబుదూర్ చేరుకొని ఎమ్పెరుమానార్ల అనుభవములో మునిగి మంగళాశాసనము అందించారు.
  • వారు కాంచీపురమునకు తిరిగి వచ్చి శ్రీ భాష్యమును కిడాంబి నాయనార్ (కిడాంబి ఆచాన్ వంశస్తులు) వద్ద సేవించసాగారు. అప్పుడు కొంతమంది శ్రీవైష్ణవులు కొన్ని విషయాలలో వాదనకు రాగా, తమ ఆచార్యులు భగవత్ విషయములలోనే ఈడుబడమని ఆదేశించట  చేత వారిని మొదట నిరాకరించారు. కాని వారి అనుచరులు నచ్చ చెప్పడముతో, వాటికి సరియైన వివరణములతో సమాధానములు ఇచ్చి వాదమునకు వచ్చినవారు వీరి శ్రీ చరణములను ఆశ్రయించేలా చేస్తారు.
  • అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ ఙ్ఞానమును చూసి కిడాంబి నాయనార్ ఆశ్చర్యపోయి తమ నిజ స్వరూపాన్ని వెల్లడించమని అభ్యర్తించారు. అప్పడికి కిడాంబి నాయనార్ శ్రీ భాష్యమును ఉపదేశించడము వలన వారు ఆచార్య స్థానములో ఉండడము వలన, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ తమ ఆదిశేష స్వరూపమును చూపించిరి. కిడాంబి నాయనార్ ఆనందభరితులై అప్పడి నుండి వీరి పట్ల ఎంతో భక్తి ప్రపత్తులతో వ్యవహరించేవారు. చివరకు శ్రీభాష్యము కాలక్షేపమును ముగించుకొని  శ్రీరంగానికి బయలుదేరారు.
  • వీరి రాకతో పెరియ పెరుమాళ్ళు సంతోషించి, ఇక ఏ యాత్రలు చేయకుండా శ్రీరంగములోనే ఉండమని ఆదేశిస్తారు.
  • అదే సమయములో మామునుల బంధువులలో ఒకరు పోవుటచేత ఆశౌచం పాటించాలన్న సమాచారము అందుతుంది. ఆ ఆశౌచం తన కైంకర్యానికి ఆటంకముగా భావించి, వెంటనే శఠగోప జీయర్ (తిరువాయ్మొళి పిళ్ళై శిష్యులు మరియు ఆళ్వార్ తిరునగరిలో సహాధ్యాయి) దగ్గర సన్యాసాశ్రమాన్ని స్వీకరించి, పెరియ పెరుమాళ్ళ వద్దకి వెళ్ళి జరిగిన విషయము గురించి చెప్పారు. పెరియ పెరుమాళ్ళు వీరిని ఆనందంగా ఆహ్వానించి అదే  తిరునామముతో ఉండమని ఆదేశించారు. మామునులకు పల్లవ రాయ మఠమును ఇచ్చి అక్కడే ఉంటూ కాలక్షేపములను అనుగ్రహించమని ఆజ్ఞాపించారు. అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు అలా అళగియ మణవాళ మామునులుగా మారారు. ఉత్తమ నంబి శిష్యులుగా ఉన్న శ్రీవైష్ణవులందరు నంబితో పాటు మామునుల మఠానికి వెళ్ళి సంతోషంగా  “మణవాళ మామునియే ఇన్నుమొరు నూఱ్ఱాండిరుం” అని కొనియాడారు.
  • పొన్నడిక్కాల్ జీయర్ల పర్యవేక్షణలో మఠం పునరుద్దరణ పూర్తి చేయమని తమ శిష్యులందరిని ఆదేశించారు. పిళ్ళై లోకాచార్యుల తిరుమాళిగ నుండి తెచ్చిన మట్టితో ఒక అందమైన మండపమును నిర్మించి దానికి తిరుమలై ఆళ్వార్ అని పేరు పెట్టి, అక్కడ తమ కాలక్షేపములను సాయించేవారు. తమ శిష్యులకు, అభిమానులకు రోజు తిరువాయ్మొళి (ఈడు), ఇతర ప్రబంధములు, ఎమ్పెరుమానార్ల మహిమలను, శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రము గురించిన ప్రవచనాలను అనుగ్రహించేవారు.
  • మామునుల మహిమలు మహా అగ్నివలె నలు దిశలు వ్యాపించి శ్రీవైష్ణవులెందరో తండోపతండాలుగా వచ్చి మామునులను ఆశ్రయించ సాగారు. తిరుమంజనం అప్పా (పెరియ పెరుమాళ్ళ నిత్య కైంకర్యపరర్), వారి కుమార్తె (ఆయ్చియార్), పట్టర్ పిరాన్ జీయర్ వీరి శిష్యులైనారు.
  • ‘వళ్ళువ రాజేంద్రం’ (దగ్గర గ్రామము) నుండి ‘శింగరైయర్’ అనే ఒక స్వామి రోజూ మామునుల మఠానికి కాయకూరలను అందిస్తుండేవారు. వీరి కైంకర్యాన్ని చూసి పెరుమాళ్ళు సంతోషించి అతనికి స్వప్నములో కనబడి “మామునులు ఆదిశేషుల అవతారము, మీరు వెళ్ళి మామునులను ఆశ్రయించండి” అని చెబుతారు. ‘శింగరైయర్’ శ్రీరంగానికి వచ్చి (కోయిల్) కందాడై అణ్ణన్ తిరుమాళిగలో ఉండి ఆ స్వప్నము గురించి అణ్ణన్ కు వివరిస్తారు. అణ్ణన్ ఈ స్వప్నము గురించి ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకోగా, స్వప్నంలో ఎంబెరుమానార్లు, ముదలియాండాన్లు కనిపించి, ‘మామునులు ఎవరో కాదు నేనే’ అని ఎంబెరుమానార్లు తెలుపుతారు. ముదలియాండాన్ కోయిల్ అణ్ణన్ను మామునులను ఆశ్రయించమని చెబుతారు. నిద్ర నుండి లేచిన తరువాత, కోయిల్ అణ్ణన్ తన సోదరులతో కలిసి మామునుల మఠానికి వెళ్ళి, పొన్నడిక్కాల్ జీయర్ పురుషకారముతో (సహాయముతో) మామునులకు శరణాగతి చేసెను. మామునులు సంతోషముతో అంగీకరించి వారికి పంచ సంస్కారములను ప్రసాదిస్తారు.
  • అప్పుడు ‘ఆయ్చియార్’ (తిరుమంజనం అప్పా కుమార్తె) కొడుకు ‘అప్పాచియారణ్ణ’ మామునులను ఆశ్రయించాలని ఆశించారు. అది విని మామునులు ఆనందించి, తమకు ప్రాణ వాయువు భావించే పొన్నడిక్కాల్ జీయర్ను పిలచి, తమ సింహాసనాన్ని వారికిచ్చి,  తమ శంఖ చక్రాలను వారికిచ్చి అప్పాచియారణ్ణకు పంచ సంస్కారము చేయమని ఆజ్ఞాపిస్తారు. పొన్నడిక్కాల్ జీయర్ మొదట నిరాకరించినప్పాటికీ, వేరే వికల్పం లేక తమ  ఆచార్యుల సంకల్పం ప్రకారము అప్పాచియారణ్ణాలకు పంచ సంస్కారములను చేస్తారు.
  • ఎమ్మైయన్ ఇరామానుశన్ (పూర్వాశ్రమములో మామునుల తిరుకుమారులు) ఆళ్వార్ తిరునగరిలో ఉండేవారు. వివాహము చేసుకొని అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్, పెరియాళ్వార్ ఐయన్ అను ఇద్దరు కుమారులకు జన్మనిచ్చారు.
  • నమ్మాళ్వార్లకు మంగళాశాసనము చేయాలని సంకల్పించి పెరియ పెరుమాళ్ళ అనుఙ్ఞను తీసుకొని ఆళ్వార్తిరునగరికి చేరుకున్నారు. తామర భరణి నది ఒడ్డున తమ నిత్య కర్మానుష్టానములను పూర్తి చేసుకొని, భవిష్యదాచార్యులు (ఎమ్పెరుమానార్లు), తిరువాయ్మొళి పిళ్ళై, వారి తిరువారాధన పెరుమాళ్ ఇనవాయర్ తలైవన్, నమ్మాళ్వార్, పొలిన్దు నిన్ఱ పిరాన్లకు మంగళాశాసనము చేసుకున్నారు.
  • ఆచార్య హృదయములోని ఒక చూర్ణికలో తమకు కలిగిన ఒక సందేహము గురించి చర్చించాలని తమ ఆచార్యులైన తిరువాయ్మొళి పిళ్ళైల స-బ్రహ్మచారి (సహాధ్యాయి) అయిన ‘తిరునారాయణపురతు ఆయి’ని కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. మామునులు ఆళ్వార్తిరునగరి నుండి బయలుదేరారు. కానీ అదే సమయంలో ఆయి కూడా మామునులను దర్శించుకోవాలని తిరునారాయణ పురము నుండి బయలుదేరి ఆళ్వార్తిరునగరి చేరుకుంటారు. ఇద్దరు ఆళ్వార్తిరునగరి పొలిమేరుల్లో కలుకొని సంతోషముతో ఆలింగనము చేసుకొని ఒకరినొకరు కీర్తించుకుంటారు. ఆ సమయములో మామునులు ఆయి మహిమను గురించి ఒక తనియన్ పాడారు. బదులుగా ఆయి కూడా ఒక పాశురమును పాడారు. అందులో మాముణులు ఎమ్పెరుమానారా లేక నమ్మాళ్వారా లేక భగవానుడా అని కొనియాడుతారు. కొన్ని రోజుల తరువాత ఆయి తిరునారాయణపురానికి తిరిగి వెళ్లిపోయారు. మామునులు ఆళ్వార్ తిరునగరిలోనే ఉన్నారు.
  • కొందరు దుండగులు మామునుల కీర్తిప్రతిష్ఠలను చూసి ఈర్ష్యతో వారి మఠానికి నిప్పు పెట్టి కాల్చే ప్రయత్నం చేస్తారు. కాని మామునులు తమ సర్ప అవతారమును ధరించి మఠంలో నుండి తప్పించుకొని బయటకు వచ్చి తమ మానవ రూపాన్ని తిరిగి ధరించి బయట ఉన్న శ్రీవైష్ణవుల సమూహములో నిలబడి ఉంటారు. అక్కడి రాజు దోషులను శిక్షించాలని నిశ్చయించుకుంటారు. కానీ మామునులు వారిని శిక్షించకుండా వదిలి వేయమని వేడుకుంటారు. వీరి కారుణ్యమును చూసి ఆ దుండగులు మామునుల శ్రీ చరణములను ఆశ్రయించి వారి శిష్యులౌతారు. మామునుల మహిమను చూసి ఆ రాజు కూడా వారి వద్ద పంచ సంస్కారములను పొంది, ఆళ్వార్తిరునగరి, తిరుక్కురుంగుడి దివ్య దేశాలలో ఎన్నో  కైంకర్యాలను చేసెను.
  • మామునులు తిరిగి శ్రీరంగానికి వచ్చి యదావిధిగా తమ కైంకర్యములను చేయుచున్నారు. ఆ సమయములో ఎఱుంబి అనే గ్రామము నుండి ‘ఎఱుంబి అప్పా’ అను వారు మామునుల గురించి విని శ్రీరంగానికి వచ్చి వారిని దర్శించుకుంటారు. వీరు మామునుల ప్రసాదము తీసుకోకుండా ఎఱుంబి గ్రామానికి తిరిగి వస్తారు. వచ్చిన తరువాత, తమ తిరువాధన పెరుమాళ్ళ సన్నిధి ద్వారాలను తీయుటకు ప్రయత్నించగా, అవి తెరుచుకోవు. మామునుల పట్ల అపచారమును చేసారని, వారెవరో కాదు ఆదిశేషుల అవతారమేనని చెప్పి పెరుమాళ్ళు వారిని మామునులను ఆశ్రయించమని, వారికి కైంకర్యమును చేసి వారి ప్రసాదమును స్వీకరరించుతేనే – ఆ ద్వారములు తెరుచుకుంటాయని పెరుమాళ్ళు తెలుపుతారు. ఎఱుంబి అప్పా తిరిగి శ్రీరంగానికి వచ్చి, తమను తాము మామునులకు సమర్పించుకున్నారు. వీరు ‘దిన చర్య’ అనే ఒక అద్భుతమైన ప్రబంధమును వ్రాసిరి, అవి 2 భాగములు – పూర్వ దినచర్య (మామునుల ఉదయపు కార్యక్రమాలు), ఉత్తర దినచర్య (మామునుల సాయంత్రపు కార్యక్రమాలు).
  • పొన్నడిక్కాల్ జీయర్ పురుషకారముతో అప్పిళ్ళై, అప్పిళ్ళార్ మామునులను ఆశ్రయించారు. ఎఱుంబి అప్పా మామునుల ఆఙ్ఞను తీసుకొని మామునుల కీర్తి ప్రతిష్ఠలను వ్యాపింపజేయాలని తిరిగి తమ స్వగ్రామానికి వెళ్ళారు.
  • ఉత్తమ నంబి అను ఒక్క ప్రముఖ శ్రీవైష్ణవుడు పెరియ పెరుమాళ్ళకు అంతరంగముగా ఆలవట్ట కైంకర్యమును చేయుచున్నారు. ఆ సమయములో మాణవాళ మామునులు పెరియ పెరుమాళ్ళకు మంగళాశాసనము చేయుటకు అక్కడికి వచ్చారు. మామునులను చూసి ఉత్తమ నంబి చూసి త్వరగా అక్కడి నుండి వెళ్ళమని సైగ చేస్తారు. వారి అజ్ఞను శిరాసావహిస్తూ అక్కడి నుండి నిష్క్రమించి వెళ్లిపోతారు. అలసి పోయినందున కొంచం సేద తీర్చుకోవాలని ఉత్తమ నంబి తమ కనురెప్పలను మూసుకోగానే పెరియ పెరుమాళ్ళు నంబికి దర్శన మిచ్చి, ఆదిశేషుని వైపు చూపుతూ, మామునులు మరి ఎవరో కాదు ఆదిశేష అవతారమని తెలుపుతారు. మేలుకొని, మామునుల మఠానికి వెళ్ళి వారిని అపరాధ క్షమాపనము వేడుకొని, అటు పిమ్మట మామునుల పట్ల భక్తితో వ్యవహరించేవారు.
  • ‘శఠకోప కొఱ్ఱి’ అను ఒక శ్రీ వైష్ణవ అమ్మాయి ఆయ్చియర్ వద్ద అరుళిచ్చెయళ్ నేర్చుకుంటూ ఉండేది. మధ్యాన సమయములో మామునులు అంతరంగములో ఏకాంతముగా పవళించునప్పుడు వారిని ఆ గదిలోని ఒక చిన్న రంధ్రమునుండి చూసి వారి నిజ స్వరూపాన్ని (ఆదిశేషుని రూపము) దర్శించుకుంటుంది. బయట శబ్ధములకు మేలుకొని మామునులు ఏమైనదోనని విచారించగా, తను చూసిన దృష్యాన్ని శఠకోప కొఱ్ఱి వారికి విన్నవించినది. అది విని మామునులు చిరుమంద హాసముతో జరిగిన వృతాంతమును ఒక రహస్యముగానే ఉంచమని అన్నారు.
  • మామునులు రహస్య గ్రంథములకు వ్యాఖ్యానాలు వ్రాయాలని నిర్ణయించు కొన్నారు. మొదట ముముక్షుపడి, తత్వ త్రయం, శ్రీ వచన భూషణములకు వేదం, వేదాంతం, ఇతిహాసం, పురాణము, దివ్య ప్రబంధము మొదలగు గ్రంథాల నుండి సేకరించిన విశేష అర్థముల ఆధారముగా వ్రాసిరి. ఆ తరువాత రామానుస నూఱ్ఱందాది, జ్ఞాన సారం, చరమోపాయ నిష్ఠ తెలిపే (ఆచార్యులే మనకు సర్వస్వం) ప్రమేయ సారం గ్రంథాలకు వ్యాఖ్యానములు వ్రాసారు.
  • పూర్వాచార్యులు మనకందించిన శ్రీసూక్తులను భద్ర పరచవలెనని శ్రీవైష్ణవులు కోరగా, ఆళ్వారర్ల తిరు నక్షత్రములను, వారు అవతరించిన దివ్య దేశములు, వారి గొప్పతనమును, ఎమ్పెరుమానార్ల అపార కారుణ్యమును, తిరువాయ్మొళి వ్యాఖ్యానమును, ఆ ప్రబంధము యొక్క అవతార క్రమమును, ‘ఈడు’ ఈ లోకములో ప్రచారము అయిన క్రమమును, పిళ్ళై లోకచార్యుల అవతార విశేషమును, వారి మహత్తరమైన శ్రీ వచన భూషణమును, తిరువాయ్మొళి యొక్క సారార్థం శ్రీ వచన భూషణమని నిరూపించే ‘ఉపదేశ రత్న మాల’ ను రచించి చివరిలో దాని అర్థ విశేషములు విశదముగా వివరించిరి.
  • కొందరు మాయవాదులు వారితో వాదనకు వచ్చిరి. వారు ఎప్పటి వలె వివాదము చేయ కూడదు అనే వారి నియమము ప్రకారము వాదన చేయుటకు అంగీకరించ లేదు. వారి శిష్యులైన వేదలప్పైని వారితో వాదన చేయమని ఆదేశించిరి. అజ్ఞానుసారముగా వారితో వాదన చేసి జయించిరి వేదలప్పై. కాని ఆ సంఘటన జరిగిన కొన్ని రోజులకే వారి స్వస్థలానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొనిరి.
  • అదే సమయములో కాంచిపుర వాస్తవ్యులు మహాపండితులు అయిన ప్రతివాది భయంకరం అణ్ణా తిరుమల వేంకటేశ్వరుడి మీద ఉన్న అనుబంధము వల్ల తిరుమలలో తీర్థ కైంకర్యము చేస్తుండేవారు. శ్రీరంగము నుండి ఒక శ్రీవైష్ణవుడు వచ్చి తిరుమలలో తీర్థ కైంకర్యము చేస్తున్న అణ్ణాని కలిసి, వారికి మామునుల గొప్పతనము గురించి వివరించారు. వారి వైభవము విన్న అణ్ణా చాల సంతోషించి, వారిని కలవాలనే కోరిక కలిగింది. వారి గురించి ఆలోచిస్తూ, తీర్థ పరిమళము (లవంగము/ఈలైచి) ను తీర్థములో చేర్చుటకు మరిచి దానిని అర్చకర్లకు ఇచ్చారు. ఆ తరువాత తీర్థ పరిమళము కలపలేదే అని గుర్తు తెచ్చుకొని తీర్థ పరిమళముతో అర్చకుల వెనుక పరుగు తీసారు. ముందు కన్నా ఇప్పుడు తీర్థం ఎక్కువ సువాసనను వెదజల్లుతున్నదని అర్చకులు చెప్పిరి. అది విన్న అణ్ణా, మామునుల వైభవము ప్రాశస్త్యము ఎటువంటిదంటే వారి గొప్పతనము విన్న మాత్రముచేతనే తీర్థము సుగందభరితమైనదని తలచి మామునుల దర్శనము చేసుకొనటకు శ్రీరంగమునుకు చేరారు. మామునుల మఠమునకు చేరుకున్నారు. వారు అప్పుడు తిరువాయ్మొళి (4. 10) లో “ఒన్నమ్ దేవుం” పదిగమును వివరించుచుండిరి. ఆ పదిగము భగవానుడి పరత్వమును స్థాపించును. మామునులు అతి సులభముగా ఎన్నో శాస్త్రముల నుండి దృష్టాంతము ఇస్తూ వివరించ సాగారు. అది గమనించిన అణ్ణా వారి పరిజ్ఞానమునకు, వారి ప్రవచన సామర్థ్యమునకు ఆశ్చర్య చకితులైనారు. మామునులు 3వ పాశురము దగ్గర ఆగి పోయిరి. అణ్ణాకు ఆళ్వార్ సంబంధం ఉన్నప్పుడే ఈ విశేష అర్థములు సేవించుటకు యోగ్యత కలుగునని చెప్పిరి (ఓరాణ్ వళి ఆచార్య పరంపర ప్రకారం). అటు పిమ్మట పెరియ పెరుమాళ్ళకు మంగళాశాసనము చేయుటకు బయలుదేరిరి. పెరియ పెరుమాళ్ అర్చక ముఖేన విలక్షణ సంబంధము పొందుటకు మామునులను శరణు వేడమని చెప్పిరి. పొన్నడిక్కాల్ జీయర్ పురుషకారముచే మామునుల చరణ సంబంధము పొంది అక్కడే కొంత కాలము ఉన్నారు.
  • మామునులు తిరుమల యాత్ర చేయుటకు బయలుదేరిరి. దారిన కాంచీపురం దేవ పెరుమాళ్ళకు మంగళాశాసనము చేసి అక్కడ కొన్ని రోజులు నివసించి, అక్కడి శ్రీ వైష్ణవులను సంస్కరించిరి. అప్పాచియారన్నను తన ప్రతినిధిగా అక్కడే నివసించమని నియమించి, ఆ తరువాత తిరుకడిగై, ఎఱుంబి, తిరుపుట్ట్కుళి మొదలగు దివ్య దేశములను సేవించుకుంటూ తిరుమలై చేరిరి. అక్కడ మంగళాశాసనము చేసి శిరియ కేల్వి అప్పన్ జీయర్ ను పెరియ కేల్వి అప్పన్ (ఎమ్పెరుమానర్లచే స్వయముగా నియమింపబడ్డ) జీయర్ల  కైంకర్యముకు సహకారిగా నియమించిరి. తమ తిరుగు ప్రయాణంలో, వారు తిరు ఎవ్వుళ్ విజయ రాఘవన్, తిరువల్లికేని వేంకట కృష్ణుడు మొదలగు దివ్య దేశములను మంగళాశాసనము చేసిరి. మధురాంతకము చేరి అక్కడ పెరియ నంబి రామానుజులకు పంచ సంస్కారం చేసిన ప్రదేశమును సేవించిరి. అటు పిమ్మట తిరువాలి తిరునగరి చేరి అక్కడ తిరుమంగై ఆళ్వారుకి వడివళగు పాశురమును సమర్పించి, ఆ ప్రదేశములో ఉన్న పెరుమాళ్ళందరిని మంగళాశాసనము చేసిరి. ఆ తరువాత తిరుకణ్ణపురం చేరి సర్వాంగ సుందరమైన శౌరిరాజ భగవానుని అనుభవించి, అక్కడ తిరుమంగై ఆళ్వార్లకు అక్కడ తిరుమేని సమర్పించిరి. ఇంకను మరి కొన్ని దివ్య దేశముల యాత్ర చేసి, కడకు శ్రీరంగము చేరి అక్కడ నివసించిరి.
  • ముందుగా ఆదేశించిన విధముగా అప్పాచియారణ్ణాను కాంచిపురమునకు వెళ్ళమని ఆదేశించిరి. అధ్బుతమైన ఆ గోష్టిని వదిలి వెళ్ళుటకు అప్పాచియారణ్ణా చాల విచారం పడ సాగిరి. అది చూసిన మామునులు ‘రామానుజము’ అనే తన మర చంబుతో తన యొక్క రెండు తిరుమేనులను తయారు చేయమని ఆదేశించెను. దీనినే పొన్నడిక్కాల్ పూజించేవారు. ఆ రెండు తిరుమేనులలో ఒకటిని పొన్నడిక్కాల్ జీయరుకి, మరొకటి అణ్ణాకి సమర్పించారు. (వీటిని ఇప్పుడు కూడా వానామామలై మఠములో, శింగ పెరుమాళ్ కోవెలలోని ముదలియాండాల్ తిరుమాళిగలోనూ సేవించవచ్చు) వీరు తన “ఎన్నై తీమనం కేడుతాయ్” తిరువారాధనము పెరుమాళ్ళను అణ్ణాకు ప్రసాదించిరి (శింగ పెరుమాళ్ కోవెలలో ముదలియాండాన్ తిరుమాళిగలో సేవించగలము).
  • ప్రతివాది భయంకర్ అణ్ణాను శ్రీ భాష్య ఆచార్యులుగా, కందాడై అణ్ణన్, శుద్ధ సత్వం అణ్ణన్ వారిని భగవత్ విషయ ఆచార్యులుగా నియమించిరి. కందాడై నాయన్ వారిని ముప్పదు ఆరాయిరప్పడికి అరుమ్పదం రాయమని ఆదేశించిరి.
  • మామునుల ముఖేన ఎడ తెరుపు లేకుండా భగవత్ విషయం వినాలని పెరియ పెరుమాళ్ ఆశించారు. తమ పరిపూర్ణ ఇచ్ఛతో వారిని తమ గురువుగా ఎంచుకోవాలని పెరుమాళ్ళ సంకల్పము. ఒకనాడు పవిత్రోత్సవ శాఱ్ఱుముర సమయంలో, నమ్పెరుమాళ్ళు తిరు పవిత్రోత్సవ మండపానికి చేరుకున్నారు. వారిని మంగళాశాసనము చేయుటకు మామునులు అక్కడకు చేరిరి. కైంకర్యపరులు, ఆచార్య పురుషులు, జీయర్లు, శ్రీవైష్ణవుల సమక్షములో మామునులను నమ్మాళ్వార్ల తిరువాయ్మొళి కాలక్షేపమును ఈడు ముప్పదు ఆరాయిర పడి వ్యాఖ్యనముతో చేయమని ఆదేశించెను. ఎటువంటి అవరోధాలు లేకుండా కాలక్షేపము పూర్తి అయ్యే వరకు నిరంతరాయంగా కొనసాగించాలని ఆదేశించిరి. పెరుమాళ్ళు తనను ఈ కైంకర్యము చేయుటకు ఎంచుకున్నందుకు వినతితో కృతజ్ఞ చేసి, అంగీకరించిరి.
  • ఆ మరుసటి రోజున ఉభయ నాచ్చిమార్లతో కూడిన నమ్పెరుమళ్, తిరు అనంతాళ్వాన్ , పెరియ తిరువడి, సేనై ముదలియార్, ఆళ్వార్లు, ఆచార్యులు అందరూ పెరియ తిరుమండపము (పెరియ పెరుమాళ్ సన్నిధి ద్వారపాలకుల ఎదుట) తన కాలక్షేపము కాగా ఎదురుచూస్తూ ఉండిరి. ఇంతటి వారు తన కోసం ఎదురు చూచుటకు చాలా దీవించబడిరని ముప్పదు ఆరాయిరపడి వ్యాఖ్యానమును (6000 పడి, 9000 పడి, 12000 పడి మరియు 24000 పడి) వ్యాఖ్యానములతో కాలక్షేపము ఆరంభించిరి. వారు వాటిలో నిఘూడమైన అర్థములను శృతి, శ్రీభాష్యం, శృత ప్రకాషిక, శ్రీగీత భాష్యం, శ్రీపాంచరాత్రం, శ్రీరామాయణం, శ్రీవిష్ణు పురాణము మొదలగు గ్రంథముల ఆధారములతో వివరించిరి. వాటిలోని ప్రతి పదార్థములను, స్వాపదేశార్థములను మొదలగు చెప్పిరి. ఇలా పది నెలలు గడిచి పోయినవి. చివరికి శాఱ్ఱుముర రోజు రానే వచ్చినది, అది ఆణి తిరుమూల నక్షత్రం. శాఱ్ఱుముర అయిన తరువాత, నమ్పెరుమాళ్ళు ‘అరంగనాయకమ్’ అనే ఒక చిన్న బాలుని రూపములో ఎందరు అడ్డుకుంటుండగా గోష్టిలోకి వచ్చిరి. అంజలి ఘటిస్తూ, “శ్రీ శైలేశ దయాపాత్రం” పఠించిరి, ఇంకా చెప్పమనిన “ధీ భక్త్యాది గుణార్నవమ్” అని మరి కాస్త చెప్పమనిన “యతీంద్ర ప్రవణం వందే రమ్యజా మాతరం మునిమ్” అని చెప్పి పరుగు తీసిరి. శిష్యులు ఆ శ్లోకమును మఱ్ఱి ఆకుపై రాసిరి. ఆ బాలుని గోష్టి సమక్షమున తీసుకుని వచ్చి మళ్ళి చదవమని చెప్పగా, ఆ బాలుడు ఏమియును చదువలేక పారి పోయెను. నమ్పెరుమాళ్ళు స్వయముగా తన ఆచార్యులకు సమర్పించుటకు వచ్చిరని అందరికి అర్థము అయినది. పెరుమాళ్ళు ఈ తనియన్ను అన్ని దివ్య దేశములకు పంపించిరి, అన్ని చోట్ల ఈ తనియన్ ఒక అగ్ని జ్వాల వలె వ్యాపించెను. అదే సమయములో, శ్రీ వైష్ణవుల ఆజ్ఞ మేరకు, అప్పిళ్ళై మామునుల కీర్తిని చాటేట్టు వాళి తిరునామం వ్రాసిరి.

  • తిరుమల వేంకటేశ్వరుడు, తిరుమలిరుంజోలై అళగర్ పెరుమాళ్ళు కూడా ఈ తనియన్ను అరుళిచ్చెయళ్ ప్రారంభంలో,  తరువాత అనుసంధానం చేయవలెనని ఆదేశించారు. బద్రికాశ్రమము, ఇతర ఉత్తర దేశపు దివ్య దేశములకు మామునులు కీర్తిని ప్రకాశించుటకు పెరుమాళ్ళ నియమనము లభించినది.
  • మామునులు వడ నాడు దివ్య దేశములు మంగళాశాసనము చేయుటకు తలచారు. వారి తరపున వారి శిష్యులు యాత్రకై బయలుదేరిరి.
  • తమ దివ్య పాదుకలను ఎఱుంబి అప్పాకు ప్రసాదించెను.
  • మామునులు తమ తిరువారాధన పెరుమాళ్ళు అయిన అరంగనగరప్పన్ని పొన్నడిక్కాల్ జీయర్ వారికి ప్రసాదించి, వానమామలైకి వెళ్ళి, అక్కడ ఒక మఠమును ఏర్పాటు చేసి దేవనాయక పెరుమాళ్ళకి నిరంతరాయంగా కైంకర్యము చేయమని ఆజ్ఞాపించెను.
  • మరొక సందర్భంలో పాండ్యనాడు దివ్యదేశ యాత్రకు బయలు దేరిరి. పోవు మార్గములో, ఆ ఊరి రాజు (మహాబలి వాననాథరాయులు) మామునుల శిష్యులై, అనేక దివ్య దేశముల కైంకర్యములు వారి ఆదేశముల మేరకు చేసిరి.
  • మధురైకి వెళ్ళే దారిలో సేద తీరుటకు ఒక చింతచెట్టు క్రింద విశ్రమించి, బయలుదేరు సమయములో ఆ వృక్షమును తాకి, దానికి మోక్షమును ప్రసాదించిరి. అలా ఎన్నో దివ్య దేశములను మంగళాశాసనము చేస్తూ, చివరిగా శ్రీ రంగము చేరిరి.
  • తమ శిష్యుల ద్వారా అనేక కైంకర్యములను సుసంపన్నము చేసిరి. తిరుమాలిరుంజోలై అళగర్ పెరుమాళ్ళకు కైంకర్యము చేయుటకు ఒక జీయర్ స్వామిని పంపించిరి.
  • పెరియ వాచ్చాన్ పిళ్ళై పెరియాళ్వార్ తిరుమొళికి వ్యాఖ్యానము వ్రాసిరి, కాని అందులో కొంత భాగము చేజారి పోయినందువల్ల, కోల్పోయిన భాగమునకు మామునులు వ్యాఖ్యానమును వ్రాసిరి.
  • వారు అస్వస్థతకు గురి అయినను, వ్రాయడము మానలేదు. అతి కష్టముగా ఆచార్య హృదయము  వ్రాయు సమయములో, వారి శిష్యులు ఎందులకు ఇంత కష్టమునకు ఓర్చి వ్రాయడం అని అంటే, అది వచ్చే తరములోని వారి పిల్లా పాపల ఉజ్జీవనం కొరుకని సమాధానము ఇచ్చిరి.
  • తమ తిరుమేనిని వదిలి పరమపదము చేరుటకు మిక్కిలి ఆశ పెరిగి, ఆర్తి ప్రబంధము రచించిరి. అందులో వారు రామానుజులను (ఎమ్పెరుమానార్లను), తనను శీఘ్రముగా తన శ్రీపాదముల దగ్గరకు చేర్చు కోవలెనని, ఈ శరీరము నుండి బంధ విముక్తిని చేయమని రోదించారు. ఈ గ్రంథము ద్వారా మనము ఎట్లు పెరుమాళ్ళను ప్రార్థించ వలేనో చూపిరి. ఎందులకు అనగా వారే స్వయముగా ఎమ్పెరుమానార్లు కాబట్టి.
  • చివరిగా వారు ఈ లీల విభూతిలో తన కార్యక్రమములు అన్నింటిని ముగించుకొని పరమపదమునకు తిరిగి వెళ్ళి భగవానుని నిత్య కైంకర్యము చేయాలని నిశ్చయించుకొనిరి. అన్ని అరుళిచ్చెయళ్ను ఒకసారి వినాలనే ఆశ తెలియజేసిరి. అందరు శిష్యులు ఎంతో ప్రేమ భక్తి ప్రపత్తులతో వారి కోరిక మేరకు అట్లే ఏర్పాటు చేసిరి. మామునులు సంతోషించి ఒక పెద్ద తదియారాధనను నిర్వహించి, వారి శిష్యుల దగ్గర క్షమ ప్రార్థన అడుగుతారు. వారి శిష్యులు వారిని ఏ దోషము లేని వారని, క్షమా ప్రార్థన అడుగనవసరం లేదని చెప్పిరి. పెరియ పెరుమాళ్ళు, నంపెరుమాళ్ళ కైంకర్యములు పూర్తి శ్రద్ధా భక్తులతో జరుగునట్టు గమనించ వలెనని అందరితో విన్నవించిరి.
  • ఆ తరువాత “పిళ్ళై తిరువడిగళే శరణం”, వాళి ఉలగాశిరియన్”,  “ఎమ్పెరుమానార్ తిరువడిగళే శరణం” అని చెప్పిరి. వారి కన్నులను బారేడుగా చేసి పెరుమాళ్ళ దర్శనము కొరకు చూడగా, వెంటనే పెరుమాళ్ళు గరుడారూహూడై ప్రత్యక్షమై తనతో పాటు తీసుకు వెళ్ళిరి. ఈ విధముగా వారి లీల ఈ విభూతిలో అతి వైభవముగా ముగించిరి. ఇది చూచిన శ్రీవైష్ణవులందరు బాధతో కన్నీరు మున్నీరుగా ఏడ్చిరి. పెరియ పెరుమాళ్ళకు వీరు లేని లోటు ఎంత వరకు బాధించింది అనగా వారు భోగములను గై కొనుటయే మానుకొనిరి. చివరకు తమను తాము ఒకరినొకరు సమాధాన పరచుకొని చరమ కైంకర్యములను చేసిరి. తిరువధ్యయన ఉత్సవము పెరియ పెరుమాళ్ళ అజ్ఞానుసారముగా వారి బ్రహ్మోత్సవముల కంటే గొప్పగా నిర్వహించిరి.
  • పొన్నడిక్కాల్ జీయర్ వడ నాట్టు దివ్య దేశముల యాత్ర నుండి వచ్చి మామునుల చరమ కైంకర్యమును నిర్వహించిరి.

మాముణుల సూచనలు (జ్ఞాన /అనుష్టాన పూర్తి)

1. ఒక సమయములో ఇద్దరు శ్రీ వైష్ణవుల మధ్య భేదాభిప్రాయములు వచ్చాయి. అప్పుడు, రెండు వీధి కుక్కలు వీధిలో పడి ఆ ఇద్దరి శ్రీ వైష్ణవులు ముందు కొట్టుకుంటునవి, వాటిని చూసి “ఇంత అహంకారము ఉండుటకు కారణము మీరు కూడా ఈ ఇరువురు శ్రీ వైష్ణవుల వలె శ్రీ వచన భూషణమును నేర్చుకొంటిరా” అని అడిగెను. వెంటనే వారి తప్పులను తెలుసుకొని, నిష్కల్మశులైరి.

2. వడ దేశములందు ఎవరైనా ధనమును ఇచ్చి, ఆ ధనము సక్రమ పద్దతిలో ఆర్జించ లేనిచో వారు దానిని తిరిగి ఇచ్చి వెయుదురు. లౌకిక ధనముపై ఏ ఆశను చూపించరు. కేవలము శ్రీ వైష్ణవుల నుండి మాత్రమే కైంకర్యమునకు ధనము / వస్తువు సేకరింపబడేల చూచుదురు.

3. ఒకనాడు ఒక వృద్ధ వనిత మఠమునకు వచ్చి, ఆ రాత్రి తను అక్కడ ఉండుటకు అనుమతి ఇవ్వమని కోరినది. ఆవిడ కోరికను నిరాకరించి , “ఒక ముసలి ఉడుత కూడా చెట్టు ఎక్క గలదు” అని చెప్పిరి అనగా ఒక వృద్ధురాలు మఠములో ఉన్నను, మాముణుల వైరాగ్యముపై లోకులు సఖించగలరు. వీరి వైరాగ్య నిష్ఠపై ఎవరికైనా ఏ చిన్న సంధేయము వచ్చెటువంటి పనులను చేయజాలరని చెప్పిరి.

4. ఒక్క నాడు ఒక శ్రీ వైష్ణవ అమ్మగారు కూరగాయులు తరుగుటలో సహాయము పరిపూర్ణమైన భక్తితో చేయనందు వల్ల, తనను 6 మాసములు కైంకర్యమునకు దూరముగా ఉండవలెనని దండన ఇచ్చిరి. ఎందుకంటే, మాముణుల కైంకర్యపరులు వారి పూర్తి భక్తి విశ్వాసములతో భగవత్/భాగవత్ నిష్ఠలో ఉండవలెనని ఆశించేదురు.

5. వరం తరుం పిళ్ళై అనే శ్రీ వైష్ణవుడు మాముణుల దగ్గరకు ఒంటరిగా వాచ్చిరి. అది గమనించి శ్రీ వైష్ణవులు ఎమ్పెరుమాన్ /ఆచార్యులు దగ్గరికి ఒంటరిగా వెళ్ళ రాదని, శ్రీ వైష్ణవులతో గోష్ఠిగా వెళ్లాలని చెప్పిరి.

6. ఎన్నో మార్లు భాగవత్ అపచారముల యొక్క కృరత్వము గురించి చెప్పిరి. అదే విధంగా శ్రీ వైష్ణవులు ఒకరితో మరి ఒక్కరు మర్యాదతో వ్యవహరించ వలెనని భోదించిరి.

7. ఒక్క భట్టర్ మాముణుల వద్దకు తమ శిష్యులు తనని సరిగ్గా గౌరవ మర్యాదలు ఇవ్వట్లేదని చెప్పిరి, అందుకు వారు శిష్యులతో పెరుమాళ్ పిరాట్టియార్లు ఆచార్యులలో ఉందురని భావిస్తూ వారితో ఎప్పుడు గౌరవ మర్యాదలతో మెలగవలెనని మందలించిరి.

8. వడ నాట్టు నుండి ఒక ధనవంతుడైన శ్రీ వైష్ణవుడు మాముణుల వద్దకు వచ్చి శ్రీ వైష్ణవ లక్షణములను విశదికరించి అడిగిరి. మాముణులు నిజమైన శ్రీ వైష్ణవుని లక్షణమును ఈ విధంగా వివరించిరి.

  • ఎమ్పెరుమానే సర్వస్వం అని ఆశ్రయించిన మాత్రమున సరిపోదు.
  • ఎమ్పెరుమాన్ యొక్క సంబంధమును శంఖ చక్రముల (సమాశ్రయనము) లాంఛనము ద్వారా పొందిన మాత్రమున సరిపోదు.
  • నిత్యము ఎమ్పెరుమాన్ యొక్క కైంకర్యముగా తిరువారాధనము చేయుట మాత్రమున సరిపోదు.
  • తమ ఆచార్యునికి పరతంత్రముగా ఉండుట మాత్రమున సరిపోదు.
  • భాగవతులకు కైంకర్యము చేస్తూ ఉండుట మాత్రమున సరిపోదు.
  • ఇవి అన్నియు కలిగి ఉండవలెను, ఇంకనూ ముఖ్యముగా కొన్ని ఉండవలిసినవి / కావలసినవి /చేయవలసినవి ఉన్నవి.
  1. ఎమ్ఫెరుమాన్ ముఖ విలాసము చెందించే, ఆయా సందర్భములలో తగునట్టి ఉచితమైన కైంకర్యములు చేయవలెను.
  2. వారి వారి గృహములను శ్రీ వైష్ణవులు తమ ఇష్టనుసారముగా ఉపయోగించుకొనుటకు ఏర్పర్చుకొనవలెను.
  3. పెరియాళ్వార్ శ్రీ సూక్తి “ఎన్ తమ్మై విర్కవుం పెరువార్గాళే” ప్రకారముగా ఉండవలెను (శ్రీ వైష్ణవులు మన స్వాములు అయినందున మనలను క్రయ విక్రయము చేయుటకును పరిపూర్ణ అధికారము కలవారు)
  • భాగవత శేషత్వం పెంపొందించుకున్న తరువాత ఎమ్పెరుమాన్ మరియు ఆళ్వార్ ఆచార్యుల అనుగ్రహము చేత మన సాంప్రదాయ అర్థ విశేషములను చాలా సులభముగా నేర్చుకొనగలము. చరమ పర్వ నిష్ఠ అయిన భాగవత శేషత్వమును ఆచరిస్తూ ఉండడము వలన ఇటువంటి శ్రీ వైష్ణవులు మరి ఏ ఇతరమైన విశేష అర్థములను తెలుసుకొనుట అవసరము లేదు.
  • మనము ఆచరణ చేయని విషయములను ఇతరులకు ఉపదేశించటము వ్యర్థము. అది ఏ విధముగా ఉండుననగా ఒక వ్యభిచారి పవిత్రత గురించి ఉపదేశించుమాదిరిగా ఉండును.
  • శ్రీ వైష్ణవుల కైంకర్యము కన్నా మిన్న కైంకర్యము మరి ఒక్కటి లేదు, శ్రీ వైష్ణవుల పట్ల అపచారము కన్నా క్రూరమైన అపచారము ఇంకొకటి లేదు.

ఈ లక్షణములు అన్నింటిని విన్న ఆ శ్రీ వైష్ణవుడు మాముణుల పట్ల భక్తి శ్రద్ధలతో ఎల్లప్పుడూ వారినే స్మరిస్తూ ఉండిరి.

మన సంప్రదాయములో మాముణులకు గల ప్రతేక స్థానము: 

  • ఏ ఆచార్యుల వైభవమునైనా సంగ్రహముగా మాట్లాడగలము కాని మాముణుల వైభవము అపరిమితమైనది. వారు కూడా వారి యొక్క వేయి నాలుకలతో (ఆదిశేశులుగా) కూడా తమ కీర్తిని గురించి చెప్పలేరు, అందువలన మనము ఏ విధముగా పూర్తి సంతృప్తి చెందలేము. మనము కాస్తైనా ఈ విధముగా వీరి వైభవమును గురించి మాట్లాడి చదువుటచే అపరిమిత లాభము పొందితిమని సంతృప్తి చెందవలసినదే.
  • వీరిని పెరియ పెరుమాళ్ తమ ఆచార్యులుగా అంగీకరించి ఆచార్య రత్న హారమును మరియు ఓరాణ్ వళి గురు పరమ్పరను పూర్తి చేసిరి.
  • పెరియ పెరుమాళ్ వీరికి శిష్యులుగా ఉండి, వారి యొక్క శేష పర్యంకమును మాముణులకి సమర్పించిరి, ఇది ఇప్పడికినీ మనము చూడవచ్చు – ఏ ఇతర ఆళ్వార్/ఆచార్యులకు లేని విధముగా ఒక్క మాముణులకు మాత్రమే శేష పర్యంకము/పీఠము కలిగి ఉండును.
  • పెరియ పెరుమాళ్ తమ యొక్క ఆచార్యుల కొరకు, ఒక తనియన్ వ్రాసి, మాముణులకి సమర్పించిరి మరియు ఆ తనియన్ని తప్పక అరుళిచ్చెయల్ గోష్ఠిలో ఏ ప్రదేశములోనైనా మొదట మరియు చివర తప్పక అనుసందిచ వలనని ఆదేశించిరి – గుళ్ళలో, మఠములలో, తిరుమాళిగలలో మొదలైన చోట్ల.
  • ఆళ్వార్ తిరునగరిలో, ఐప్పసి తిరుమూలము (మాముణుల తిరునక్షత్రము) రోజున, ఆళ్వార్, తమ తిరుమంజనము తదుపరి, తమ యొక్క పల్లకి, కుడై, చామరము, వాద్యము, మొదలగునవి మాముణుల సన్నిదికి పంపి వారిని తన వద్దకి తీసుకొని వద్దురు. ఒక్క మాముణులు మాత్రమే వచ్చిన పిదప, వారు తిరుమణ్ కాప్పుని ధరించి ప్రసాదమును మాముణులకి ప్రసాదిస్తారు.
  • మన పూర్వాచార్యులలో ఒక్క మాముణులు ఒక్కరికి మాత్రమే తిరు అద్యయనమును చేయుదురు. సాధారణముగా తిరు అద్యయనమును శిష్యులు మరియు కుమారులు మాత్రమే చేయుదురు. కాని వీరి విషయములో, మాముణుల శిష్యులై ఇప్పటికి జీవించి ఉండే శ్రీ రంగ నాథునులు తమ యొక్క ఆచార్యుల తీర్థమును చాలా గొప్పగా చేయుదురు. వారు తమ అర్చకులను, పరిచారకులను, సారెను (తమ యొక్క పల్లకి, కుడై, చామరము, వాద్యము), ఈ మహోత్సవమునకు పంపుదురు. ఈ మహోత్సవ విశేషముల గురించి తెలుసుకొనుటకు  http://www.kaarimaaran.com/thiruadhyayanam.html లో చూడగలరు.
  • మాముణులు తమ గురించి ఎటువంటి ఉత్సవములు జరుపుకోకుడదని ఉద్ధేశించిరి –శ్రీరంగము మరియు ఆళ్వార్తిరునగరిలో, వారు తమ అర్చా తిరుమేనులు చాలా చిన్నగా ఉండవలెనని, ఎటువంటి పురప్పాడు మొదలగునవి ఉండకూడదని, నమ్పెరుమాళ్ మరియు ఆళ్వార్లకే ఎక్కువ ప్రాముఖ్యము ఇచ్చిరి.
  • అందులకే వారిని మనము అందమైన చిన్న తిరుమేనిలో ఇప్పటికిని ఆ రెండు దివ్యదేశములలో చూస్తున్నాము.
  • మాముణులు ఎంతో వినయ విధేయతలు కలవారు. ఎవరి గురించి కూడా చెడుగా వ్రాయటము చేసేవారు కాదు. మన పూర్వాచార్యుల వ్యాఖ్యానములలో ఎక్కడైనా ఒక చిన్న అర్థ వ్యతిరేకతలు గమనించితే దాని గురించి వ్యర్థమైన మాటలను మాట్లాడక, వాదనమును తప్పు పట్టే వారు కాదు.
  • వారు అరుళిచ్చెయల్ పైన దృష్టి సారించి, వేదాంతమును అరుళిచ్చెయల్ పాశురముల ద్వారా వివరించిరి. వీరి కృషి లేకునచో తిరువాయ్మొళి మరియు దాని అర్థ విశేషములు నదిలో పారపోసిన చింతపండు వలె అయి ఉండేవి అనగా వ్యర్థమై పోయి ఉండేవి.
  • మాముణులు అన్ని గ్రంథములను సేకరించి, వాటికి తానే స్వయముగా అర్థ విశేషములను వ్రాసి, భద్రపరిచిరి. ఈ కారణముగానే, ఇన్ని తరముల తరువాత కూడా అవి మనకు అందుబాటులో ఉన్నాయి.
  • వారు అపార కారుణ్యము గలవారు, ఎవరైనా తమని అవమానించినా/కష్టమునకు గురి చేసినా, వారు ఎప్పుడూ కోపమును ప్రదర్శించక, వారిని ఎల్లప్పూడూ గౌరవించి చాలా ఆదరించేవారు.
  • ఈ విధముగా వారి తిరువడిని మన శిరస్సుపై ధరించిన, అమానవన్ మన చేతిని పట్టుకొందురు. ఏ రోజైతే మాముణుల శ్రీ చరణములను మన శిరస్సుపై ధరించుటకు సిద్ధముగా ఉందుమో, అప్పుడు అమానవన్ (విరజా నదిని దాటుటకు సహాయము చేయువారు) నిశ్చయముగా మన చేతులను పట్టుకొని ఈ సంసార సాగరము నుండి మనలను బయటకు పడ వేయుదురు.
  • ఎమ్పెరుమానార్ల యందు వారికి గల నిబద్దత అసమానమైనది, వారు ఎమ్పెరుమానార్లను ఏ విధముగా ఆరాధించవలెనో  ఆచరణలో చూపిరి.
  • మన పుర్వాచార్యులు వారి గ్రంథములలో శ్రీ వైష్ణవుడి నడవడికను గురించి చెప్పిన విధమునకు వారి జీవితము ఒక ఉదాహరణము. దీని గూర్చి శ్రీ సార స్వామి వారి ఈబుక్ శ్రీవైష్ణవ లక్షణములో చూడవచ్చు.  http://ponnadi.blogspot.in/p/srivaishnava-lakshanam.html.

మాముణుల తనియన్:

శ్రీశైలేశ దయా పాత్రమ్ ధీభక్త్యాది గుణార్ణవమ్
యతీంద్ర ప్రవణమ్ వన్దే రమ్య జామాతరమ్ మునిమ్

తాత్పర్యము: శ్రీ శైలాంశ సంభూతులై ‘తిరుమలై ఆళ్వార్’ అని ప్రసిద్ది చెందిన ‘తిరువాయ్మొళి  పిళ్ళై’ అను శ్రీశైలనాధుల దివ్య నిర్మల కరుణాపూరమునకు ఉత్తమ పాత్రభూతులును, ఙ్ఞాన భక్తి వైరాగ్యాది పరమ కల్యాణ గుణ పరిపూర్ణులగు శ్రీ భగవత్ రామానుజ సంయమింద్రుల దివ్యమంగళ చరణ పంకేరుహము లందు అత్యంత ప్రవణులై, తదేకాంతిక అత్యంతిక పరభక్తి యోగ నిష్ఠులై, ఏకలవ్యుని వలె వారికి అనన్యార్హ శిష్య భూతులైయుండు శ్రీ అళగియ మణవాళ మహాముణులకు సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందును త్రికరణ శుద్దిగా నమస్కరించుచూ సేవించుచున్నాను.

దీనితో మనము ఓరాణ్ వళి ఆచార్య పరంపర పూర్తి చేసుకొన్నాము. ఏ విషయమైననూ తీయనైన పద్దతిలో చెప్పమని చెప్పి ఉండెను. అందువలన మనము ఓరాణ్ వళి పరంపర కూడా మాముణుల చరితముతో పూర్తి చేసినాము, వీరి చరితము కంటే ఈ రెండు లోకములలో (నిత్య విభూతి మరియు లీలా విభూతి) ఏది కూడా ఇంత తీయగా లేదు.

మాముణుల తిరునక్షత్ర మహోత్సవమును ఆళ్వార్తిరునగరి, శ్రీరంగము, కాంచీపురం, శ్రీవిల్లిపుత్తూర్, తిరువహింద్రపురము, వానమామలై, తిరునారయణపురము మొదలగు అనేక దివ్యదేశములలో గొప్పగా జరుపుకుంటారు. మనమూ కూడా శ్రీ రంగనాధులకు ప్రియమైన ఆచార్యులు మరియు మనకునూ ఆచార్యులైన వీరి ఉత్సవములో శుద్దమైన మనసుతో సేవించుదాము.

తదుపరి సంచికలలో మనము మన సంప్రదాయములో గల గొప్ప ఆచార్యులను వైభవమును తెలుసుకుందాము. కాని ఇతర ఆచార్యుల అనుభవమును తెలుసుకొనుటకు ముందు,మామునిగళ్ తిరువడి నిలై అని వారిచే గుర్తించబడి మరియు మామునిగాళ్ యొక్క జీవిత శ్వాస అయిన పొన్నడిక్కాల్ జీయర్ వైభవమును తదుపరి సంచికలో చూద్దాము.

రఘు వంశీ రామానుజ దాసన్

మూలము: https://acharyas.koyil.org/index.php/2012/09/23/azhagiya-manavala-mamunigal-english/

పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

కున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల  గురించి తెలుసుకొందాం.

తిరునక్షత్రము: ఆశ్వయుజ మాసము, మూలా నక్షత్రము
అవతార స్థలము:  ఆళ్వార్ తిరునగరి
ఆచార్యులు : తిరువాయ్మొళి  ప్పిళ్ళై
శిష్యులు:  అష్ట దిగ్గజులు – పొన్నడిక్కాల్ జీయర్, కోయిల్ అణ్ణన్, పతంగి పరవస్తు పట్టర్పిరాన్ జీయర్, తిరువేంకట జీయర్, ఎఱుంబి అప్పా, ప్రతివాధి భయంకరమ్ అణ్ణన్, అప్పిళ్ళై, అప్పిళ్ళార్. నవ రత్నములు – సేనై ముదలియాండాన్ నాయనార్, శఠగోప దాసర్ (నాలూర్ శిఱ్ఱాత్తాన్), కందాడై పోరేఱ్ఱు నాయన్, యేట్టూర్ శింగరాచార్యులు, కందాడై అణ్ణప్పన్, కందాడై తిరుక్కోపురత్తు నాయనార్, కందాడై నారణప్పై, కందాడై తోళప్పరప్పై, కందాడై అళైత్తు వాళ్విత్త పెరుమాళ్. ఇతర తిరువంశములు, తిరుమాళిగలు, దివ్య దేశాల శిష్యులు.
పరమపదము చేరిన స్థలము: తిరువరంగము
శ్రీ సూక్తులు: శ్రీ దేవరాజ మంగళము, యతిరాజ వింశతి, ఉపదేశ రత్తిన మాలై, తిరువాయ్మొళి నూఱ్ఱన్దాది, ఆర్తి ప్రబంధము. వ్యాఖ్యానములు: ముముక్షుపడి, తత్వ త్రయము, శ్రీవచన భూషణము, ఆచార్య హృదయము, పెరియాళ్వార్ తిరుమొళి (పెరియ వాచాన్ పిళ్ళైల వ్యాఖ్యానము నుండి తప్పిన ఒక భాగము), రామానుశ నూఱ్ఱన్దాది. ప్రమాణ తిరట్టు (అన్ని శ్లోకములకు సంగ్రహముగా, శాస్త్ర వాఖ్యములకు ఒక ముఖ్యమైన గ్రంథము) ఈడు 36000 పడి, ఙ్ఞాన సారము, ప్రమేయ సారము, తత్వ త్రయము, శ్రీవచన భూషణము.

అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ ఆళ్వార్ తిరునగరిలో తిగళ కిడంతాన్ తిరుణావీరుడయ పిరాన్, శ్రీ రంగ నాచ్చియార్లకు ఆదిశేషుల అవతారముగా జన్మించారు. వీరికి  అళగియ మణవాళ మామునులు, సుందర జామాత్రు ముని, రమ్య జామాత్రు ముని, రమ్య జామాత్రు యోగి, వరవరముని, యతీంద్ర ప్రవణర్, కాంతోపయంత్రులు, రామానుజన్ పొన్నడి, సౌమ్య జామాత్రు యోగీంద్రర్, కోయిల్ శెల్వ మణవాళ మామునులు, మొదలైన అనేక తిరునామములు ఉన్నాయి. వీరికి గల బిరుదులు పెరియ జీయర్, వెళ్ళై జీయర్, విషద వాక్ శిఖామణి, పొయిల్లాద మణవాళ మాముని, మొదవి.

జీవిత చరిత్ర సంగ్రహముగా:

  • పెరియ పెరుమాళ్ళ అనుగ్రహంతో ఆదిశేషుల అంశావతారముగా ఆళ్వార్ తిరునగరిలో జన్మించారు.

మామునులు – ఆళ్వార్ తిరునగరి, తిరువడిలో అష్ట దిగ్గజములు 

  • వీరు అమ్మమ్మగారి ఊరైన శిక్కిల్ కిడారములో తమ తండ్రిగారి వద్ద సామాన్య శాస్త్రము మరియు వేద అధ్యాయనమును పూర్తిచేసిరి. చదువుతున్న కాలములోనే వీరి వివాహము కూడా అయినది.
  • తిరువాయ్మొళి పిళ్ళైల వైభవమును విన్నవారై, ఆళ్వార్ తిరునగరికి తిరిగి వచ్చి వారిని ఆశ్రయించిరి. మనము గత సంచికలో చూసి ఉన్నాము.
  • వారి ధర్మ పత్ని ఒక బాలునికి జన్మనివ్వగా వారు తిరువాయ్మొళి పిళ్ళైని సరియగు నామమును సూచించమని అభ్యర్తించిరి. తిరువాయ్మొళి పిళ్ళై ఈ విధముగా చెప్పిరి, రామానుజన్ 108 మార్లు చెప్పడము వలన (రామానుశ నూఱ్ఱందాదిలో), ఆ పేరు చాలా ఉత్తమమైనది, దానిని ఆధారముగా చేసుకొని వారి కుమారులకు “ఎమ్మైయన్ ఇరామానుశన్” అనే నామమును పెట్టిరి.
  • తిరువాయ్మొళి పిళ్ళై పరమపదమును చేరిన తదుపరి, వీరు దరిశన ప్రవర్తకరులుగా ఉండిరి.
  • వీరు అరుళిచ్చెయల్ నందు ప్రావీణ్యులు, ముఖ్యముగా తిరువాయ్మొళి మరియు ఈడు 36000 పడి వ్యాఖ్యానములందు. ఈడు వ్యాఖ్యానమునకు ఆధారముగా ఉండే అన్ని ప్రమాణములను సేకరించి గ్రంథికరించిరి.
  • వీరి కీర్తిని గురించి విని, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లకు అళగియ వరదర్ (వానమామలై నుండి) మొదటి శిష్యులుగా మారిరి మరియు తమ ఆచార్యులకు నిరంతరమైన సేవను చేయుటకు వెంటనే సన్యాసాశ్రమమును స్వీకరించిరి. వానమామలై జీయర్ (స్వస్థలము కావడముచే) మరియు పొన్నడిక్కాల్ జీయర్ (కారణము నాయనారులకు మొదటి శిష్యులు మరియు ఎంతో మంది ఈ దారిలో నడుచుటకు పునాది వేసిరి – పొన్ అడిక్కాల్ అనగా బంగారు పునాది) అని ప్రసిద్ధికి ఎక్కిరి.
  • ఆచార్యుల నియమనమును గుర్తుచేసుకొని మన సంప్రదాయమును విస్తరించుటకు శ్రీరంగమునకు వెళ్ళుటకు, వారు ఆళ్వారుల వద్దకు వెళ్ళి వారి అనుఙ్ఞను తీసుకొని శ్రీరంగమునకు బయలుదేరిరి.
  • శ్రీరంగమునకు వెళ్ళే దారిలో, శ్రీవిల్లిపుత్తూర్ ఆండాళ్ రంగమన్నార్లకు మరియు తిరుమాలిరుంజోలై అళగర్లకు మంగళాశాసనములు చేసిరి.
  • శ్రీరంగమునకు చేరిన పిదప, కావేరి ఒడ్డున నిత్యకర్మానుష్టానములను పూర్తి చేసుకొనిరి. శ్రీరంగములోని శ్రీవైష్ణవులందరూ బయటకి వచ్చి వారికి స్వాగతమును పలికిరి, స్థానిక శ్రీవైష్ణవుల పురుషకారముచే ఎమ్పెరుమానార్లకు, నమ్మాళ్వార్, పెరియ పిరాట్టి, సేనై ముదలియార్, పెరియ పెరుమాళ్ మరియు నమ్పెరుమాళ్ళకు ఉభయ నాచ్చియార్లకు వరుసగా మంగళాశాసనమును చేసిరి. పెరుమాళ్ ఎమ్పెరుమానార్లకు స్వాగతమును పలికిన విధముగా వీరికి పలికి ప్రత్యేక ప్రసాదములను మరియు శ్రీ శఠగోపమును ఇచ్చిరి.
  • తదుపరి పిళ్ళై లోకాచార్యుల తిరుమాళిగైకి వెళ్ళి,  పిళ్ళై లోకాచార్యులు మరియు వారి సహోదరుడైన అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లను మన సంప్రదాయమునకు చేసిన కైంకర్యములను కీర్తించిరి.
  • వారు కొంత కాలము శ్రీరంగములో నివసించిన తదుపరి ఒకరోజు నమ్పెరుమాళ్ వారిని శ్రీరంగములో నిత్య వాసమును (శాశ్వతముగా) చేయమని మరియు మన సంప్రదాయములోని లోతైన అర్థములను ఉపదేశించమనిరి. దానికి వారు సంతోషముతో అంగీకరించి మహమ్మదీయుల దండ యాత్ర తదుపరి మనము కోల్పోయిన గ్రంథములను తిరిగి సేకరించసాగిరి.
  • ఒకసారి పొన్నడిక్కాల్ జీయర్ ఉత్తమ నంబి సేవను గూర్చి వారికి ఫిర్యాదు చేయగా, వారు ఎమ్పెరుమానుల కైంకర్యమును సరిగా చేయు విధముగా సంస్కరించమని జీయరులను ఆఙ్ఞాపించిరి.
  • అప్పుడు వారు తిరువేంగడమును దర్శించాలనే కోరికతో పొన్నడిక్కాల్ జీయర్తో కూడి బయలుదేరిరి. దారిలో, తిరుక్కోవలూర్ మరియు తిరుక్కడిగై దివ్య దేశములను మంగళాశాసనము చేసిరి.
  • తిరుమలైలో, పెరియ కేళ్వి అప్పన్ జీయర్ (ఎమ్పెరుమానారులచే నియమింపబడినవారు)  స్వప్నములో ఈ విధముగా చూసిరి, ఒక శ్రీవైష్ణవడిని (గృహస్తులు) పెరియ పెరుమాళ్ళ వలె  పడుకొని ఉండగా వారి యొక్క శ్రీ చరణముల వద్ద ఒక సన్యాసి నిలబడి ఉండిరి. ఆ స్వప్నములోనే వారు అక్కడ నుండి వెళ్ళే వారిని వారు ఎవరు అని అడుగగా, వారు ఈ విధముగా చెప్పెను “తిరువాయ్మొళి ఈట్టు పెరుక్కర్ అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ మరియు వారి యొక్క ప్రాణ సుకృత్ (జీవితము యొక్క శ్వాస) మరియు శిష్యులైన పొన్నడిక్కాల్ జీయర్”. మెళుకువ రాగా మంచి శకునముతో వచ్చిన స్వప్నమును గురించి ఆలోచించగా వారిరువురు త్వరలో తిరుమలై వస్తున్నారని తెలుసుకొనిరి. నాయనార్ తిరుపతికి చేరి, తిరువేంకట మల, గోవింద రాజులు, నరసింహ (కొండ క్రింద) లను ఆరాధించి చివరగా తిరుమలైకి చేరిరి. పెరియ కేల్వి అప్పన్ జీయర్ నాయనార్ మరియు పొన్నడిక్కాల్ జీయర్లకు ఘనముగా స్వాగతము పలికి వారిని తిరువేంకటముడైయాన్ వద్దకు మంగళాశాసనము కొరకై తీసుకువెళ్ళిరి. తిరువేంకటముడైయాన్ వారిద్దరిని చూసి సంతోషముతో, తన యొక్క ప్రసాదమును మరియు శ్రీ శఠగోపమును ఇచ్చిరి. పెరుమాళ్ళ వద్ద నుండి వారు సెలవు తీసుకొనిరి.
  • వారు కాంచీపురమునకు చేరి దేవ పెరుమాళ్ళకు మంగళాశాసనమును చేసిరి. దేవ పెరుమాళ్ ఎమ్పెరుమానారుల వలే వీరు కూడా అని చెప్పి వారి యొక్క ప్రసాదమును మరియు శ్రీ శఠగోపమును ఇచ్చిరి.

మాముణులు – కాంచీపురము

  • వారు శ్రీపెరుంబుదూర్ చేరుకొని పూర్తిగా ఎమ్పెరుమానార్ల అనుభవములో మునిగి మంగళాశాసనమును చేసిరి.
  • వారు కాంచీపురమునకు తిరిగి వచ్చి శ్రీ భాష్యమును కిడాంబి నాయనార్ (కిడాంబి ఆచాన్ వంశస్తులు) వద్ద సేవించసాగిరి. అప్పుడు శ్రీవైష్ణవులు కొన్ని విషయములలో తర్కము చేయుటకు వచ్చిరి, వారు మొదట వారి ఆచార్యులు భగవత్ విషయములలోనే ఈడుబడమని ఆదేశించటము చేత నిరాకరించిరి, కాని వారి అనుచరులు నచ్చ చెప్పడముతో, వాటికి సరియైన వివరణములతో సమాధానములు ఇవ్వగా వాదమునకు వచ్చినవారు వారి యొక్క శ్రీ చరణములని ఆశ్రయించి వారిని కొనియాడిరి.
  • కిడాంబి నాయనార్ అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ ఙ్ఞానమును చూసి ఆశ్చర్యపడి వారి యొక్క నిజ స్వరూపమును చూపమని అభ్యర్తించిరి. అప్పడికి కిడాంబి నాయనార్ శ్రీ భాష్యమును ఉపదేశించడము వలన వారు ఆచార్య స్థానములో ఉండడము వలన, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ తమ యొక్క ఆదిశేష స్వరూపమును చూపించిరి. కిడాంబి నాయనార్ ఆనందభరితులై అప్పడి నుండి వారితో గొప్ప అనుబందమును కలిగి ఉండిరి. చివరకు శ్రీభాష్యము కాలక్షేపమును ముగించుకొని, శలవు తీసుకొని శ్రీరంగమునకు బయలుదేరిరి.
  • పెరియ పెరుమాళ్ వారు తిరిగి రావడము చూసి సంతోషపడిరి మరియు ఇంకా ఏ యాత్రలు చేయకుండా శ్రీరంగములోనే ఉండవలెనని చెప్పిరి.
  • ఆ సమయములో, వారి యొక్క బంధువులు ఆశౌచమును గురించి సమాచారమును తెలుపగా దాని వలన తన యొక్క కైంకర్యమునకు ఆటంకముగా భావించి, సన్యాసాశ్రమమును శఠగోప జీయర్ (తిరువాయ్మొళి పిళ్ళై శిష్యులు మరియు ఆళ్వార్ తిరునగరిలో సహాధ్యాయి) వద్ద స్వీకరించి వెంటనే పెరియ పెరుమాళ్ళ వద్దకి వెళ్ళి ఈ విషయము గురించి చెప్పగా, పెరియ పెరుమాళ్ ఆహ్వానించి అదే  తిరునామముతో (తన యొక్క భవిష్యద్ ఆచార్యుని పేరు తన యొక్క దివ్యనామముగా పెట్టుకోవలెనని తాను ఆశించినందుకు) ఉండమని ఆఙ్ఞాపించిరి. వారికి పల్లవ రాయ మఠమును ఇచ్చి అక్కడే ఉంటూ కాలక్షేపములను అనుగ్రహించ వలెననిరి. అందువలన అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ అళగియ మణవాళ మాముణులుగా మారిరి. ఉత్తమ నంబి శిష్యులుగా ఉన్న అందరూ శ్రీవైష్ణవులు నంబితో పాటు వారి మఠమునకు వెళ్ళి చాలా సంతోషముతో “మణవాళ మామునియే ఇన్నుమొరు నూఱ్ఱాండిరుం” అని పాడిరి.
  • వారు తన శిష్యులందరినీ పొన్నడిక్కాల్ జీయర్ల పర్యవేక్షణలో మఠమును పూర్తిగా బాగు చేయమని చెప్పిరి. పిళ్ళై లోకాచార్యుల తిరుమాళిగై నుండి తెచ్చిన ఇసుకతో ఒక అందమైన మండపమును నిర్మించి దానికి తిరుమలై ఆళ్వార్ అనే నామమును పెట్టి క్రమముగా అక్కడ కాలక్షేపములను అనుగ్రహించేవారు. వారు తమ శిష్యులకు మరియు అభిమానులకు రోజు తిరువాయ్మొళి (ఈడు) మరియు ఇతర ప్రబంధములు, ఎమ్పెరుమానార్ల కీర్తిని, శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రములపై ప్రవచనములు అనుగ్రహించేవారు.
  • వారి యొక్క కీర్తి అగ్ని శిఖలవలె అన్నిదిశలా వ్యాపించి ఎంతో మంది శ్రీవైష్ణవులు మాముణులను ఆశ్రయించిరి. తిరుమంజనం అప్పా (పెరియ పెరుమాళ్ళకి నిత్య కైంకర్యపరర్), వారి కుమార్తె (ఆయ్చియార్) మరియు పట్టర్ పిరాన్ జీయర్ వారికి శిష్యులుగా మారిరి.
  • శింగరైయర్ అనే ఒక స్వామి  వళ్ళువ రాజేంద్రం (దగ్గర గ్రామము) నుండి రోజు కొన్ని కూరగాయలు మాముణుల మఠమునకు పంపేవారు, ఎమ్పెరుమాన్ వారి కైంకర్యమును చూసి సంతోషము చెంది అతనికి స్వప్నములో కనబడి “మాముణులు ఆదిశేషుల అవతారము, మీరు వెళ్ళి మాముణులను ఆశ్రయించండి” అని చెప్పిరి. అందువలన వారు శ్రీరంగమునకు వచ్చి (కోయిల్) కందాడై అణ్ణన్ తిరుమాళిగై వద్ద ఉండి ఆ సంఘటనను గురించి అణ్ణన్ వారితో చెప్పిరి. అణ్ణన్ దీనిని గురించి ఆలోచిస్తూ పడుకొనగా వారి స్వప్నంలో ఎమ్పెరుమానార్ మరియు ముదలియాండాన్లు కనిపించి, ఎమ్పెరుమానార్ ఈ విధముగా చెప్పెను మాముణులు ఎవరో కాదు నేనే. ఆ స్వప్నములో, ముదలియాండాన్ కోయిల్ అణ్ణన్ ను (మరియు ఉత్తమ నంబి) మాముణులను ఆశ్రయించమని ఆఙ్ఞాపించిరి. నిద్ర నుండి లేచిన తదుపరి, కోయిల్ అణ్ణన్ తన సహోదరులతో కూడి మాముణుల మఠమునకు వెళ్ళి, పొన్నడిక్కాల్ జీయర్ పురుషకారముతో (సహాయముతో) వారే స్వయముగా మాముణులకు అప్పగించెను. మాముణులు సంతోషముతో అంగీకరించి వారికి పంచ సంస్కారములను అనుగ్రహించెను.
  • అప్పుడు ఆయ్చియార్ (తిరుమంజనం అప్పా కుమార్తె) కొడుకు అప్పాచియారణ్ణ మాముణులను ఆశ్రయించ కోరిరి. మాముణులు అది విని చాలా సంతోషపడిరి, వారు తమ యొక్క జీవితమునకు శ్వాసగా మరియు ఆప్తులుగా భావించే పొన్నడిక్కాల్ జీయర్ను పిలచి, తమ యొక్క సింహాసనమును సమర్పించి, తమ యొక్క తిరువాళి (శంఖము) మరియు తిరు చక్రమును ఇచ్చి వారిని పంచ సంస్కారము చేయవలసినదిగా ఆదేశించిరి. అప్పుడు పొన్నడిక్కాల్ జీయర్ మొదట నిరాకరించినా, వేరే ప్రత్యాంన్యాయము లేకపోవుటచే వారి యొక్క ఆచార్యుల తిరువుళ్ళము ప్రకారము అప్పాచియారణ్ణాలకు పంచ సంస్కారములను అనుగ్రహించిరి.
  • ఎమ్మైయన్ ఇరామానుశన్ (పూర్వాశ్రమములో మాముణుల తిరుకుమారులు) ఆళ్వార్ తిరునగరిలో నివసించుచుండిరి, వివాహము చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిరి – అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ (మాముణులకు గల సంబంధము మరియు అటు పిమ్మట చేసిన కైంకర్యమునకుగాను జీయర్ నాయనార్ అని పిలుచుదురు) మరియు పెరియాళ్వార్ ఐయన్.
  • మాముణులు నమ్మాళ్వార్లకు మంగళాశాసనము చేయుటకు వెళ్ళదలచి పెరియ పెరుమాళ్ళ అనుఙ్ఞ తీసుకొని బయలుదేరిరి. వారు ఆళ్వార్తిరునగరి చేరిన పిదప, తామర భరణి నది ఒడ్డున వారి యొక్క నిత్య కర్మానుష్టానములను పూర్తి చేసుకొని, భవిష్యదాచార్యులు (ఎమ్పెరుమానార్), తిరువాయ్మొళి పిళ్ళై మరియు వారి తిరువారాధన పెరుమాళ్ ఇనవాయర్ తలైవన్, నమ్మాళ్వార్ మరియు పొలిన్దు నిన్ఱ పిరాన్లకు మంగళాశాసనము చేసిరి.
  • వారికి ఆచార్య హృదయములోని ఒక చూర్ణికై గురించి సందేహమురాగా, తమ ఆచార్యులైన తిరువాయ్మొళి పిళ్ళైల స-బ్రహ్మచారి (సహాధ్యాయి) అయిన తిరునారాయణపురతు ఆయిని కలుసుకొనుటకు నిశ్చయించుకొనిరి. వారు ప్రయాణము మొదలు పెట్టి ఆళ్వార్తిరునగరిని దాటి బయటకు వెళ్ళగా, అక్కడ ఆయి కూడా తిరునారాయణ పురము నుండి బయలుదేరి మాముణులను కలుసుకొనుటకు వచ్చిరి. ఇద్దరు సంతోషముతో ఆలింగనము చేసుకొని  ఒకరినొకరు స్తుతించుకొనిరి. ఆ సమయములో మాముణులు ఆయి కీర్తీని గురించి ఒక తనియన్ వ్రాసిరి, బదులుగా ఆయి ఒక పాశురమును వ్రాసిరి, అందులో ఈ విధముగా అడిగెను మాముణులు ఎమ్పెరుమానారా లేక నమ్మాళ్వారా లేక ఎమ్పెరుమానులా. కొద్ది కాలమునకు ఆయి  తిరునారాయణ పురమునకు తిరిగి వెళ్ళగా, మాముణులు ఆళ్వార్ తిరునగరిలోనే ఉండిరి.
  • కొందరు ప్రజలు మాముణుల కీర్తిని చూడలేక, వారి యొక్క మఠమునకు నిప్పు పెట్టిరి. కాని మాముణులు తమ యొక్క పాము అవతారమును ధరించి మఠము బయటకు వచ్చి తన అవతారమును తిరిగి ధరించి బయట నుండి చూసే శ్రీవైష్ణవుల మధ్యలో నిలబడిరి. అప్పుడు రాజు ఆ దోషులను శిక్షించదలచగా మాముణులు వారిని వదిలి వేయమని చెప్పగా వారి కారుణ్యమును చూసి శ్రీ చరణములను ఆశ్రయించిరి. ఆ దేశపు రాజు మాముణుల కీర్తీని చూసి వారి వద్ద పంచ సంస్కారములను పొంది ఆళ్వార్ తిరునగరి మరియు తిరుక్కురుంగుడి దివ్య దేశములలో ఎన్నో  కైంకర్యములను చేసిరి.
  • మాముణులు తిరిగి శ్రీరంగమునకు చేరి వారి కైంకర్యములను చేయుచుండిరి. ఆ సమయములో ఎఱుంబి అప్పా అను వారు ఎఱుంబి అనే గ్రామము నుండి మాముణుల గురించి విని అక్కడకు వచ్చిరి. తదుపరి, మాముణులు ప్రసాదమును తీసుకోకుండ వెళ్ళెను. వారి గ్రామమునకు వెళ్ళిన తరువాత, వారి ఎమ్పెరుమాన్ చక్రవర్తి తిరుమగనుల సన్నిధి ద్వారమును తీయుటకు ప్రయత్నించగా, అవి తెరుచుకోలేదు. ఎమ్పెరుమాన్ ఈ విధముగా మీరు మాముణుల శ్రీ చరణముల వద్ద అపచారమును చేసిరి, వారు ఆదిశేషుల అవతారమే అని చెప్పి వారిని మాముణులని ఆశ్రయించమని, కైంకర్యమును చేసి వారి యొక్క ప్రసాదమును స్వీకరరించుతేనే – ఆ ద్వారములు తెరుచుకోబడును అని చెప్పిరి. ఎఱుంబి అప్పా తిరిగి శ్రీరంగమును చేరి, తనను మాముణులకు సమర్పించుకునెను. వారు ఒక అద్భుతమైన దిన చర్య అనే ప్రబంధమును వ్రాసిరి, అవి 2 భాగములు – పూర్వ దినచర్య (మాముణుల ఉదయపు ) మరియు ఉత్తర దినచర్య (మాముణుల సాయంత్రపు).
  • జీయర్ కందాడై నాయన్ వారిని అతి చిన్న వయసులో వారి అమోఘమైన ఙ్ఞానమునకు మెచ్చుకొనిరి.
  • అప్పిళ్ళై మరియు అప్పిళ్ళార్ పొన్నడిక్కాల్ జీయర్ పురుషకారముచే  మాముణులను ఆశ్రయించిరి. ఎఱుంబి అప్పా మాముణుల వద్ద ఆఙ్ఞను తీసుకొని తిరిగి తన గ్రామమునకు మాముణుల కీర్తిని విస్తరించుటకు వెళ్ళెను.
  • ఉత్తమ నంబి అను ఒక్క ప్రముఖ శ్రీ వైష్ణవులు పెరియ పెరుమాళ్ళకు ఆంతరంగికముగా ఆలవట్ట కైంకర్యమును చేయుచుండిరి. ఆ సమయములో మాణవాళ మాముణులు పెరియ పెరుమాళ్ళకు మంగళాశాసనము చేయుటకు అక్కడికి వచ్చారు. ఉత్తమ నంబి తనను చూసి వెంటనే అక్కడి నుండి బయలుదేరుమని చెప్పెను, అజ్ఞను శిరాసావహిస్తూ అక్కడి నుండి నిష్క్రమించిరి. అలసట చెంది కొంచం సేపు సేద తీర్చుకోరుటకు కన్నులు ఆర్పగా పెరియ పెరుమాళ్ నంబికి దర్శన మిచ్చి, ఆదిశేషుని వైపు చూపుతూ, మాముణులు మరి ఎవరో కాదు ఆదిశేష అవతారమని చెప్పిరి. మేలుకొని, మాముణుల మఠమునకు వెళ్ళి వారిని అపరాధ క్షమాపనము అడిగి, అటు పిమ్మట ప్రేమతో వారిని సేవించుతూ ఉండి పోయిరి.
  • శఠకోప కొఱ్ఱి అను ఒక శ్రీ వైష్ణవ అమ్మాయి ఆయ్చియర్ వద్ద అరుళిచ్చెయళ్ నేర్చుకుంటూ ఉంటిరి. మధ్యాన సమయమున మాముణులు అంతరంగములో ఏకాంతముగా పవళించునప్పుడు వారిని ఆ గదిలోని ఒక చిన్న రంధ్రములందు చూడగా వారి స్వరూపముతో (ఆదిశేషుని రూపము) దర్శించినది. బయట శబ్ధములకు మేలుకొని మాముణులు ఏమైనదో విచారించగా తాను చూసిన దానిని విన్నవించినది. అది విని మాముణులు చిరుమంద హాసముతో జరిగిన వృతాంతమును ఒక రహస్యముగా ఉంచమని చెప్పిరి.
  • రహస్య గ్రంథములకు వ్యాఖ్యానములు వ్రాయాలని నిర్ణయించు కొనిరి. మొదలుగా ముముక్షుపడి, తత్వ త్రయం, శ్రీ వచన భూషణములకు వేదం, వేదాంతం, ఇతిహాసం, పురాణము, దివ్య ప్రబంధము మొదలను గ్రంథముల నుండి విశేష అర్థముల ఆధారముగా వ్రాసిరి. ఆ తరువాత రామానుశ నూఱ్ఱందాది, జ్ఞాన సారం మరియు చరమ ఉపాయ నిష్ఠ తెలిపే (ఆచార్యులే మనకు సర్వస్వం) ప్రమేయ సారం గ్రంథాలకు వ్యాఖ్యానములు వ్రాసిరి.
  • పూర్వాచార్యులు ఇచ్చిన శ్రీ సూక్తులను భద్ర పరచవలెనని శ్రీ వైష్ణవులు కోరగా, ఆళ్వారుల యొక్క తిరు నక్షత్రములను, వారు అవతరించిన దివ్య దేశములు మరియు వారి గొప్పతనమును, ఎమ్పెరుమానార్ల అపార కారుణ్యమును, తిరువాయ్మొళి వ్యాఖ్యానము దాని ఒక్క అవతార క్రమము మరియు ఈడు లోకములో ప్రచారము అయిన క్రమమును, పిళ్ళై లోకచార్యుల అవతార విశేషము మరియు వారి మహత్తరమైన శ్రీ వచన భూషణమును తెలిపి, తిరువాయ్మొళి యొక్క సారార్థం శ్రీ వచన భూషణమని నిరూపించి, చివరిలో దాని అర్థ విశేషములు విశదముగా వివరించిరి.
  • కొందరు మాయవాదులు వారితో వాదనకు వచ్చిరి. వారు ఎప్పటి వలె వివాదము చేయ కూడదు అనే వారి నియమము ప్రకారము వాదన చేయుటకు అంగీకరించ లేదు. వారి శిష్యులైన వేదలప్పైని వారితో వాదన చేయమని ఆదేశించిరి. అజ్ఞానుసారముగా వారితో వాదన చేసి జయించిరి వేదలప్పై. కాని ఆ సంఘటన జరిగిన కొన్ని రోజులకే వారి స్వస్థలానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొనిరి.
  • అదే సమయములో ప్రతివాధి భయంకరం అణ్ణా, కాంచిపుర వాస్తవ్యులు మహాపండితులు అయినవారు తిరువేంకట ముడైయాన్ మీద అనుబంధము వల్ల తిరుమలైలో తీర్థ కైంకర్యము చేయుచుండిరి. శ్రీ రంగము నుండి ఒక శ్రీ వైష్ణవుడు తిరుమలైలో తీర్థ కైంకర్యము చేయుచున్న అణ్ణాని కలిసి, వారికి మాముణుల గొప్పతనమును వివరించిరి. వారి వైభవము విన్న అణ్ణా చాల సంతోషించి, వారిని కలవాలనే కోరిక పెరిగి పోయింది. వారి గురించి ఆలోచిస్తూ, తీర్థ పరిమళము (లవంగము/ఈలైచి) ను తీర్థములో చేర్చుటకు మరిచి దానిని అర్చకర్లకు ఇచ్చారు. ఆ తరువాత తీర్థ పరిమళము చేర్చలేదని గుర్తు తెచ్చుకొని తీర్థ పరిమళముతో అర్చకుల వెనుక పరుగు తీసిరి కాని అర్చకులు ముందు కన్నా ఇప్పుడు తీర్థం సువాసనను వెదజల్లుతున్నదని చెప్పిరి. అది విన్న అణ్ణా మాముణుల వైభవము ప్రాశస్త్యము ఎటువంటిదంటే వారి గొప్పతనము విన్న మాత్రమునే తీర్థము సువాసనమైయము అయినది. అట్టి మాముణుల దర్శనము చేసుకొనటకు శ్రీ రంగమునుకు చేరిరి. మాముణుల మఠమునకు చేరగా అప్పుడు వారు తిరువాయ్మొళి (4. 10) లో “ఒన్నమ్ దేవుం” పదిగమును వివరించుచుండిరి. ఆ పదిగము ఏమ్పెరుమాన్ యొక్క పరత్వమును స్థాపించును. మాముణులు అతి సులభముగా ఎన్నో శాస్త్రముల నుండి దృష్టాంతము ఇస్తూ వివరించ సాగారు. అది గమనించిన అణ్ణా వారి జ్ఞానమునకు మరియు వారి ప్రవచన సామర్థ్యమునకు ఆశ్చర్య చకితులైరి. మాముణులు 3వ పాశురము దగ్గర ఆగి పోయిరి. వారికి ఆళ్వార్ సంబంధం ఉన్నప్పుడే ఈ విశేష అర్థములు సేవించుటకు యోగ్యత కలుగునని చెప్పిరి (ఓరాణ్ వళి ఆచార్య పరంపర ప్రకారం). అటు పిమ్మట పెరియ పెరుమాళ్ళకు మంగళాశాసనము చేయుటకు బయలుదేరిరి. పెరియ పెరుమాళ్ అర్చక ముఖేన విలక్షణ సంబంధము పొందుటకు మాముణులను శరణు వేడమని చెప్పిరి. పొన్నడిక్కాల్ జీయర్ పురుషకారముచే మాముణుల చరణ సంబంధము పొంది అక్కడే కొంత కాలము నివసించిరి.
  • మాముణులు తిరుమలై యాత్ర చేయుటకు బయలుదేరిరి. దారిన కాంచీపురం దేవ పెరుమాళ్ళకు మంగళాశాసనము చేసి అక్కడ కొన్ని రోజులు నివసించి, అక్కడి శ్రీ వైష్ణవులను సంస్కరించిరి. అప్పాచియారన్నను తన ప్రతినిధిగా అక్కడే నివసించమని నియమించిరి. ఆ తరువాత తిరుకడిగై, ఎరుంబి, తిరుపుట్ట్కుళి మొదలగు దివ్య దేశములను సేవించుకుంటూ తిరుమలై చేరిరి. అక్కడ మంగళాశాసనము చేసి శిరియ కేల్వి అప్పన్ జీయర్ ను పెరియ కేల్వి అప్పన్ (ఎమ్పెరుమానర్లచే స్వయముగా నియమింపబడ్డ) జీయర్ల  కైంకర్యముకు సహకారిగా నియమించిరి. తిరిగి వచ్చునప్పుడు, వారు తిరు ఎవ్వుళ్ విజయ రాఘవన్, తిరువల్లికేని వేంకట కృష్ణన మొదలగు దివ్య దేశములను మంగళాశాసనము చేసిరి. మధురాంతకము చేరి అక్కడ పెరియ నంబి రామానుజర్లకు పంచ సంస్కారం చేసిన ప్రదేశమును సేవించిరి. అటు పిమ్మట తిరువాలి తిరునగరి చేరి అక్కడ తిరుమంగై ఆళ్వార్ ను, వడివళగు పాశురమును సమర్పించి, ఆ ప్రదేశములో ఉన్న పెరుమాళ్ళందరిని మంగళాశాసనము చేసిరి. ఆ తరువాత తిరుకణ్ణపురం చేరి సర్వాంగ సుందరమైన శౌరిరాజ భగవానుని అనుభవించి, అక్కడ తిరుమంగై ఆళ్వార్లకు అక్కడ తిరుమేని సమర్పించిరి. ఇంకను మరి కొన్ని దివ్య దేశముల యాత్ర చేసి, కడకు శ్రీ రంగము చేరి అక్కడ నివసించిరి.
  • ముందుగా ఆదేశించిన విధముగా అప్పచియారన్నను కాంచిపురమునకు వెళ్ళమని ఆదేశించిరి. అధ్బుతమైన ఆ గోష్టిని వదిలి వెళ్ళుటకు అప్పచియారన్న చాల విచారం పడ సాగిరి. అది చూసిన మాముణులు తన మర చంబు అయిన రామానుజముతో తన యొక్క రెండు తిరుమేనులను చేయమని ఆదేశించెను. దీనినే పొన్నడిక్కాల్ పూజించేవారు. రెండు తిరుమేనులలో ఒకటిని పొన్నడిక్కాల్ జీయర్ కు ఇంకొకటిని అణ్ణాకి సమర్పించారు. (వీటిని ఇప్పుడు కూడా వానామామలై మఠము, వానామామలైలోను మరియు శింగ పెరుమాళ్ కోవెలలోని ముదలియాండాల్ తిరుమాళిగైలోనూ సేవించవచ్చు) వీరు తన “ఎన్నై తీమనం కేడుతాయ్” తిరువారాధనము ఎమ్పెరుమాన్ ను అణ్ణాకు ఇచ్చిరి (శింగ పెరుమాళ్ కోవెలలో ముదలియాండాన్ తిరుమాళిగైలోను సేవించగలము).
  • ప్రతివాది భయంకర్ అన్నాను శ్రీ భాష్య ఆచార్యులుగా, కందాడై అణ్ణన్, శుద్ధ సత్వం అణ్ణన్ వారిని భగవత్ విషయ ఆచార్యులుగా నియమించిరి. కందాడై నాయన్ వారిని ముప్పదు ఆరాయిరప్పడికి అరుమ్పదం రాయమని ఆదేశించిరి.
  • మాముణుల ముఖేన ఎడ తెరుపు లేకుండా భగవత్ విషయం వినుటకు పెరియ పెరుమాళ్ యొక్క ఆశ పెరిగిపోయింది. తన యొక్క పరిపూర్ణ ఇచ్చతో వారిని తన గురువుగా ఎంచుకోవాలని అనుకొందురు. ఒకనాడు పవిత్రోత్సవ శాత్తుమురై అప్పుడు, నమ్పెరుమాళ్ తిరు పవిత్రోత్సవ మండపమునకు చేరిరి. వారిని మంగళాశాసనము చేయుటకు మాముణులు అక్కడకు చేరిరి. కైంకర్యపరులు, ఆచార్య పురుషులు, జీయర్లు, శ్రీ వైష్ణవుల సమక్షములో మాముణులను నమ్మాళ్వార్ల తిరువాయ్మొళి కాలక్షేపమును ఈడు ముప్పదు ఆరాయిర పడి వ్యాఖ్యనముతో చేయమని ఆదేశించెను. ఎటువంటి అవరోధాలు లేకుండా కాలక్షేపము పూర్తి అయ్యేం వరకు నిరంతరాయంగా కొనసాగించాలని ఆదేశించిరి. మాముణులు తనను ఎమ్పెరుమాన్ ఈ కైంకర్యము చేయుటకు ఎంచుకునందుకు వినతితో కృతజ్ఞ చేసి, అంగీకరించిరి.
  • ఆ మరుసటి రోజున ఉభయ నాచ్చిమార్లతో కూడిన నమ్పెరుమళ్, తిరు అనంతాళ్వాన్ , పెరియ తిరువడి, సేనై ముదలియార్, ఆళ్వార్లు, ఆచార్యులు పెరియ తిరుమండపము (పెరియ పెరుమాళ్ సన్నిధి ద్వారా పాలకుల ముందు) తన కాలక్షేపము కాగా ఎదురుచూస్తూ ఉండిరి. ఇంతటి వారు తన కోసం ఎదురు చూచుటకు చాలా దీవించబడిరని ముప్పదు ఆరాయిరపడి వ్యాఖ్యానమును (6000 పడి, 9000 పడి, 12000 పడి మరియు 24000 పడి) వ్యాఖ్యానములతో కాలక్షేపము ఆరంభించిరి. వారు వాటిలోని ఘూడమైన అర్థములను శృతి, శ్రీ భాష్యం, శృత ప్రకాషిక, శ్రీ గీత భాష్యం, శ్రీ పాంచరాత్రం, శ్రీ రామాయణం, శ్రీ విష్ణు పురాణము మొదలగు గ్రంథముల ఆధారములతో వివరించిరి. వాటిలోని ప్రతి పదార్థములను, స్వాపదేశార్థములను మొదలగు చెప్పిరి. ఇలా పది నెలలు గడిచి పోయినవి. చివరికి శాత్తుముర రోజు రానే వచ్చినది, అది ఆణి తిరుమూల నక్షత్రం. శాత్తుముర అయిన తరువాత, నమ్పెరుమాళ్ అరంగనాయకమ్ అనే ఒక చిన్న బాలుని వలె ఇతరులు అడ్డు పడ్డ గోష్టి ముందుకు వచ్చిరి. అంజలి ఘటిస్తూ, “శ్రీ శైలేశ దయాపాత్రం” పఠించిరి, ఇంకా చెప్పమనిన “ధీ భక్త్యాది గుణార్నవమ్” అని మరి కాస్త చెప్పమనిన “యతీంద్ర ప్రవణం వందే రమ్యజా మాతరం మునిం” అని చెప్పి పరుగు తీసిరి. శిష్యులు ఆ శ్లోకమును మఱ్ఱి ఆకుపై రాసిరి. ఆ బాలుని గోష్టి సమక్షమున తీసుకుని వచ్చి చదవమని చెప్పగా, ఆ బాలుడు ఏమియును చదువలేక పారి పోయెను. నమ్పెరుమాళ్ స్వయముగా తన ఆచార్యులకు సమర్పించుటకు వచ్చిరని అందరికి అర్థము అయినది. ఎమ్పెరుమాన్ ఈ తనియన్ అన్ని దివ్య దేశములకు ప్రచారం చేయుదురు, అన్ని చోట్ల ఈ తనియన్ ఒక అగ్ని జ్వాల వలె వ్యాపించినది. అదే సమయములో, శ్రీ వైష్ణవుల ఆజ్ఞ మేరకు, అప్పిళ్ళై మాముణుల కీర్తిని చాటేట్టు వాళి తిరునామం వ్రాసిరి.

  • తిరువేంకటముడైయాన్ మరియు తిరుమలిరుంజోలై అళగర్ కూడా ఈ తనియన్ను అరుళిచ్చెయళ్ ముందు మరియు చివరిగా అనుసంధానం చేయవలెనని ఆదేశించారు. బద్రికాశ్రమము మరియు ఇతర దివ్య దేశములకు మాముణులు కీర్తిని ప్రకాశించుటకు ఎమ్పెరుమాన్ యొక్క నియమనము లభించినది. మాముణులు వడ నాడు దివ్య దేశములు మంగళాశాసనము చేయుటకు తలిచేదారు. వారి శిష్యులు వారికి బదులుగా యాత్రకు బయలుదేరిరి.
  • ఎరుంబి అప్పా వారికి తమ దివ్య పాదుకలను ప్రసాదిస్తారు.
  • మాముణులు తమ తిరువారాధన పెరుమాళ్ అయిన అరంగనగరప్పన్ని పొన్నడిక్కాల్ జీయర్ వారికి ప్రసాదించి, వానమామలైకి వెళ్ళి, అక్కడ ఒక మఠమును ఏర్పాటు చేసి ధైవనాయక పెరుమాళ్ళకి నిరంతరాయంగా కైంకర్యము చేయమని ఆజ్ఞాపించెను.
  • మరోసారి పాండ్యనాడు దివ్యదేశ యాత్రకు బయలు దేరిరి. పోవు మార్గములో, ఆ ఊరి రాజు (మహాబలి వాననాథ రాయులు) మాముణుల శిష్యులై, అనేక దివ్య దేశముల కైంకర్యములు వారి ఆదేశముల మేరకు చేసిరి.
  • మధురైకి వెళ్ళే దారిలో సేద తీరుటకు ఒక చింతచెట్టు క్రింద విశ్రమించి, బయలుదేరు సమయములో ఆ వృక్షమును తాకి, దానికి మోక్షమును ప్రసాదిన్చిరి. చాలా దివ్య దేశములను మంగళాశాసనము చేస్తూ, చివరిగా శ్రీ రంగము చేరిరి.
  • వారి శిష్యుల ద్వారా చాలా కైంకర్యములు చేసిరి. తిరుమాలిరుంజోలై అళగర్కి కైంకర్యము చేయుటకు ఒక జీయర్ స్వామిని అక్కడికి పంపించిరి.
  • పెరియ వాచ్చాన్ పిళ్ళై పెరియాళ్వార్ తిరుమొళికి వ్యాఖ్యానము వ్రాసిరి, కాని అందులో కొంత భాగము చేజారి పోయినందువల్ల, కోల్పోయిన భాగమునకు మాముణులు వ్యాఖ్యానమును వ్రాసిరి.
  • వారు అస్వస్థతకు గురి అయినను, వ్రాయడము మానలేదు. ఆచార్య హృదయము చాలా కష్టముగా వ్రాయు సమయములో, వారి శిష్యులు ఎందులకు ఇంత కష్టమునకు ఓర్చి వ్రాయడం అని అంటే, అది వచ్చే తరములోని వారి పిల్లా పాపల ఉజ్జీవించ కొరుకుటయే అని సమాధానము ఇచ్చిరి.
  • తమ తిరుమేనిని వదిలి పరమపదము చేరుటకు మిక్కిలి ఆశ పెరిగి, ఆర్తి ప్రబంధము వ్రాసిరి. అందులో వారు ఎమ్పెరుమానార్లను, తనను శీఘ్రముగా తన శ్రీ పాదముల దగ్గరకు చేర్చు కోవలెనని, ఈ శరీరము నుండి బయటకు పడ వేయ వలెనని రోదిస్తారు. దీని ద్వారా మనము ఎట్లు ఎమ్పెరుమానార్లను ప్రార్థించ వలేనో చూపిరి. ఎందులకు అనగా వారే స్వయముగా ఎమ్పెరుమానార్లు కాబట్టి.
  • చివరిగా వారు ఈ లీల విభూతిలో తన కార్యక్రమములు అన్నింటిని ముగించుకొని పరమపదమునకు తిరిగి వెళ్ళి ఎమ్పెరుమాన్ యొక్క నిత్య కైంకర్యము చేయుటకు నిశ్చయించుకొనిరి. అన్ని అరుళిచ్చెయళ్ను ఒకసారి వినాలనే ఆశ తెలియజేసిరి. అందరు శిష్యులు ఎంతో ప్రేమ మరియు ఈడుబాటుతో వారి కోరిక మేరకు అట్లే ఏర్పాటు చేసిరి. మాముణులు సంతోషించి ఒక పెద్ద తదియారాధనను నిర్వహించి, వారి శిష్యుల దగ్గర క్షమ ప్రార్థన అడుగుతారు. వారి శిష్యులు వారిని ఏ దోషము లేని వారని, క్షమా ప్రార్థన అడుగవలెదని చెప్పిరి. పెరియ పెరుమాళ్ మరియు నమ్పెరుమాళ్ యొక్క కైంకర్యములు పూర్తి శ్రద్ధా భక్తులతో జరుగునట్టు గమనించ వలెనని అందరితో విన్నవించిరి.
  • ఆ తరువాత “పిళ్ళై తిరువడిగళే శరణం”, వాళి ఉలగాశిరియన్” మరియు “ఎమ్పెరుమానార్ తిరువడిగళే శరణం” అని చెప్పిరి. వారి కన్నులను బారేడుగా చేసి ఎమ్పెరుమాన్ దర్శనము కొరకు చూడగా, వెంటనే ఎమ్పెరుమాన్ గరుడారూహూడై ప్రత్యక్షమై తనతో పాటు తీసుకు వెళ్ళిరి. ఈ విధముగా వారి ఒక్క లీలను ఈ విభూతిలో అతి వైభవముగా ముగించిరి. ఇది చూచిన శ్రీ వైష్ణవులు అందరు బాధతో కన్నీరు మున్నీరుగా ఏడ్చిరి. పెరియ పెరుమాళ్ళకు తాను లేని లోటు ఎంత వరకు బాధించింది అనగా వారు భోగములను గై కొనుటయే మానుకొనిరి. చివరకు తమలను తామే ఒకరితో ఒకరిని సమాధానము చేసుకొని చరమ కైంకర్యములను మొదలు పెట్టిరి. తిరువధ్యయాన ఉత్సవము పెరియ పెరుమాళ్ యొక్క అజ్ఞానుసారముగా వారి బ్రహ్మోత్సవముల కంటే గొప్పగా నిర్వహించిరి.
  • పొన్నడిక్కాల్ జీయర్ వడ నాట్టు దివ్య దేశముల యాత్ర నుండి వచ్చి మాముణుల చరమ కైంకర్యమును చేయుదురు.

మాముణుల సూచనలు (జ్ఞాన /అనుష్టాన పూర్తి)

1. ఒక సమయములో ఇద్దరు శ్రీ వైష్ణవుల మధ్య భేదాభిప్రాయములు వచ్చాయి. అప్పుడు, రెండు వీధి కుక్కలు వీధిలో పడి ఆ ఇద్దరి శ్రీ వైష్ణవులు ముందు కొట్టుకుంటునవి, వాటిని చూసి “ఇంత అహంకారము ఉండుటకు కారణము మీరు కూడా ఈ ఇరువురు శ్రీ వైష్ణవుల వలె శ్రీ వచన భూషణమును నేర్చుకొంటిరా” అని అడిగెను. వెంటనే వారి తప్పులను తెలుసుకొని, నిష్కల్మశులైరి.

2. వడ దేశములందు ఎవరైనా ధనమును ఇచ్చి, ఆ ధనము సక్రమ పద్దతిలో ఆర్జించ లేనిచో వారు దానిని తిరిగి ఇచ్చి వెయుదురు. లౌకిక ధనముపై ఏ ఆశను చూపించరు. కేవలము శ్రీ వైష్ణవుల నుండి మాత్రమే కైంకర్యమునకు ధనము / వస్తువు సేకరింపబడేల చూచుదురు.

3. ఒకనాడు ఒక వృద్ధ వనిత మఠమునకు వచ్చి, ఆ రాత్రి తను అక్కడ ఉండుటకు అనుమతి ఇవ్వమని కోరినది. ఆవిడ కోరికను నిరాకరించి , “ఒక ముసలి ఉడుత కూడా చెట్టు ఎక్క గలదు” అని చెప్పిరి అనగా ఒక వృద్ధురాలు మఠములో ఉన్నను, మాముణుల వైరాగ్యముపై లోకులు సఖించగలరు. వీరి వైరాగ్య నిష్ఠపై ఎవరికైనా ఏ చిన్న సంధేయము వచ్చెటువంటి పనులను చేయజాలరని చెప్పిరి.

4. ఒక్క నాడు ఒక శ్రీ వైష్ణవ అమ్మగారు కూరగాయులు తరుగుటలో సహాయము పరిపూర్ణమైన భక్తితో చేయనందు వల్ల, తనను 6 మాసములు కైంకర్యమునకు దూరముగా ఉండవలెనని దండన ఇచ్చిరి. ఎందుకంటే, మాముణుల కైంకర్యపరులు వారి పూర్తి భక్తి విశ్వాసములతో భగవత్/భాగవత్ నిష్ఠలో ఉండవలెనని ఆశించేదురు.

5. వరం తరుం పిళ్ళై అనే శ్రీ వైష్ణవుడు మాముణుల దగ్గరకు ఒంటరిగా వాచ్చిరి. అది గమనించి శ్రీ వైష్ణవులు ఎమ్పెరుమాన్ /ఆచార్యులు దగ్గరికి ఒంటరిగా వెళ్ళ రాదని, శ్రీ వైష్ణవులతో గోష్ఠిగా వెళ్లాలని చెప్పిరి.

6. ఎన్నో మార్లు భాగవత్ అపచారముల యొక్క కృరత్వము గురించి చెప్పిరి. అదే విధంగా శ్రీ వైష్ణవులు ఒకరితో మరి ఒక్కరు మర్యాదతో వ్యవహరించ వలెనని భోదించిరి.

7. ఒక్క భట్టర్ మాముణుల వద్దకు తమ శిష్యులు తనని సరిగ్గా గౌరవ మర్యాదలు ఇవ్వట్లేదని చెప్పిరి, అందుకు వారు శిష్యులతో పెరుమాళ్ పిరాట్టియార్లు ఆచార్యులలో ఉందురని భావిస్తూ వారితో ఎప్పుడు గౌరవ మర్యాదలతో మెలగవలెనని మందలించిరి.

8. వడ నాట్టు నుండి ఒక ధనవంతుడైన శ్రీ వైష్ణవుడు మాముణుల వద్దకు వచ్చి శ్రీ వైష్ణవ లక్షణములను విశదికరించి అడిగిరి. మాముణులు నిజమైన శ్రీ వైష్ణవుని లక్షణమును ఈ విధంగా వివరించిరి.

  • ఎమ్పెరుమానే సర్వస్వం అని ఆశ్రయించిన మాత్రమున సరిపోదు.
  • ఎమ్పెరుమాన్ యొక్క సంబంధమును శంఖ చక్రముల (సమాశ్రయనము) లాంఛనము ద్వారా పొందిన మాత్రమున సరిపోదు.
  • నిత్యము ఎమ్పెరుమాన్ యొక్క కైంకర్యముగా తిరువారాధనము చేయుట మాత్రమున సరిపోదు.
  • తమ ఆచార్యునికి పరతంత్రముగా ఉండుట మాత్రమున సరిపోదు.
  • భాగవతులకు కైంకర్యము చేస్తూ ఉండుట మాత్రమున సరిపోదు.
  • ఇవి అన్నియు కలిగి ఉండవలెను, ఇంకనూ ముఖ్యముగా కొన్ని ఉండవలిసినవి / కావలసినవి /చేయవలసినవి ఉన్నవి.
  1. ఎమ్ఫెరుమాన్ ముఖ విలాసము చెందించే, ఆయా సందర్భములలో తగునట్టి ఉచితమైన కైంకర్యములు చేయవలెను.
  2. వారి వారి గృహములను శ్రీ వైష్ణవులు తమ ఇష్టనుసారముగా ఉపయోగించుకొనుటకు ఏర్పర్చుకొనవలెను.
  3. పెరియాళ్వార్ శ్రీ సూక్తి “ఎన్ తమ్మై విర్కవుం పెరువార్గాళే” ప్రకారముగా ఉండవలెను (శ్రీ వైష్ణవులు మన స్వాములు అయినందున మనలను క్రయ విక్రయము చేయుటకును పరిపూర్ణ అధికారము కలవారు)
  • భాగవత శేషత్వం పెంపొందించుకున్న తరువాత ఎమ్పెరుమాన్ మరియు ఆళ్వార్ ఆచార్యుల అనుగ్రహము చేత మన సాంప్రదాయ అర్థ విశేషములను చాలా సులభముగా నేర్చుకొనగలము. చరమ పర్వ నిష్ఠ అయిన భాగవత శేషత్వమును ఆచరిస్తూ ఉండడము వలన ఇటువంటి శ్రీ వైష్ణవులు మరి ఏ ఇతరమైన విశేష అర్థములను తెలుసుకొనుట అవసరము లేదు.
  • మనము ఆచరణ చేయని విషయములను ఇతరులకు ఉపదేశించటము వ్యర్థము. అది ఏ విధముగా ఉండుననగా ఒక వ్యభిచారి పవిత్రత గురించి ఉపదేశించుమాదిరిగా ఉండును.
  • శ్రీ వైష్ణవుల కైంకర్యము కన్నా మిన్న కైంకర్యము మరి ఒక్కటి లేదు, శ్రీ వైష్ణవుల పట్ల అపచారము కన్నా క్రూరమైన అపచారము ఇంకొకటి లేదు.

ఈ లక్షణములు అన్నింటిని విన్న ఆ శ్రీ వైష్ణవుడు మాముణుల పట్ల భక్తి శ్రద్ధలతో ఎల్లప్పుడూ వారినే స్మరిస్తూ ఉండిరి.

మన సంప్రదాయములో మాముణులకు గల ప్రతేక స్థానము: 

  • ఏ ఆచార్యుల వైభవమునైనా సంగ్రహముగా మాట్లాడగలము కాని మాముణుల వైభవము అపరిమితమైనది. వారు కూడా వారి యొక్క వేయి నాలుకలతో (ఆదిశేశులుగా) కూడా తమ కీర్తిని గురించి చెప్పలేరు, అందువలన మనము ఏ విధముగా పూర్తి సంతృప్తి చెందలేము. మనము కాస్తైనా ఈ విధముగా వీరి వైభవమును గురించి మాట్లాడి చదువుటచే అపరిమిత లాభము పొందితిమని సంతృప్తి చెందవలసినదే.
  • వీరిని పెరియ పెరుమాళ్ తమ ఆచార్యులుగా అంగీకరించి ఆచార్య రత్న హారమును మరియు ఓరాణ్ వళి గురు పరమ్పరను పూర్తి చేసిరి.
  • పెరియ పెరుమాళ్ వీరికి శిష్యులుగా ఉండి, వారి యొక్క శేష పర్యంకమును మాముణులకి సమర్పించిరి, ఇది ఇప్పడికినీ మనము చూడవచ్చు – ఏ ఇతర ఆళ్వార్/ఆచార్యులకు లేని విధముగా ఒక్క మాముణులకు మాత్రమే శేష పర్యంకము/పీఠము కలిగి ఉండును.
  • పెరియ పెరుమాళ్ తమ యొక్క ఆచార్యుల కొరకు, ఒక తనియన్ వ్రాసి, మాముణులకి సమర్పించిరి మరియు ఆ తనియన్ని తప్పక అరుళిచ్చెయల్ గోష్ఠిలో ఏ ప్రదేశములోనైనా మొదట మరియు చివర తప్పక అనుసందిచ వలనని ఆదేశించిరి – గుళ్ళలో, మఠములలో, తిరుమాళిగలలో మొదలైన చోట్ల.
  • ఆళ్వార్ తిరునగరిలో, ఐప్పసి తిరుమూలము (మాముణుల తిరునక్షత్రము) రోజున, ఆళ్వార్, తమ తిరుమంజనము తదుపరి, తమ యొక్క పల్లకి, కుడై, చామరము, వాద్యము, మొదలగునవి మాముణుల సన్నిదికి పంపి వారిని తన వద్దకి తీసుకొని వద్దురు. ఒక్క మాముణులు మాత్రమే వచ్చిన పిదప, వారు తిరుమణ్ కాప్పుని ధరించి ప్రసాదమును మాముణులకి ప్రసాదిస్తారు.
  • మన పూర్వాచార్యులలో ఒక్క మాముణులు ఒక్కరికి మాత్రమే తిరు అద్యయనమును చేయుదురు. సాధారణముగా తిరు అద్యయనమును శిష్యులు మరియు కుమారులు మాత్రమే చేయుదురు. కాని వీరి విషయములో, మాముణుల శిష్యులై ఇప్పటికి జీవించి ఉండే శ్రీ రంగ నాథునులు తమ యొక్క ఆచార్యుల తీర్థమును చాలా గొప్పగా చేయుదురు. వారు తమ అర్చకులను, పరిచారకులను, సారెను (తమ యొక్క పల్లకి, కుడై, చామరము, వాద్యము), ఈ మహోత్సవమునకు పంపుదురు. ఈ మహోత్సవ విశేషముల గురించి తెలుసుకొనుటకు  http://www.kaarimaaran.com/thiruadhyayanam.html లో చూడగలరు.
  • మాముణులు తమ గురించి ఎటువంటి ఉత్సవములు జరుపుకోకుడదని ఉద్ధేశించిరి –శ్రీరంగము మరియు ఆళ్వార్తిరునగరిలో, వారు తమ అర్చా తిరుమేనులు చాలా చిన్నగా ఉండవలెనని, ఎటువంటి పురప్పాడు మొదలగునవి ఉండకూడదని, నమ్పెరుమాళ్ మరియు ఆళ్వార్లకే ఎక్కువ ప్రాముఖ్యము ఇచ్చిరి.
  • అందులకే వారిని మనము అందమైన చిన్న తిరుమేనిలో ఇప్పటికిని ఆ రెండు దివ్యదేశములలో చూస్తున్నాము.
  • మాముణులు ఎంతో వినయ విధేయతలు కలవారు. ఎవరి గురించి కూడా చెడుగా వ్రాయటము చేసేవారు కాదు. మన పూర్వాచార్యుల వ్యాఖ్యానములలో ఎక్కడైనా ఒక చిన్న అర్థ వ్యతిరేకతలు గమనించితే దాని గురించి వ్యర్థమైన మాటలను మాట్లాడక, వాదనమును తప్పు పట్టే వారు కాదు.
  • వారు అరుళిచ్చెయల్ పైన దృష్టి సారించి, వేదాంతమును అరుళిచ్చెయల్ పాశురముల ద్వారా వివరించిరి. వీరి కృషి లేకునచో తిరువాయ్మొళి మరియు దాని అర్థ విశేషములు నదిలో పారపోసిన చింతపండు వలె అయి ఉండేవి అనగా వ్యర్థమై పోయి ఉండేవి.
  • మాముణులు అన్ని గ్రంథములను సేకరించి, వాటికి తానే స్వయముగా అర్థ విశేషములను వ్రాసి, భద్రపరిచిరి. ఈ కారణముగానే, ఇన్ని తరముల తరువాత కూడా అవి మనకు అందుబాటులో ఉన్నాయి.
  • వారు అపార కారుణ్యము గలవారు, ఎవరైనా తమని అవమానించినా/కష్టమునకు గురి చేసినా, వారు ఎప్పుడూ కోపమును ప్రదర్శించక, వారిని ఎల్లప్పూడూ గౌరవించి చాలా ఆదరించేవారు.
  • ఈ విధముగా వారి తిరువడిని మన శిరస్సుపై ధరించిన, అమానవన్ మన చేతిని పట్టుకొందురు. ఏ రోజైతే మాముణుల శ్రీ చరణములను మన శిరస్సుపై ధరించుటకు సిద్ధముగా ఉందుమో, అప్పుడు అమానవన్ (విరజా నదిని దాటుటకు సహాయము చేయువారు) నిశ్చయముగా మన చేతులను పట్టుకొని ఈ సంసార సాగరము నుండి మనలను బయటకు పడ వేయుదురు.
  • ఎమ్పెరుమానార్ల యందు వారికి గల నిబద్దత అసమానమైనది, వారు ఎమ్పెరుమానార్లను ఏ విధముగా ఆరాధించవలెనో  ఆచరణలో చూపిరి.
  • మన పుర్వాచార్యులు వారి గ్రంథములలో శ్రీ వైష్ణవుడి నడవడికను గురించి చెప్పిన విధమునకు వారి జీవితము ఒక ఉదాహరణము. దీని గూర్చి శ్రీ సార స్వామి వారి ఈబుక్ శ్రీవైష్ణవ లక్షణములో చూడవచ్చు.  http://ponnadi.blogspot.in/p/srivaishnava-lakshanam.html.

మాముణుల తనియన్:

శ్రీశైలేశ దయా పాత్రమ్ ధీభక్త్యాది గుణార్ణవమ్
యతీంద్ర ప్రవణమ్ వన్దే రమ్య జామాతరమ్ మునిమ్

తాత్పర్యము: శ్రీ శైలాంశ సంభూతులై ‘తిరుమలై ఆళ్వార్’ అని ప్రసిద్ది చెందిన ‘తిరువాయ్మొళి  పిళ్ళై’ అను శ్రీశైలనాధుల దివ్య నిర్మల కరుణాపూరమునకు ఉత్తమ పాత్రభూతులును, ఙ్ఞాన భక్తి వైరాగ్యాది పరమ కల్యాణ గుణ పరిపూర్ణులగు శ్రీ భగవత్ రామానుజ సంయమింద్రుల దివ్యమంగళ చరణ పంకేరుహము లందు అత్యంత ప్రవణులై, తదేకాంతిక అత్యంతిక పరభక్తి యోగ నిష్ఠులై, ఏకలవ్యుని వలె వారికి అనన్యార్హ శిష్య భూతులైయుండు శ్రీ అళగియ మణవాళ మహాముణులకు సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందును త్రికరణ శుద్దిగా నమస్కరించుచూ సేవించుచున్నాను.

దీనితో మనము ఓరాణ్ వళి ఆచార్య పరంపర పూర్తి చేసుకొన్నాము. ఏ విషయమైననూ తీయనైన పద్దతిలో చెప్పమని చెప్పి ఉండెను. అందువలన మనము ఓరాణ్ వళి పరంపర కూడా మాముణుల చరితముతో పూర్తి చేసినాము, వీరి చరితము కంటే ఈ రెండు లోకములలో (నిత్య విభూతి మరియు లీలా విభూతి) ఏది కూడా ఇంత తీయగా లేదు.

మాముణుల తిరునక్షత్ర మహోత్సవమును ఆళ్వార్తిరునగరి, శ్రీరంగము, కాంచీపురం, శ్రీవిల్లిపుత్తూర్, తిరువహింద్రపురము, వానమామలై, తిరునారయణపురము మొదలగు అనేక దివ్యదేశములలో గొప్పగా జరుపుకుంటారు. మనమూ కూడా శ్రీ రంగనాధులకు ప్రియమైన ఆచార్యులు మరియు మనకునూ ఆచార్యులైన వీరి ఉత్సవములో శుద్దమైన మనసుతో సేవించుదాము.

తదుపరి సంచికలలో మనము మన సంప్రదాయములో గల గొప్ప ఆచార్యులను వైభవమును తెలుసుకుందాము. కాని ఇతర ఆచార్యుల అనుభవమును తెలుసుకొనుటకు ముందు,మామునిగళ్ తిరువడి నిలై అని వారిచే గుర్తించబడి మరియు మామునిగాళ్ యొక్క జీవిత శ్వాస అయిన పొన్నడిక్కాల్ జీయర్ వైభవమును తదుపరి సంచికలో చూద్దాము.

రఘు వంశీ రామానుజ దాసన్

మూలము: https://acharyas.koyil.org/index.php/2012/09/23/azhagiya-manavala-mamunigal-english/

పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

40 thoughts on “అళగియ మణవాళ మామునులు”

Comments are closed.